
విక్రమపురంలో తరగతులు జరగక దిక్కులు చూస్తున్న విద్యార్థులు
సర్కార్ బడులు అయ్యవార్ల కొరతతో అల్లాడుతున్నాయి. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా ఉపాధ్యాయులు లేకపోవడంతో తరగతులు జరగని పరిస్థితులు నెలకొన్నాయి. సకాలంలో పాఠ్య పుస్తకాలు రాక ఇన్నాళ్లూ బోధన పడకేయగా.. ఇప్పుడు ఉపాధ్యాయుల కొరతతో అదే పరిస్థితి పునరావృతమైంది. వందలాది పోస్టులు ఖాళీగా ఉన్నా వీటి భర్తీపై ప్రభుత్వం కనీసం దృష్టిసారించడం లేదు. డిప్యుటేషన్లు కోరుతూ దరఖాస్తు చేసుకున్న వారి ఫైల్ కూడా ముందుకు కదల్లేదు. ఫలితంగా.. సర్కార్ విద్య మిథ్యగా మారింది.
వీరఘట్టం శ్రీకాకుళం : ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు సక్రమంగా సాగడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఉపాధ్యాయుల కొరతే. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోవడంతో దీని ప్రభావం బోధనపై పడింది. ఎక్కువ ఉపాధ్యాయులు ఉండి తక్కువ మంది విద్యార్థులు ఉండే పాఠశాలలు, అలాగే విద్యార్థులు ఎక్కువ మంది ఉండి తక్కువ మంది ఉపాధ్యాయులు ఉండే పాఠశాలల్లో సర్దుబాటు చేసేందుకు జూలై రెండో తేదీలోగా నివేదికలు ఇవ్వాలని జూన్‌లో రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు.
దీంతో జిల్లాలోని అన్ని మండలాల విద్యాశాఖాధికారులు ఆఘమేఘాల మీద నివేదికలు తయారు చేసి జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపించారు. ఈ నివేదికలు పంపించి నెల రోజులు గడుస్తున్నా ఫైల్ ముందుకు కదల్లేదు. కలెక్టర్ ఆమోదం కోసం ఫైల్ ఎదురుచూస్తోంది.
ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ నిలిచిపోవడంతో పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల్లేక బోధన జరగని పరిస్థితి నెలకొంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై సుమారు రెండు నెలలు కావస్తున్నప్పటికీ ఈ ప్రక్రియపై విద్యాశాఖాధికారులు స్పందించకపోడవంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలో పరిస్థితి ఇలా..
జిల్లాలోని సర్కారు బడుల్లో ఉపాధ్యాయుల సంఖ్య తగినంతగా లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 2,370 ప్రాథమిక, 431 ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 477 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 2,53,833 మంది ఈ ఏడాది విద్యనభ్యసిస్తున్నారు. డైస్ లెక్కల ప్రకారం వీరికి పాఠ్యాంశాలుబోధించేందుకు 14,218 మంది ఉపాధ్యాయులు ఉండాలి. అయితే ప్రస్తుతం 13,393 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 825 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఏటా సర్దుబాటే!
టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఉపాధ్యాయ పోస్టుల నియామకం జరగలేదు. దీంతో విద్యాశాఖ ప్రతీ ఏటా సర్దుబాటు పేరుతో కాలయాపన చేస్తోంది. విద్యార్థులు ఎక్కువగా ఉన్న చోట ఉపాధ్యాయులు తక్కువగా ఉండడం, అలాగే ఉపాధ్యాయులు ఎక్కువగా ఉండి విద్యార్థులు తక్కువగా ఉండే పాఠశాలలను గుర్తించి సర్దుబాటుతో సరిపెడుతున్నారు.
ఈ ఏడాది కూడా సర్దుబాటు ప్రక్రియ త్వరగా ప్రారంభమైనప్పటికీ రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా ఉండడంతో ఈ ఫైల్ ముందుకుకదల్లేదు. సంబంధిత ఫైల్ ఏకంగా బుట్టదాఖలైనట్టేననే అనుమానాన్ని సైతం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.
డిప్యుటేషన్ కోసం 73 మంది ఎదురుచూపు
టీచర్ల పని సర్దుబాటు జరగకపోవడంతో జిల్లా వ్యాప్తంగా 73 మంది స్కూల్ అసిస్టెంట్లు తమకు అనుకూలంగా ఉన్న పాఠశాలల్లో డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు దరఖాస్తులు చేసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులతో డిప్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ప్రస్తుతం ఈ ఫైల్‌ను జిల్లా కలెక్టర్ అనుమతుల కోసం విద్యాశాఖ అధికారులు పంపించారు. అయితే ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు ఎక్కువగా ఉండడంతో జిల్లా కలెక్టర్ ఈ ఫైల్‌ను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
కొన్ని పాఠశాలల్లో ఉదాహరణకు ఇలా..
వీరఘట్టం మండలం గడగమ్మ, పాలమెట్ట, అడారు, తెట్టంగి, వీరఘట్టం కూరాకులవీధి, బిటివాడ ప్రాథమిక పాఠశాలల్లో 6 ఎస్జీటీ పోస్టులు, సంతనర్శిపురం హైస్కూల్‌లో ఒక స్కూల్ అసిస్టెంట్ పోస్టు, తెట్టంగి హైస్కూల్‌లో తెలుగు పండిట్ పోస్టు ఖాళీగా ఉన్నాయి. ఈ పాఠశాలల్లో పనిచేసిన ఉపాధ్యాయులు రిటైర్డ్ కావడంతో ఖాళీలు ఏర్పడ్డాయి.
అలాగే ఆగస్టు నెలలో చేబియ్యంవలస, కొంచ ప్రాథమిక పాఠశాలల్లో ఇద్దరు ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ చేయనున్నారు. అంటే వీరఘట్టం మండలంలో 10 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల విక్రమపురం పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడిని విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. దీంతో ఇక్కడ కూడా ఓ ఖాళీ ఏర్పడింది.
అలాగే పాలకొండ మండలం తంపటాపల్లి, ఓని పాఠశాలల్లో రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వంగర మండలంలో 11, సంతకవిటిలో 14, రాజాంలో 12, రేగిడిలో 9.. ఇలా జిల్లా వ్యాప్తంగా 250 టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించారు. వీటితో పాటు గత నాలుగేళ్లుగా పదవీ విరమణ చేసిన 575 మంది ఉపాధ్యాయ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి.
అయితే విద్యార్థుల సంఖ్య పాఠశాలల్లో క్రమేపీ తగ్గుతున్న నేపథ్యంలో అంతమంది ఉపాధ్యాయుల అవసరం లేనప్పటికీ జిల్లాలో 250 పోస్టులు సర్దుబాటు చేయాల్సి ఉందని విద్యాశాఖ అధికారులంటున్నారు.
హిందీపై పట్టు కోల్పోతున్నారు..
వీరఘట్టం మండలం నడిమికెల్ల యూపీ పాఠశాలలో 160 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే హిందీ పండిట్ లేకపోవడంతో విద్యార్థులు సబ్జక్టుపై పట్టుకోల్పోతున్నారు. ఇలా జిల్లాలో చాలా పాఠశాలల్లో ఇదే పరిస్థితి. ఖాళీగా ఉన్న పోస్టుల్లో సర్దుబాటు చేసి ఉపాధ్యాయులను నియమించాలి.
– బంకురు అప్పలనాయుడు, పీఆర్‌టీయూ జిల్లా కార్యవర్గ సభ్యుడు
Comments
Please login to add a commentAdd a comment