ఎంతెంత దూరం | Slow down of the Kanaka Durga Fly over | Sakshi
Sakshi News home page

ఎంతెంత దూరం

Published Tue, Jan 17 2017 11:24 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

ఎంతెంత దూరం - Sakshi

ఎంతెంత దూరం

సాక్షి, అమరావతి బ్యూరో : విజయవాడ నగరానికి మణిహారంగా నిర్మిస్తున్న ‘కనకదుర్గ ఫ్లై ఓవర్‌’ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కృష్ణా పుష్కరాల నాటికి (ఆగస్టు, 2016) ఈ పనులు పూర్తి కావాల్సి ఉంది. ‘సోమా కనస్ట్రక్షన్‌’ కంపెనీ ఈ పనులను చేపట్టింది. ఎనిమిది నెలల్లో నిర్మించేలా ఒప్పందం చేసుకుంది. కానీ, ఏడాది గడిచింది. అయినా పనులు ఇంకా పూర్తి కాలేదు. ఇంజినీర్లు చెబుతున్నట్లుగా ఈ ఏడాది జూన్‌కు పనులు పూర్తయ్యేలా ఉన్నాయి. పనుల్లో జాప్యం కారణంగా దుర్గగుడికి వచ్చే భక్తులకు.. ఈ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు.

ఈ ఫ్లై ఓవర్‌ ఎప్పటికి పూర్తవుతుందోనని అందరూ ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. విజయవాడ నగరంలో రూ.447.80 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఫ్లై ఓవర్‌ పనులకు 2015 డిసెంబరులో కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ 50 శాతం పనులు కూడా పూర్తి కాక పోవడం గమనార్హం. ఫ్లై ఓవర్, రోడ్డు పోర్షన్, అప్రోచ్, సైడ్‌ డ్రెయిన్స్, సబ్‌వే అప్రోచ్‌ పనులు పూర్తి కావాల్సి ఉంది. మరో ఆర్నెల్లు గడిచినా ఈ పనులు పూర్తయ్యేలా కనిపించడం లేదు. దుర్గగుడి వద్ద 5.12 కిలోమీటర్ల నిడివిలో ఫ్లై ఓవర్‌ నిర్మాణంతోపాటు నాలుగు లేన్ల రహదారి విస్తరణ పనులను చేపట్టిన ‘సోమా’ కంపెనీ 2016 డిసెంబరు నాటికి పూర్తి చేయాల్సి ఉంది. జనవరి వచ్చి 15 రోజులు గడిచినా సగం పనులు మాత్రమే జరిగాయి.  భూ సేకరణలో జాప్యం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎనిమిది నెలల్లో పూర్తి కావాల్సిన  పనులకు 18 నెలలు సమయం పట్టడం గమనార్హం.  

2.55 కిలోమీటర్లు.. 51 పిల్లర్లు
పెట్రోలు బంకు నుంచి రాజీవ్‌గాం«ధీ పార్కు వరకు 2.55 కిలోమీటర్ల పొడవునా ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మిస్తున్నారు. మొత్తం 51 పిల్లర్లు నిర్మించాల్సి ఉంది. పిల్లర్ల నిర్మాణ పనులు మాత్రమే పురోగతిలో ఉన్నాయి. ఇప్పటి వరకు 45 పిల్లర్లు పూర్తి చేశారు. మిగిలిన వాటిలో కృష్ణానదిలో 3, కాలువలో 2, రహదారిపై ఒక పిల్లర్‌ పనులు చేపట్టాల్సి ఉంది. ఫ్లై ఓవర్‌ అప్రోచ్‌ పనులు ఇంకా ప్రారంభించలేదు. రక్షణ గోడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.భవానీపురం క్యాస్టింగ్‌ డిపోలో స్లాబ్‌ పనులు జరుగుతున్నాయి. కనీసం నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేస్తే హైదరాబాద్, భద్రాచలం, మైలవరం వైపు వెళ్లే వాహనాలకు సౌకర్యంగా ఉంటుంది.

ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో..
ఫ్లై ఓవర్‌ పనులు నత్తతో పోటీపడుతుండడంతో నగరంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎక్కువయ్యాయి. హైదరాబాద్, భద్రాచలం వైపు వెళ్లే వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు దుర్గగుడికి మన రాష్ట్రంతోపాటు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. ఇబ్రహీంపట్నం నుంచి భారీ వాహనాలను నూజివీడు వైపు మళ్లిస్తున్నారు. మరికొన్ని గొల్లపూడి నుంచి బైసాస్‌ మీదుగా ఊర్మిళానగర్, కబేళా, మిల్క్‌ప్రాజెక్టు, ఇన్నర్‌రింగు రోడ్డు వైపు మళ్లిస్తున్నారు. విజయవాడ బస్టాండు, రైల్వేస్టేషన్‌కు రావాల్సిన బస్సులు, ఇతర వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జూన్‌ నాటికి పూర్తయ్యేనా..
ఫ్లై ఓవర్‌ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్‌ నాటికి పూర్తి చేయించాల్సిందిగా సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇంజినీర్లు మాత్రం జూన్‌ వరకు పనులు సాగుతాయని చెబుతున్నారు. ఇప్పటి వరకు 60 శాతం మేర స్లాబ్‌ పను లు పూర్తయ్యాయి. మిగిలిన వాటిని కూడా తయారు చేసి వాటిని ఫ్లై ఓవర్‌పై బిగించాల్సి ఉంది. ఈ పనులకు ఎంత లేదన్నా ఐదారు నెలల సమయం పడుతుంది. ఇక అప్రోచ్‌ పనులు చేపట్టే విషయంలో తీవ్ర జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పుష్కర ఘాట్ల పనులను దక్కించుకున్న ‘సోమా’ సంస్థ వాటిపై దృష్టి సారించి, ఫ్లై ఓవర్‌ పనులను అప్పట్లో నిలిపివేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement