సాక్షి, విశాఖపట్నం: వేసవి ఏ స్థాయిలో భయపెట్టనుందో ముందస్తు సూచనలొచ్చేశాయి. గత నాలుగు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతూ పోతున్నాయి. మరో నెల రోజుల తర్వాత ఉండాల్సిన స్థాయికి ఇప్పుడే చేరుకున్నాయి. విశాఖపట్నం విమానాశ్రయం వద్ద గురువారం గరిష్టంగా 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న నాలుగైదు రోజులు ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశాలున్నాయని ఏయూ వాతావరణ విభాగం విశ్రాంతాచార్యులు ఒ.ఎస్.ఆర్.యు.భానుకుమార్ తెలిపారు. దీనికి వాతావరణంలో అధిక పీడనమే కారణమన్నారు.
అధిక పీడనానికి తోడు తేమ పెరుగుదల: సాధారణంగా మార్చి నుంచి సూర్యుడు - భూమి మధ్య కక్ష్య దూరం తగ్గుతుంది. ఇదే సమయంలో అధిక పీడనం కూడా నెలకొంది. దీని ప్రభావంతో ఆకాశంలో మేఘాలు తక్కువగా ఉంటాయి. దీంతో వాతావరణంలో వేడంతా కిందికి దిగి భూమిపై ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఇవే వాతావరణ పరిస్థితులున్నట్లు వాతావరణ నిఫుణులు చెప్తున్నారు. మరోవైపు.. గాలిలో తేమ శాతం కూడా పెరుగుతోంది. గురువారం విశాఖలో తేమ 85 శాతంగా నమోదైనట్లు విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావం వల్ల హీట్ ఇండెక్స్ పెరిగి సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2, 3 డిగ్రీలు అధికంగా ఉండటంతో పాటు ఉక్కబోత ఎక్కువగా ఉంటుందన్నారు.
సాధారణం కంటే అధికం: గడచిన 24 గంటల్లో రాష్ట్రంలోని రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు 1, 2 డిగ్రీలు అధికంగా నమోదైనట్లు భారత వాతావరణ శాఖ గురువారం నాటి నివేదికలో వెల్లడించింది. కోస్తాంధ్ర, తెలంగాణల్లో కూడా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోద యినట్లు పేర్కొంది.