ఇక డ్రైవింగ్ లెసైన్సులకు ‘ఆధార్' | The driving lesainsulaku 'Aadhaar' | Sakshi
Sakshi News home page

ఇక డ్రైవింగ్ లెసైన్సులకు ‘ఆధార్'

Published Wed, Oct 15 2014 11:43 PM | Last Updated on Sat, Sep 2 2017 2:54 PM

ఇక డ్రైవింగ్ లెసైన్సులకు ‘ఆధార్'

ఇక డ్రైవింగ్ లెసైన్సులకు ‘ఆధార్'

అరండల్‌పేట(గుంటూరు):
 జిల్లాలో రవాణా లెసైన్సుదారులు తమ లెసైన్సులకు ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని జిల్లా ఉప రవాణాశాఖ కమిషనర్ డాక్టర్ వి.సుందర్ కోరారు. సోమవారం తన కార్యాలయంలో  విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోటారు వాహన రికార్డుల్లోనూ, డ్రైవింగ్ లెసైన్సు రికార్డుల్లోనూ ఆధార్‌తో అనుసంధానం చేయించుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియకు కాలపరిమితి లేదని, నిరంతరం కొనసాగే ప్రక్రియ అని వివరించారు.

జిల్లాలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాలలోనూ అనుసంధానం చేసుకొనే వీలు ఉందన్నారు.  ఇంటి నుంచే ఇంటర్‌నెట్ ద్వారా కూడా లెసైన్సుదారులు ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చన్నారు. డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఏపీట్రాన్స్‌పోర్ట్.ఓఆర్‌జీ.ఇన్ వెబ్‌సైట్‌ను ఓపెన్‌చేసి ఆధార్‌నంబర్ ఎంట్రీ బటన్ నొక్కితే అనుసంధానానికి చేయాల్సిన వివరాలు వస్తాయని, వాటి ఆధారంగా ఆధార్‌తో లెసైన్సులను అనుసంధానం చేసుకొవచ్చని చెప్పారు.  

15 సంవత్సరాల కాలపరిమితి గల లెసైన్సుదారులకు మాత్రం కొత్త నిబంధన ప్రకారం తమ మోటారు వాహన రికార్డు, డ్రైవింగ్ లెసైన్సు రికార్డులతో ఆధార్ అనుసంధానం చేసుకోవాలన్నారు. ఈ ప్రక్రియలో భాగస్వాములైతే రవాణాశాఖ కార్యాలయంలో వారి రికార్డులకు తగిన భద్రత ఉంటుందని చెప్పారు.  దీనిపై మారుమూల గ్రామాల్లో సైతం విస్తృత ప్రచారం చేస్తామని తెలిపారు.

ఆన్‌లైన్‌లో ఎల్‌ఎల్/డీఎల్ పరీక్షా సమయం బుక్ చేసుకొనేటప్పుడు, డీలర్ దగ్గర కొత్త వాహనం కొనే సమయంలో, ఏదైనా లావాదేవీల కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఆధార్ నమోదు చేసుకోవాలని సూచించారు. త్వరలో మీ సేవ ద్వారా కూడా ఆధార్‌కార్డుల అనుసంధాన ప్రక్రియ  ప్రారంభిస్తామన్నారు. ఈ సందర్భంగా పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో ప్రాంతీయ రవాణా అధికారి బి.చందర్, పరిపాలనాధికారి కె.శ్రీధర్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement