సొసైటీల్లో సంస్కరణలకు బ్రేక్ | To reform society Break | Sakshi
Sakshi News home page

సొసైటీల్లో సంస్కరణలకు బ్రేక్

Published Thu, Sep 19 2013 2:50 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

To reform society Break

సాక్షి, మచిలీపట్నం :  సహకార వ్యవస్థను ‘భక్షి’ంచే సంస్కరణలకు బ్రేక్ పడింది. ప్రకాష్ బక్షి సిఫారసులు సహకార వ్యవస్థను నిర్వీర్యం చేస్తాయని, వాటిని అమలు చేయరాదని పేర్కొంటూ రైతులు, సొసైటీల పాలకవర్గాలు కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున ఉద్యమించాయి. దీంతో వెనకడుగు వేసిన నాబార్డు బక్షి సిఫారసులను కచ్చితంగా అమలు చేయాలన్న నిబంధన లేదంటూ సడలింపు ఇచ్చింది. తాజాగా సహకార సంఘాల పాలకవర్గాలు, రైతులకు ఇష్టమైతేనే బక్షి సిఫారసులు అమలు చేసుకోవచ్చని సవరణ తెచ్చింది. నాబార్డు తాజా ఉత్తర్వులపై రైతు ప్రతినిధులు, సొసైటీ పాలకవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

 ప్రతిబంధకంగా ప్రతిపాదనలు..
 సహకార సొసైటీల్లో సంస్కరణలు తెస్తూ నాబార్డు చైర్మన్ ప్రకాష్ బక్షి అధ్యక్షతన రిజర్వ్ బ్యాంక్ నిపుణుల కమిటీ ఇటీవల కొన్ని ప్రతిపాదనలు చేసింది. సహకార సంఘాలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకులకు వ్యాపార కార్యకర్తలు (బిజినెస్ కరస్పాండెంట్)గా ఉండాలన్నది ప్రధాన ప్రతిపాదన. గ్రామీణ స్థాయిలో రైతులకు ఎంతో ప్రయోజనం కలిగించేలా ఉండే సొసైటీలకు ఈ ప్రతిపాదన ప్రతిబంధకమేనన్న వాదన ఉంది. బక్షి ప్రతిపాదనలు అమలు చేస్తే వందేళ్ల చరిత్ర కలిగిన సహకార వ్యవస్థ నిర్వీర్యమవుతుందన్న విమర్శలు వచ్చాయి. సొసైటీలను పూర్తిస్థాయిలో కంప్యూటరీకరించి ఆన్‌లైన్ పద్ధతి ద్వారా జిల్లా, రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకులను అనుసంధానం చేయాలన్న సూచన అమలు చేయాలంటే ఇప్పట్లో సాధ్యం కాదని ఆయా పాలకవర్గాలు, ఉద్యోగ సంఘాలు చేతులెత్తేశాయి. ఇదే విషయమై జిల్లాలో రైతులు, రైతు సంఘాలు, సొసైటీల పాలకవర్గాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాయి.

 బక్షి సూచనలు ఏమిటంటే..
 బక్షి చేసిన సూచనల ప్రకారం ప్రధానంగా జిల్లాలోని 425 సహకార సంఘాలను కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంకు అజమాయిషీలోకి తేవాల్సి ఉంటుంది. కేడీసీసీ బ్యాంకుకు అవి వ్యాపార కార్యకర్తలుగానే ఉంటాయి. దీంతో జిల్లాలో ఉన్న కేడీసీసీ బ్యాంక్ 50 బ్రాంచిలకు 425 సొసైటీలు బిజినెస్ కరస్పాండెంట్లుగా మారితే వాటి స్వయంప్రతిపత్తిని కోల్పోయినట్టే. జిల్లాలోని అన్ని సహకార సంఘాలకు ఉన్న ఆస్తులు, అప్పులను సెంట్రల్ బ్యాంకుకు బదలాయించాల్సి ఉంటుంది. సొసైటీల్లో సేకరించిన డిపాజిట్లు సైతం జిల్లా, రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకుల రికార్డులకు బదలాయించాల్సి ఉంటుంది. ఇకపై సొసైటీలు సొంతంగా డిపాజిట్లు సేకరించడానికి వీలుండదు. దీనికితోడు అన్ని సొసైటీల్లో కంప్యూటరీకరణ చేసి సభ్యులు, రైతులు, రుణాలు తదితర అన్ని వివరాలను ఆన్‌లైన్ చేయాల్సి ఉంటుంది. ఇకపై రైతుల రుణాలు, రుణాల చెల్లింపు, వడ్డీ రాయితీ, సబ్సిడీ తదితర వివరాలను ఆన్‌లైన్ ద్వారా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి. ఇలా సుమారు 13 సూచనలు చేసిన ప్రకాష్ బక్షి ఇవి కేవలం ఆర్థికపరమైన అంశాలపై మార్పులు మాత్రమేనని, సొసైటీలు, బాధ్యతలు యథావిధిగా కొనసాగుతాయని ప్రస్తావించారు.

 సూచనలపై అభ్యంతరాలు..
 బక్షి సూచనలపై కేడీసీసీ బ్యాంక్, సొసైటీల పాలకవర్గాలు అభ్యంతరం తెలుపుతూ ఇటీవల పలు తీర్మానాలు చేశాయి. ఈ నెల తొలి వారంలో జరిగిన కేడీసీసీ బ్యాంక్ పాలకవర్గ సమావేశంలో చేసిన సుమారు తొమ్మిది తీర్మానాల ప్రతులను రాష్ట్ర ముఖ్యమంత్రి, సహకార మంత్రి, ఆప్కాబ్ చైర్మన్, కోఆపరేటివ్ రిజిస్ట్రార్‌లకు అందించారు. కేడీసీసీ బ్యాంక్ పాలకవర్గ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశం తీర్మానాలివీ.. బక్షి సిఫారసులు అమలుచేస్తే వందేళ్ల చరిత్ర కలిగిన సహకార వ్యవస్థ నిర్వీర్యమవుతుంది. సొసైటీల్లోని డిపాజిట్లు, అప్పులు డీసీసీ బ్యాంకులకు బదలాయిస్తే దూరప్రాంతాల నుంచి రైతులు, ఖాతాదారులు డీసీసీబీ బ్రాంచిలకు రావడం కష్టమవుతుంది.

తద్వారా ఎవరికివారే తమ డిపాజిట్లు తీసేసుకునే ప్రమాదం ఉంది. సొసైటీల్లో ఆస్తులు, అప్పులు, షేర్ ధనం బదలాయిస్తే సంఘాల్లో నిధుల కొరత తీవ్రమవుతుంది. జిల్లా రుణ ప్రణాళికలో కేవలం 22 శాతం ఉన్న వ్యవసాయ రుణాలు ఈ సంస్కరణలతో మరింత తగ్గిపోయే ప్రమాదం ఉంది. బక్షి సిఫారసులు అమలు చేయాలంటే 1964 సహకార చట్టాన్ని సవరణ చేయాలన్న ప్రతిపాదన సరికాదు. ఆన్‌లైన్ ద్వారా రైతులు, సొసైటీల్లో సభ్యులకు సేవలు మంచిదే, రుణాలు తీసుకున్న వారికి ఏటీఎం ద్వారా డబ్బు తీసుకునే వెసులుబాటు కల్పించడం స్వాగతించదగినదే. అయితే ఇవి ఎటువంటి ఇబ్బందీలేకుండా అమలు జరగాలంటే పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణ, ఆన్‌లైన్ పద్ధతి అమలు చేయడం ఇప్పట్లో కష్టమే అని సొసైటీల పాలకవర్గాలు తేల్చిచెబుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement