ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్:రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చంచల్‌గూడ జైలులో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు జిల్లావ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరవధిక, రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఒంగోలులో విద్యార్థి విభాగం నాయకుడు రవీంద్ర నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. పెద్దారవీడులోని సానికవరంలో విద్యార్థి ఒగ్గుల లక్ష్మీరెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. అలాగే సంతనూతలపాడు లో నాయకులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. మార్కాపురం, కనిగిరి, కొమరోలు మండలం పుల్లారెడ్డిపల్లి, పామూరుల్లో నాయకులు రిలే దీక్షలు చేపట్టారు.