శ్రీకాకుళం: జిల్లాలోని గురువులు ఆకలితో అలమటిస్తూనే శుక్రవారం పూజలందుకోబోతున్నారు. సెప్టెంబర్-5న గురుపూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు, అధ్యాపకులను సత్కరిస్తూ వస్తుండడం పరిపాటి. అయితే ఈ ఏడాది పలువురు కాంట్రాక్టు అధ్యాపకులకు మూడు నెలలుగా జీతాలు అందక పోవడంతో వారి కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. ఇటువంటి వాటిపై దృష్టి సారించని ప్రభుత్వం గురుపూజోత్సవాన్ని మాత్రం ఘనంగా నిర్వహించాలని, డీఎస్సీని ప్రకటించాలని నిర్ణయించింది. జిల్లాలో కాంట్రాక్టు పద్ధతిన 332 మంది జూనియర్ లెక్చరర్లు, మరో 58 మంది ఒకేషనల్ అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. టైంస్కేల్ కింద ఆరుగురు అధ్యాపకులు, 14 మంది ఒకేషనల్ అధ్యాపకులు విధులు నిర్వహిస్తున్నారు.
వీరందరికీ జూన్ నెల నుంచి నేటి వరకు జీతాలు చెల్లించడం లేదు. టైంస్కేల్ కింద పనిచేస్తున్న ఒకేషన ల్ జూనియర్ లెక్చరర్లకు నేటికీ పోస్టులో కొనసాగింపు ఉత్తర్వులు జారీ చేయక పోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఏటా జూన్ నెల లో వీరికి కొనసాగింపు ఉత్తర్వులు ఇస్తుండగా ఈ ఏడాది ఇవ్వక పోవడంతో వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. కాంట్రాక్టు, టైం స్కేల్ పద్ధతిన పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల సమయంలో హామీఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చిన తరువాత అందుకు భిన్నంగా వ్యవహరి స్తుండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా గురువుల సమస్యలను తీర్చి అటు తరువాత గురుపూజోత్సవాలు వంటివి జరిపిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
అయ్యవార్ల ఆకలి కేకలు !
Published Fri, Sep 5 2014 2:32 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement