కోట్లకు పడగెత్తిన టౌన్ ప్లానింగ్ అధికారి రెహ్మాన్
విశాఖలో ఉన్నప్పుడు భారీగా అక్రమార్జన
‘సీఆర్‌డీఏ’కు వెళ్లిన ఆరు నెలలకే బయటపడిన బండారం
బినామీ పేర్లతో ఆస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం
ముడుపుల్లో నెలనెలా ఉన్నతాధికారులకు వాటాలు
నగరంలో నిర్మాణాల ప్లానింగ్ పర్యవేక్షించాల్సిన అధికారి.. అక్రమాస్తుల సంపాదన ఎలా అన్న ప్లానింగ్‌లోనే మునిగిపోయాడు. పక్కా ప్రణాళికతో కోట్లాది ఆస్తులు కూడబెట్టాడు. అవినీతి ప్లానింగ్‌తో అక్రమ అంతస్తులు కట్టాడు. అవే పునాదులపై బంగారం, నగదు, స్థలాలు, ఇళ్లు, షేర్లు అంతస్తులుగా పేర్చుకుంటూపోయాడు. ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిన రాజధాని ప్రాంతంలోని వ్యవసాయ భూమి పేరిట అక్రమ పునాది వేశాడు. ఏసీబీకి చిక్కడంతో రెహ్మాన్‌గారి అవినీతి ప్లాన్ బయటపడింది.
విశాఖపట్నం: కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టిన సీఆర్‌డీఏ టౌన్‌ప్లానింగ్ అధికారి షేక్ ఫుదుల్లార్ రెహ్మాన్ అక్రమార్జన పునాది విశాఖలోనే పడింది. అదే పునాదిపై ఆదాయానికి మించిన సంపాదనను అంతస్తులుగా పేర్చుకుంటూ కోట్లకు పడగెత్తారు. ఏసీబీ దాడుల్లో వెలుగు చూసిన అక్రమ సంపాదనలో చాలా భాగం విశాఖలో పని చేస్తున్నప్పుడు సంపాదించినదే. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులను బినామీలుగా పెట్టి ఆస్తులు కూడబెట్టారు. కుమారుడు షేక్ రెహ్మాన్ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్న రెహ్మాన్ ఉద్యోగ జీవితం ఆది నుంచీ అవినీతి ఆరోపణల మయమే.
కోట్లకు పడగలు: రెహ్మాన్ గతంలో విశాఖ నగరపాలక సంస్థలో అసిస్టెంట్ సిటీ ప్లానర్‌గా జోన్-2, 3లలో పనిచేశారు. ప్రధానంగా ఓ వ్యక్తిని బినామీగా ఉంచుకొని ఆస్తులు కూడబెట్టారు. అయితే ఆ వ్యక్తి ఎవరన్నది ఇంకా బయటపడలేదు. ఆరు నెలల క్రితం క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ) టౌన్‌ప్లానింగ్ అధికారిగా బదిలీపై వెళ్లిన రెహ్మాన్ ఆస్తులపై కర్నూలు, విశాఖ, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి ప్రాంతాల్లో మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. విశాఖ ఏసీబీ డీఎస్పీ రామకృష్ణప్రసాద్ నేతృత్వంలో మొత్తం 11 చోట్ల జరిగిన సోదాల్లో రెహ్మాన్‌కు చెందిన రూ.2 కోట్లకు పైగా అక్రమ ఆస్తులను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. వాటిలో భారీగా నగదు, నగలు, బాండ్లు, షేర్లు, భూములు, ఇళ్లు ఉన్నాయి. వీటి మార్కెట్ విలువ రూ.25 కోట్ల పైమాటేనంటే అతని ధనార్జన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్రమాస్తులను కూడా అత్యంత చాకచక్యంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఘనుడు అతను. రాజధాని ప్రాంతం తుళ్లూరులో 70 సెంట్ల వ్యవసాయ భూమికి రూ.60 లక్షల రేటున కొనుగోలు చేశాడు. కానీ కేవలం రూ.2 లక్షలకే కొన్నట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నగరంలోని తాటిచెట్లపాలెం ప్రాంతానికి చెందిన అబ్దుల్లా అనే వ్యక్తి పేరుపై 50 గజాల స్థలం ఉందని, అతను రెహ్మాన్‌కు బినామీ అని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. చదువు సంధ్య లేని అబ్దుల్లా మదర్సా కార్యకలాపాల్లో పాల్గొంటుంటారని, అతని తండ్రి మాంసం విక్రయించేవాడని వివరించారు.
రాజకీయ సాన్నిహిత్యం
నగరంలో పనిచేస్తున్నప్పుడే రెహ్మాన్‌పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. అతని అక్రమ సంపాదనపై ఏసీబీ అధికారులకు కూడా సమాచారం వెళ్లింది. దాడులు చేయాలని ఎన్నోసార్లు ప్రయత్నించినా అతనికున్న పలుకుబడి తెలిసి ధైర్యం చేయలేకపోయారు. రాజకీయ నేతలు, ఉన్నతాధికారులతో రెహ్మాన్‌కు అత్యంత సాన్నిహిత్యం ఉందని సమాచారం. జీవీఎంసీలో వసూలయ్యే నెలవారీ మామూళ్లను తానే స్వయంగా హైదరాబాద్ తీసుకువెళ్లి ఉన్నతాధికారులకు అందించేవారని అతనిపై ఆరోపణలు ఉన్నాయి. సిటీలో అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తూ, తద్వారా సొమ్ములు కూడబెట్టాడంటున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో పాలనపై పాలకులకు పట్టు సడలడాన్ని ఆసరాగా చేసుకుని ఎంవీపీ కాలనీ పరిసరాల్లో భారీగా అక్రమ నిర్మాణాలు జరగడానికి రెహ్మాన్ అందించిన ప్రోత్సాహమే కారణమని తెలుస్తోంది. సొమ్ములివ్వనిదే చిన్న పని కూడా చేయడని అతని గురించి తెలిసిన వారు చెబుతున్నారు.