లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం పట్ల జిల్లాలో సంబరాలు అంబరాన్నంటాయి. ప్రజలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుని స్వీట్లు పంచుకుంటూ హర్షం వ్యక్తం చేశారు. ఎందరో అమరులు చేసిన పోరాటాల ఫలితంగానే నేడు తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం పొందిందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ‘న్యూస్‌లైన్’తో వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు...
ఇది కేసీఆర్ విజయం
60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష, 13 ఏళ్ల టీఆర్‌ఎస్ ఉద్యమంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారమైంది. ఇది కేసీఆర్ విజయమే. తెలంగాణ కోసం అసువులు బాసిన అమరవీరులకు ఇది అంకితం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం చరిత్రపుటల్లో ఎక్కనుంది. ప్రజల ఆకాంక్షలకు అభిప్రాయాలకు అనుగుణంగా నూతన రాష్ట్ర నిర్మాణం జరగాలి. ఆ దిశగా అన్ని వర్గాల ప్రజల ఆశయాలకు వేదికగా రాష్ట్రం ఏర్పడాలి.
దిండిగాల రాజేందర్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు
తెలంగాణ ఏర్పాటు శుభపరిణామం : పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, వైఎస్సార్‌సీపీ నేతలు
తెలంగాణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం నిబద్ధతగా వ్యవహరించడం శుభపరిణామమని వైఎస్సార్‌సీపీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా అధ్యక్షులు పాయం వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణపై కొంతకాలంగా నాన్చుడు ధోరణి అవలంబించిన కాంగ్రెస్ ఎట్టకేలకు లోక్ సభలో బిల్లు ఆమోదించడం హర్షణీయమని పేర్కొన్నారు.
2004లో తెలంగాణ ఉద్యమానికి వైఎస్ బీజం వేశారని, తన పార్టీ ఎమ్మెల్యేలతో తెలంగాణ ప్రతిపాదన చేశారని, వైఎస్ స్ఫూర్తితోనే ఉద్యమం బలపడిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలకులు స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణను ఇంతకాలం తాత్సారం చేశార ని, ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రకటించడం వారి స్వార్థ రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో తెలంగాణ అబివృద్ధి కోసం పాటుపడాలని కోరారు. తెలంగాణలోని భారీ నీటి పారుదల ప్రాజెక్టు అయిన ప్రాణహిత, చేవెళ్లను వెంటనే జాతీయ ప్రాజెకుటగా ప్రకటించి దాని అభివృద్ధికి అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. నవ తెలంగాణ అభివృద్ధిలో వైఎస్సార్‌సీపీ కీలక భూమిక పోషిస్తుందని వారు పేర్కొన్నారు.