
మొండి గోడలే...
సాక్షి ప్రతినిధి, తిరుపతి : ప్రభుత్వం పేదోళ్ల గూడుపై శీతకన్ను వేసింది. దీంతో గృహనిర్మాణాల పథకాలు పూర్తిగా అటకెక్కాయి. ముఖ్యంగా తిరుపతి నగరంలో 2008 జూన్‌లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో వివిధ పథకాల కింద 19,353 గృహాలను మంజూరు చేశారు. తెల్లరేషన్‌కార్డు కలిగి ఇండ్లులేని నిరుపేద కుటుంబాలకు సంబంధించి మహిళల పేరుతో ఇంటి కార్డులను జారీచేశారు. కరకంబాడి, దామినేడు, అవిలాల, బ్రాహ్మణపట్టు (పాడిపేట) ప్రాంతాల్లో గృనిర్మాణాలు చేపట్టారు.
అయితే ఇందులో కేవలం 2,000 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలినవన్నీ వివిధ దశల్లో ఆగిపోయాయి. నిర్మాణాల కోసం వెచ్చించిన 144 కోట్ల రూపాయలు నిరుపయోగంగా మారింది. ప్రస్తుతం అక్కడ మొండిగోడలే దర్శన మిస్తున్నాయి. ఇంటి కోసం డబ్బులు చెల్లించిన నిరుపేద కుటుంబాలు కార్యాలయాల చుట్టూ తిరిగి తమ సమస్యను పరిష్కరించాలని వేడుకున్నాయి. అయినా ఏ ఒక్కరూ ఆలకించడంలేదు. కనీసం పట్టించుకునే నాథుడే కరువయ్యా రు. పాలకుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి పరిస్థితులు దాపురించాయని పేద ప్రజలు వాపోతున్నారు.
గృహాల మంజూరు ఇలా..
ఐహెచ్‌ఎస్‌డీపీ (ఇంటిగ్రేటేడ్ హౌసింగ్ స్కీం డెవలప్‌మెంట్ ప్రోగ్రాం) కింద 4056, ఆర్‌జీకే (రాజీవ్ గృహకల్ప) ద్వారా 416, ఇందిరమ్మ పథకం కింద 5,665, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం (జవహర్‌లాల్‌నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్) ద్వారా జీ ప్లస్‌టూ బ్లాక్‌లు 5,100 ఇండ్లను మంజూరు చేసి పేద మహిళలకు కేటాయించారు. ఇంకా దాదాపు 2,000 గృహాలు కేటాయింపు దశలోనే ఆగిపోయాయి. కేవలం 2,000 గృహాలు మాత్రమే పూర్తయ్యాయి. ఒక్కో గృహాన్ని లక్ష రూపాయలతో నిర్మించేలా అప్పట్లో అంచనాలు రూపొందించారు. లబ్ధిదారులనుంచి వాయిదాల పద్ధతిలో *40,000లు వసూలు చేసేలా ప్రణాళిక రచించారు. ఇంటి నిర్మాణాల కోసం డబ్బు చెల్లించిన పేదలు ఆరేళ్లుగా ఎదురుచూపులు మాత్రం తప్పడం లేదు.
పాలకుల నిర్లక్ష్యంతోనే..
గృహ నిర్మాణాల విషయంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితులు దాపురించాయని స్పష్టంగా తెలుస్తోంది. దీనికితోడు అనుమతుల మంజూరులో జాప్యం, సాంకేతిక సిబ్బంది కొరత, హౌసింగ్ బోర్డు, కార్పొరేషన్ మధ్య కొరవడిన సమన్వయం దీనికి తోడు నిర్మాణాల్లో జాప్యంతో భారీగా అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో గృహ నిర్మాణాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ప్రస్తుతం మొండి గోడలే దర్శనమిస్తున్నాయి. అప్పట్లో ఒక్కో గృహానికి లక్ష రూపాయల అంచనాకాగా, ప్రస్తుతం దాని అంచనా ఏకంగా *2.70 లక్షలకు చేరడం గమనార్హం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దృష్టి సారించి నిధులు కేటాయించి పనులు జరిగేలా చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు.