నల్లపాడు-గుంతకల్ రెండో రైల్వేలైన్‌కు సర్వే పూర్తి | survey completed to nallapadu-guntakal second railway line | Sakshi
Sakshi News home page

నల్లపాడు-గుంతకల్ రెండో రైల్వేలైన్‌కు సర్వే పూర్తి

Published Sat, Dec 28 2013 4:42 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM

survey completed to nallapadu-guntakal second railway line

 మార్కాపురం టౌన్, న్యూస్‌లైన్ :  దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డివిజన్‌లోని నల్లపాడు నుంచి గుంతకల్ వరకు రెండో లైన్  ఏర్పాటుకు సర్వే పూర్తయిందని, వచ్చే మార్చి బడ్జెట్‌లో దీన్ని ప్రవేశపెడతామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాత్సవ తెలిపారు. శ్రీశైలం వెళ్లివస్తూ మార్గమధ్యంలోని మార్కాపురం రైల్వేస్టేషన్‌లో శుక్రవారం ఆయన ఆగారు. స్టేషన్‌ను పరిశీలించి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 426 కోట్ల రూపాయలతో నల్లపాడు నుంచి గుంతకల్ వరకు ఎలక్ట్రికల్ లైన్ ఏర్పాటు చేసేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందన్నారు. బడ్జెట్ అనంతరం పనులు చేపడతామన్నారు. అలాగే మార్కాపురం నుంచి విజయవాడకు కొత్త రైలు మంజూరైనట్లు తెలిపారు.

మార్కాపురం రైల్వేస్టేషన్‌లోని సమస్యలను డీఆర్‌యూసీసీ మెంబర్ షేక్ ఇస్మాయిల్, తదితరులు జీఎం దృష్టికి తెచ్చారు. హౌరా-పుట్టపర్తి సూపర్‌ఫాస్ట్ రైలును బెంగళూరు వరకు పొడిగించాలని, మొదటి ప్లాట్‌ఫాంపై షెడ్డు, ఫ్లోరింగ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. మార్కాపురం రైల్వేస్టేషన్‌ను మోడల్ స్టేషన్‌గా తీర్చిదిద్దాలని, మచిలీపట్నం-యశ్వంత్‌పూర్ రైలును ప్రతిరోజూ నడపాలని, విశాఖపట్నం-గుంటూరు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను నంద్యాల వరకు పొడిగించాలని, గుంటూరు-సికింద్రాబాద్, సికింద్రాబాద్-గుంటూరు రైలును ఫాస్ట్ ప్యాసింజర్‌గా మార్పుచేయాలని, గుంటూరు-డోన్ ప్యాసింజర్‌ను గుంతకల్ వరకు పొడిగించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు.

అనంతరం జీఎంను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గుంటూరు డివిజన్ రైల్వే మేనేజర్ ఎన్‌కే ప్రసాద్, ప్రయాణికుల సంఘ నాయకుడు, డీఆర్‌యూసీసీ మెంబర్ షేక్ ఇస్మాయిల్, సంఘ అధ్యక్షుడు మల్లిక్, సెక్రటరీ ఆర్‌కేజే నరసింహం, గౌరవాధ్యక్షుడు మాలకొండ నరసింహారావు, కోశాధికారి కె.శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ గుంటక వెలుగొండారెడ్డి, గైకోటి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement