పర్చూరు, న్యూస్‌లైన్ :
గతేడాది రైతాంగానికి లాభాలు కురిపించిన వైట్‌బర్లీ సాగు జిల్లాలో మళ్లీ ప్రారంభమైంది. ధర విషయంలో ఆందోళన ఉన్నప్పటికీ వ్యాపార వర్గాల నుంచి సానుకూల సంకేతాలు వెలువడటంతో రైతులు వైట్‌బర్లీ సాగుకు మొగ్గుచూపుతున్నారు. వైట్‌బర్లీ (దేశవాళీ) పొగాకు రాష్ట్రంలోకెల్లా పర్చూరు సబ్‌డివిజన్‌లోనే అత్యధికంగా సాగవుతుంది. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 7 వేల ఎకరాల్లో వైట్‌బర్లీ సాగుచేస్తారు. ఈ మొత్తం విస్తీర్ణంలో 5,500 ఎకరాల వరకు పర్చూరు సబ్‌డివిజన్‌లోనే సాగవుతుంది. జిల్లాలోని అద్దంకి, నాగులుప్పలపాడు మండలాల్లో, గుంటూరు జిల్లా చేబ్రోలు, స్తంభాలగరువు, వినుకొండ ప్రాంతాల్లో దీన్ని సాగుచేస్తారు.
గతేడాది మొత్తం 16 మిలియన్ కేజీల వైట్‌బర్లీ పొగాకు ఉత్పత్తయింది. ఎగుమతుల ఆర్డర్లు పుష్కలంగా ఉండటంతో క్వింటాకు 5 వేల రూపాయలతో మొదలైన కొనుగోళ్లు 7,400 రూపాయల వరకు వెళ్లాయి. మంచి ధర లభించడంతో మూడేళ్లుగా గిట్టుబాటు ధరలేక ఉన్న నిల్వల్ని సైతం అమ్ముకుని రైతులు స్థిమితపడ్డారు. ఈ నేపథ్యంలో వైట్‌బర్లీ సాగుపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. సాగు విస్తీర్ణం గతేడాదితో పోలిస్తే 25 శాతం పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. 20 మిలియన్ కేజీల ఉత్పత్తి వరకు ఇబ్బంది ఉండదని, అంతకు మించి ఉత్పత్తి అయితే ధరల విషయంలో ప్రభావం చూపే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.
వ్యాపారులతో ప్రమాదమే...
రెండు దశాబ్దాలుగా విదేశీమారక ద్రవ్యం ఆర్జించే పంటగా వైట్‌బర్లీ పొగాకు ఖ్యాతి గడించింది. ఎగుమతి ఆర్డర్లు పుష్కలంగా ఉన్నప్పటికీ వ్యాపారులు కూటమికట్టి ధరలను ఎప్పటికప్పుడు తొక్కిపెడుతున్నారు. కొనుగోలు చేసే వ్యాపారులు కేవలం పదిమందిలోపే ఉండటంతో తేలికగా కూటమికడుతున్నారు. పర్చూరు సబ్‌డివిజన్‌లో పండే వైట్‌బర్లీ పొగాకు నాణ్యత కలిగి, అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అయినా వ్యాపారుల మాయాజాలంతో ధరల విషయంలో రైతాంగానికి తగిన న్యాయం జరగడం లేదనే ఆరోపణలున్నాయి.
గుబులు రేకెత్తిస్తున్న మల్లె తెగులు...
పర్చూరు సబ్ డివిజన్‌లోని చాలా గ్రామాల్లో ఏళ్ల తరబడి పంట మార్పిడి చేయకుండా వైట్‌బర్లీ సాగుచేస్తుండటంతో మల్లెతెగులు ఉధృతమవుతోంది. ఈ తెగులు మొక్కవేళ్లకు మల్లెమొగ్గల మాదిరిగా ఏర్పడుతోంది. మొక్క ఎదుగుదలను అడ్డుకుంటుంది. ఈ తెగులు వల్ల దిగుబడులు భారీగా తగ్గుతున్నాయి. ఇప్పటికే సబ్‌డివిజన్‌లోని బోడవాడ, దేవరపల్లి, ఇనగల్లు, చిననందిపాడు, వీరన్నపాలెం, ఉప్పుటూరు, నాగులపాలెం, కొల్లావారిపాలెం, పెద్దివారిపాలెం గ్రామాల్లో ఈ తెగులు ప్రభావం కనిపించింది. మల్లె తెగులు ప్రభావం లేని భూములకు ఎకరా 20 వేల రూపాయలకుపైగా కౌలు పలుకుతుండగా, ప్రభావం ఉన్న భూములకు దానిలో సగం కూడా పలకడం లేదు. ఈ గ్రామాల రైతులు పక్క ప్రాంతాలైన యద్దనపూడి, పూనూరు, వింజనంపాడు, చిమటావారిపాలెం తదితర గ్రామాలకు వెళ్లి మల్లె తెగులు ప్రభావం లేని భూములను కౌలుకు తీసుకుని వైట్‌బర్లీ సాగు చేస్తున్నారు.
రైతాంగాన్ని ఆదుకోని ఐటీసీ...
ప్రభుత్వ రంగ సంస్థయిన ఐటీసీ రైతుల వద్ద నేరుగా వైట్‌బర్లీ కొనుగోలు చేయకుండా వ్యాపారుల వద్ద కొనుగోలు చేస్తోంది. దీని కారణంగా కూడా రైతాంగానికి న్యాయమైన ధర లభించడం లేదు. నాలుగైదేళ్ల క్రితం వరకు ఐటీసీ రైతాంగం వద్ద నేరుగా కొనుగోలు చేసేది. అయితే వ్యాపారుల ప్రలోభాలకు తలొగ్గుతున్న ఐటీసీ అధికారులు రైతు ప్రయోజనాలకన్నా వ్యాపారుల లబ్ధి కోసమే సహకరిస్తున్నట్లు రైతు సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. ముఖ్యంగా వైట్‌బర్లీ పొగాకు ధరల విషయంలో ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో వ్యాపారుల ఇష్టారాజ్యమైంది. బ్యారన్ పొగాకు రైతుల సంక్షేమం కోసం పొగాకు బోర్డును ఏర్పాటు చేశారు. వైట్‌బర్లీ పొగాకు రైతాంగాన్ని కూడా పొగాకు బోర్డులో చేర్చి ఆదుకోవాలని రైతాంగం కోరుతున్నారు.
శనగకు ప్రత్యామ్నాయంగా...
రబీలో శనగ సాగు రైతులకు నష్టాలను మిగుల్చుతోంది. శనగ ధరలు పాతాళానికి వెళ్లాయి. సరైన ధరలు లేక కోల్డ్ స్టోరేజీల్లోనే మగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో శనగ సాగంటేనే రైతులు భయపడుతున్నారు. గతేడాది లాభాలు మిగిల్చిన వైట్‌బర్లీ పొగాకు సాగుపై రైతులు మొగ్గుచూపుతున్నారు. వైట్‌బర్లీ కూడా రబీసాగు కావడంతో శనగకు మరో ప్రత్యామ్నాయంగా వైట్‌బర్లీ సాగు చేసేందుకు ఉద్యుక్తులవుతున్నారు.
ఆశల సాగు ప్రారంభం
Published Sun, Oct 13 2013 2:54 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement