కన్నవారిపై కిరాతకం | subject property disputes often | Sakshi
Sakshi News home page

కన్నవారిపై కిరాతకం

Published Fri, Jun 12 2015 12:16 AM | Last Updated on Sun, Sep 3 2017 3:35 AM

కన్నవారిపై కిరాతకం

కన్నవారిపై కిరాతకం

ఆస్తి కోసం కొడుకే కిరాతకుడయ్యాడు. కన్నవారిని బతి కుండగానే నిప్పంటించి కడతేర్చాడు. సభ్యసమాజం నివ్వెరపోయేలా జరిగిన

నూజివీడు :  ఆస్తి కోసం కొడుకే కిరాతకుడయ్యాడు. కన్నవారిని బతి కుండగానే నిప్పంటించి కడతేర్చాడు. సభ్యసమాజం నివ్వెరపోయేలా జరిగిన ఈ ఘాతుకానికి మండలంలోని పోతురెడ్డిపల్లి వేదికైంది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన చిల్లిముంతల శోభనాచలం (65), మాణిక్యమ్మ (55) దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. నలుగురికీ వివాహాలయ్యాయి. కొడుకు ఏడుకొండలు(35)కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఏడుకొండలు వివాహ సమయంలో వారికి 10 ఎకరాల పొలం ఉండేది. పొగాకు వ్యాపారంలో నష్టాలు రావడంతో ప్రస్తుతం మూడెకరాలే మిగిలాయి. తండ్రీ కొడుకులిద్దరూ కొంతకాలం వరంగల్‌లో ఉండి వ్యాపారం చేశారు.

ఆస్తి విషయంలో తరచూ వివాదాలు...
తన ముగ్గురు కుమార్తెల వివాహ సమయంలో ఒక్కొక్కరికి ఒక్కో ఎకరం కట్నం కింద ఇస్తానని శోభనాచలం పేర్కొన్నారు. ప్రస్తుతం పొలం అంతా పోయి మూడెకరాలు మిగలడం, అదంతా తన అక్కలకు ఇచ్చేస్తాడనే అనుమానంతో తరచూ ఆస్తి విషయమై ఏడుకొండలు తండ్రితో గొడవ పడుతుండేవాడు. ఈ నేపథ్యంలో ఏడాది క్రితం వరకు నూజివీడు మండలం అన్నవరంలో ఉంటున్న ఏడుకొండలు ఆ తర్వాత తన తండ్రికి గుండె ఆపరేషన్ జరగడంతో భార్యాపిల్లలు సహా పోతురెడ్డిపల్లి వచ్చి నివసిస్తున్నాడు. తండ్రి ఒక పోర్షన్‌లో, కొడుకు మరో పోర్షన్‌లో ఉంటున్నారు. తండ్రీకొడుకుల మధ్య ఇటీవల గొడవలు మరింత పెరిగాయి. దీంతో అద్దె ఇంటికి మారేందుకు శోభనాచలం దంపతులిద్దరూ మూడు రోజుల క్రితం ఇల్లు కోసం తిరిగారు. ఈ నేపథ్యంలో ఏడుకొండలు బుధవారం అర్ధరాత్రి దాటాక రెండు గంటల ప్రాంతంలో తన తల్లిదండ్రులు పడుకుని ఉన్న గదిలోకి కిటికీ గుండా పెట్రోలు పోసి అగ్గిపుల్ల వెలిగించి లోపలికి విసిరాడు. ఈ ఘటనలో శోభనాచాలం, మాణిక్యమ్మ కేకలు వేస్తూ అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో ఏడుకొండలు కూడా స్వల్పంగా గాయపడ్డాడు. వీరి కేకలు విన్న స్థానికులు వచ్చి కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.

ఏడుకొండలును ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ టీఎస్ వెంకటరమణ, సీఐ వీ సుబ్బరాజు, నూజివీడు రూరల్, పట్టణ, ముసునూరు ఎస్‌ఐలు సీహెచ్ నాగప్రసాద్,  బోనం ఆదిప్రసాద్, విజయ్‌కుమార్‌లు సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. చికిత్స పొందుతున్న ఏడుకొండలును, అతని భార్య రాజ్యలక్ష్మిని విచారించారు. మృతుల పెద్దకుమార్తె అయిన బెజవాడ వెంకటేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు ఏడుకొండలు, రాజ్యలక్ష్మిలపై కేసు నమోదు చేశారు. సీఐ వీ సుబ్బరాజు దర్యాప్తు చేస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement