మాట్లాడుతున్న మంత్రి గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ హరికిరణ్, వీసీ ఆచార్య అత్తిపల్లి రామచంద్రారెడ్డి
వైవీయూ: సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుని ప్రగతిపథంలో నడవాలని రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. జ్ఞానభేరిలో భాగంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 25వేల కోట్లను విద్యకు కేటాయిస్తోందన్నారు. విలువలతో కూడిన విద్య అందించాలన్నారు. విద్యారంగంలో 17వ స్థానంలో ఉన్న మనరాష్ట్రం నేడు 3వ స్థానంలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఒక ఐడియా మీ జీవితాలనే మారుస్తుందని.. సరికొత్త ఆలోచనగా అమరావతిలో ల్యాండ్‌పూలింగ్ విధానం విజయవంతమైందన్నారు. ప్రణాళికాబద్ధంగా హార్డ్‌వర్క్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. చలనం ఉన్న ఏదీ ఆగిపోకూడదని.. లక్ష్యం చేరేలా కష్టపడి పనిచేయాలని సూచించారు. టెక్సాస్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ కర్బారీ, డాక్టర్ అశ్వంత్‌లు మాట్లాడుతూ లక్ష్యాలను సాకారం చేసుకునేందుకు శ్రమించాలని.. జీవితంలో సాధించలేనిది లేదన్నారు. ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలే తప్ప నేలచూపులు తగవన్నారు. మాటలు ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలని.. వినడం కూడా ఒక కళ అన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ఎస్. విజయరాజు, కార్యదర్శి వరదరాజన్‌లు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని.. ఆకాశమే హద్దుగా నవ ఆలోచనలతో ముందుకు సాగాలన్నారు. జ్ఞానభేరి కార్యక్రమానికి సంబంధించిన ఫీడ్‌బ్యాక్‌ను జ్ఞానభేరి యాప్‌ద్వారా తెలియజేయాలన్నారు.
వ్యక్తిత్వ వికాస నిపుణుడు డా. వర్లు మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా మనందరం మారాలని సూచించారు. నిద్రానంగా ఉన్న శక్తులను మేల్కొలిపి నూతన ఆవిష్కరణలు చేయాలని సూచించారు. అవధాని గరికపాటి నరసింహారావు, సినీ నేపథ్యగాయకుడు గంగాధరశాస్త్రిలు మాట్లాడుతూ ప్రపంచానికి జ్ఞానం అందించిన గొప్ప పుణ్యభూమి భారతదేశమన్నారు. విద్యార్థులకు విలువలతో కూడిన విద్య, చదువు, సంస్కారం, సమాజహితం, మానవ జీవనంలో భగవద్గీత ప్రాధాన్యత, లక్ష్యాల గురించి సుదీర్ఘంగా వివరించారు. వైవీయూ వైస్ చాన్స్‌లర్ ఆచార్య అత్తిపల్లి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ 10 సంవత్సరాల వయసు గల విశ్వవిద్యాలయంలో ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం ఒక చరిత్రగా ఆయన అభివర్ణించారు. జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని కళాశాలల నుంచి దాదాపు 80వేల మంది విద్యార్థులను జ్ఞానభేరిలో భాగస్వాములను చేశామన్నారు. ఉన్నత విద్యామండలి ప్రతినిధి వెంకట్ ఈదర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అమెరికాలో చదువుకోవాలంటే ప్రభుత్వం రూ.లక్షలాది రూపాయలు సబ్సిడీ ఇస్తూ చదివించేందుకు సరికొత్త పథకం తెస్తోందన్నారు. ఇందులో భాగంగా టెక్సాస్ యూనివర్సిటీ వారితో ఒప్పందం చేసుకుంటున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కె. చంద్రయ్య స్వాగతోపన్యాసం చేయగా.. వైవీయూ అధ్యాపకులు డాక్టర్ ఎన్. ఈశ్వరరెడ్డి, వినోదినిలు తమ సంభాషణలతో సభికులను అలరించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి అధికారులు, వైవీయూ పాలకమండలి సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment