స్వార్ధ రాజకీయాలకోసం విచక్షణా రహితంగా రాష్ట్రాన్ని విభజించిన సోనియాగాంధీని తెలుగుజాతి క్షమించదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
కొరిటెపాడు(గుంటూరు) : స్వార్ధ రాజకీయాలకోసం విచక్షణా రహితంగా రాష్ట్రాన్ని విభజించిన సోనియాగాంధీని తెలుగుజాతి క్షమించదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. రాష్ట్ర విభజన పాపంతో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో డిపాజిట్ కోల్పోయిందన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోనియాగాంధీ ఈ 10 నెలల కాలంలో ఎక్కడ ఉన్నారో తెలియదని, నేడు తెలుగు ప్రజలపై మొసలి కన్నీరు కార్చడం దుర్మార్గమన్నారు. నాడు విభజన చట్టంలో ఏపీకి ఎలాంటి హామీలు ప్రకటించకుండా నేడు తెలుగు ప్రజలపై ప్రేమ ఒలకబోయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కనీసం వార్డు మెంబర్‌గాకూడా గెలుచుకోలేని కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాలు సేకరణ చేపట్టడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.
ఈ నెల 21వ తేదీన తుళ్లూరు మండలం అనంతవరంలో పంచాంగ శ్రవణం ఉగాది వేడుకలు జరపనున్నట్లు చెప్పారు. కవులు, రచయితలను ఈ సందర్భంగా సన్మానించనున్నట్లు తెలిపారు. శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగదని స్పష్టం చేశారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎ.ఎస్.రామకృష్ణను గెలిపించాలని కోరారు.
మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలకు పారిశ్రామిక రాయితీలను వ్యతిరేకించిన వీరప్పమొయిలీని పార్లమెంట్ నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో టీడీపీ ప్రభుత్వం కేంద్రంపై రాజీలేని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, జి.వి.ఆంజనేయులు, నక్కా ఆనందబాబు, పార్టీ నాయకులు మన్నవ సుబ్బారావు, మద్ధాళి గిరిధర్, దాసరి రాజామాష్టారు తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.