ప్రజా సేవే లక్ష్యం
లక్ష్మీపురం(గుంటూరు): ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నానని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు చెప్పారు. స్థానిక కొరిటెపాడు రింగ్‌రోడ్డులోని శుభం కన్వెన్షన్ హాలులో సోమవారం జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల అయ్యో బాధ అనకుండా అభివృద్ధి అనే మంత్రంతో ముందుకు వెళ్ళాలని సూచించారు. రాబోవు రోజుల్లో గుంటూరు, విజయవాడ కలిసిపోతాయని, అభివృద్ధి కూడా వికేంద్రీకరణ జరుగుతుందని చెప్పారు. అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ కేంద్రంలో వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద దిక్కుగా ఉన్నారని చెప్పారు. రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాటాడుతూ పార్లమెంటులో కూడా విభజన సమయంలో వెంకయ్యనాయుడు గట్టిగా పోరాడారని చెప్పారు. నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ ఏపీ అభివృద్ధిలో వెంకయ్యనాయుడు సహకారం అవసరమన్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, వైజాగ్ ఎంపీ కంబంపాటి హరిబాబు, రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. తర్వాత వెంకయ్యనాయుడును పలువురు ఘనంగా సన్మానించారు.
బీజేపీలో తాడిశెట్టి మురళీమోహన్ చేరిక
నగర మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళీమోహన్ ఈ సందర్భంగా బీజేపీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా వేసి వెంకయ్యనాయుడు ఆహ్వానించారు. మురళీమోహన్ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కృషి చే స్తానని, పార్టీని ప్రజల్లోకి మరింతగా తీసుకెళతానన్నారు.