వలేటివారిపాలెం : అధికార తెలుగుదేశం పార్టీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. అధికారులను తమ చెప్పుచేతల్లో ఉంచుకుని ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. కేవలం వైఎస్‌ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపే లక్ష్యంగా ముందుకుసాగుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వలేటివారిపాలెం మండ లం శింగమనేనిపల్లి గ్రామంలో బుధవారం జరి గిన సంఘటన ఇందుకు నిదర్శనంగా ఉంది.
శింగమనేనిపల్లి గ్రామంలోని నాంచారమ్మ దేవాలయానికి 31.23 ఎకరాల భూమి ఉంది. స్థానిక టీడీపీ నాయకుల నిర్వాకం కారణంగా గడిచిన రెండేళ్లలో నాలుగుసార్లు ఆ భూమికి కౌలువేలం నిలిచిపోయింది. ఆలయం పరిధిలో మొత్తం 90 ఎకరాల భూములున్నాయని, వాటన్నింటికీ వేలం నిర్వహించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే, ఆలయం పరిధిలో 31.23 ఎకరాల భూములు మాత్రమే ఉన్నాయని, వాటికి మాత్రమే వేలం నిర్వహిస్తాం తప్ప, లేని భూములకు వేలం ఎలా నిర్వహిస్తామని అధికారులతో పాటు గ్రామస్తులు కూడా వాదిస్తూ వస్తున్నారు.
ఈ వివాదంపై రెండేళ్లుగా ఆలయ భూముల వేలం నాలుగుసార్లు వాయిదాపడి ఆదాయం కోల్పోయి ఆలయం అభివృద్ధికి నోచుకోలేదు. దీనిపై స్పందించిన గ్రామంలోని వైఎస్‌ఆర్ సీపీ నాయకులు తగిన ఆధారాలతో కోర్టును ఆశ్రయించి దేవాదాయశాఖ రికార్డుల ప్రకారం ఆలయానికి ఉన్న 31.23 ఎకరాల భూములకు మాత్రమే వేలం నిర్వహించాలని అధికారులకు ఉత్తర్వులు ఇప్పించారు. దీంతో బుధవారం బహిరంగ వేలం నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
ముందుగా దండోరా వేయించి స్థానిక రామాలయంలో వేలంపాట ఏర్పాటు చేశారు. అయితే, వేలంలో పాల్గొనేందుకు రుసుం చెల్లించిన గ్రామానికి చెందిన ఇద్దరు టీడీపీ నాయకులు మధ్యలో వేలం నిలిపివేయాలంటూ పట్టుబట్టారు. 90 ఎకరాలకైతేనే వేలం నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలా కుదరదని, కోర్టు ఉత్తర్వులున్నాయని అధికారులు చెప్పడంతో టీడీపీ నాయకుడు దివి శివరాంను గ్రామానికి పిలిపించారు. వెంటనే గ్రామానికి చేరుకున్న శివరాం అధికారులపై ఒత్తిడి తెచ్చి వేలాన్ని నిలిపివేయించారు. వైఎస్‌ఆర్ సీపీ నాయకులు, ఆలయ ధర్మకర్త చిడిపోతు వెంకటేశ్వర్లు వారించినప్పటికీ ఉద్దేశపూర్వకంగా శివరాం రాద్దాంతం చేసి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం సృష్టించారు.
సమాచారం అందుకున్న సీఐ మధుబాబు కందుకూరు పట్టణ, రూరల్, వలేటివారిపాలెం, గుడ్లూరు ఎస్సైలు వైవీ రమణయ్య, సురేష్‌బాబు, సాంబశివయ్య, హుస్సేన్‌బాషా, సిబ్బందితో గ్రామానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో శాంతిభద్రతల దృష్ట్యా వేలాన్ని నిలిపివేస్తున్నట్లు దేవాదాయ శాఖాధికారులు ప్రకటించారు.మళ్లీ ఎప్పుడు నిర్వహించేది చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. టీడీపీ నేతల కారణంగా ఐదోసారి కూడా వేలం నిలిచిపోవడంతో పాటు గ్రామంలో శాంతిభద్రతల సమస్య తలెత్తి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో స్థానికులు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు.
అధికార పార్టీ అరాచకంz
Published Thu, Aug 28 2014 3:41 AM | Last Updated on Fri, Aug 10 2018 5:38 PM
Advertisement
Advertisement