
రోజూ వెళ్తున్న చెరువే కదాని ఏమరపాటుగా ఉన్నారో.. లేక నాచుపట్టిన మెట్లపై నుంచి జారిపడి నీట మునిగిపోయారో తెలియదుకాని.. మూడు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ సంఘటన కన్నవారిని.. గ్రామస్తులను విషాదంలోకి నెట్టింది. బట్టలు ఉతికేందుకు చెరువుకెళ్లిన లావేరు మండలం గుర్రాలపాలేం గ్రామానికి చెందిన పతివాడ నాగమ్మ(45), ఆమె కుమార్తె శిరీష(14), వారి ఇంటి సమీపంలో ఉండే మరో బాలిక బడారి దుర్గ(18) నీట మునిగి చనిపోయారు. ఈ విషయం తెలిసి గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. కన్నవారు గుండెలు బాదుకుంటూ రోజూ వెళ్లిన చెరువే తమవారిని మింగేసిందా అంటూ రోదించిన తీరు అందరినీ కలచివేసింది.
శ్రీకాకుళం జిల్లా: గుర్రాలపాలేం గ్రామానికి చెందిన పతివాడ నాగమ్మ, ఆమె కూతురు శిరీష, వారి ఇంటి సమీపంలో ఉండే మరో బాలిక బడారి దుర్గలు గురువారం ఉదయం 10 గంటలు సమయంలో గ్రామ సమీపంలోని రౌతువాని చెరువు వద్ద బట్టలు ఉతకడం కోసం బకెట్లతో బట్టలు తీసుకొని వెళ్లారు. అయితే తిరిగి ఇంటికి చేరలేదు. ముగ్గురూ చెరువులో శవాలై తేలారు. వీరు ఎలా చనిపోయారో అంతు చిక్కడం లేదు. మెట్లు జారుగా ఉండడంతో కాలుజారి నీట మునిగి చనిపోయి ఉండవచ్చునని స్థానికులు భావిస్తున్నారు. చెరువులో నీరు ఎక్కువగా ఉండటంతో పాటు లోతు కూడా ఎక్కువగా ఉండటం, ముగ్గరికీ ఈత రాకపోవడం కూడా వీరి మరణించడానికి కారణంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
స్థానికులు చూడడంతో వెలుగులోకి..
గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో చెరువు వైపు వెళ్లిన కొందరు రైతులు చెరువులో ముగ్గురి శవాలు తేలి ఉండటం చూశారు. వెంటనే విషయాన్ని గ్రామస్తులకు తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కొంతమంది చెరువులోకిదిగి నాగమ్మ, శిరీష, బడారి దుర్గ మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు.
సంఘటనా స్థలానికి అధికారులు
–గుర్రాలపాలేంలో ముగ్గురు చనిపోయినట్టు తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లావేరు మండల తహసీల్దార్ బందరు వెంకటరావు, ఆర్‌ఐ టి.శ్రీదేవి, ఎస్సై సీహెచ్ రామారావు, ఏఎస్‌ఐ మోహనరావు, హెచ్‌సీ శ్రీనివాసరావు, వీఆర్వో బలివాడ శంకరరావు ప్రమాదానికి కారణమైన చెరువును పరిశీలించారు. ప్రమాదానికి కారణాలు ఏమైఉంటాయోనని మృతుల కుటుంబ సభ్యులు, గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలకు శవపంచనామా నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
గ్రామ దేవత పండుగకు వెళ్లి వచ్చిన మరుసటి రోజే..
– గ్రామానికి చెందిన ముగ్గురు ఒకే ప్రమాదంలో చనిపోవడంతో గుర్రాలపాలెంలో విషాదం నెలకొంది. చనిపోయిన వారిలో బాలిక పతివాడ శిరీష నందిగాం మండలంలోని రెసిడెన్షియల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. దసరా సెలవులకు ఇంటికి వచ్చిన బాలిక ఈ నెల మూడో తేదీన రణస్థలం మండలం మహంతిపాలేం గ్రామంలోని తాతగారింటికి గ్రామదేవత పండుగలకు తల్లి నాగమ్మతో కలిసి వెళ్లింది. బుధవారం సాయంత్రమే తల్లీకూతురు గుర్రాలపాలేం గ్రామానికి తిరిగి వచ్చారు.
గురువారం ఉదయం బట్టలు తడిపేందుకు వెళ్లి చెరువులో పడి మృతి చెందారు. శిరీషకు చెందిన బట్టలన్నీ ఉతికి శుక్రవారం నందిగాంలోని పాఠశాలకు దిగబెట్టాలని తల్లిదండ్రులు అనుకున్నారు. ఇంతలోనే చెరువు రూపంలో మృత్యువు శిరీషను బలితీసుకుంది. భార్య నాగమ్మతో పాటు కూతురు శిరీష మృతి చెందడంతో ఇంటియజమాని పతివాడ గొల్ల భార్య, కూతురు మృతదేహాలపై పడి భోరున విలపించిన తీరు అక్కడి వారిని కలచివేసింది. నేను ఏంపాపం చేశానని భగవంతుడు తనకీ శిక్ష విధించాడని కన్నీరు మున్నీరయ్యాడు. ఏడ్చీ ఏడ్చీ మృతదేహాలపైనే గొల్ల స్పృహతప్పి పడిపోయాడు.
చనువు మానేసి తల్లిదండ్రులకు అండగా..
మృతి చెందిన మరో బాలిక దుర్గ ఇంటర్ వరకూ చదువుకుంది. డిగ్రీ చదివించే స్థోమత తల్లిదండ్రులకు లేకపోవడంతో ఇంటి వద్దనే వారికి అండగా ఉంటుంది. బట్టలు ఉతకడానికి చెరువుకెళ్లి దుర్గ చనిపోవడంతో కన్నవారు బడారి గొల్ల, ఇందిరలు తీవ్ర విషాదానికి గురయ్యారు.
ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ సీపీ నాయకుల పరామర్శ
ప్రమాద విషయాన్ని తెలుసుకున్న వెంటనే లావేరు మండల ఉపాధ్యక్షుడు మోరం సోంబాబు, బీజేపీ మండల అధ్యక్షుడు బాద ఆనందరావు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్‌బాబ్జీ, అల్లంపల్లి నారాయణరావు, కుప్పిలి గొల్ల, లుట్ట శ్రీను, గుర్రాలపాలేం మాజీ సర్పంచ్ జనపాల బానోజిరావు, సర్పంచ్ ప్రతినిధి నేతల అప్పారావు, మనజనం సామాజిక సేవా కేంద్రం ఉపాధ్యక్షుడు జనపాల గోవిందరావు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదంపై తీవ్ర విషాదం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment