సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నగరం నడిబొడ్డున ఉన్న బాపూజీ కాంప్లెక్స్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యే అండతో అక్రమ కట్టడం పనులు జరుగుతున్నా సంబంధితాధికారులు ప్రేక్షకపాత్ర వహించడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. గత నెల 19న ‘సాక్షి’లో ‘అంతస్తులుగా ఎదిగిన అవినీతి ... రూ. 20 లక్షల డీల్’ శీర్షికతో వచ్చిన కథనానికి మరుసటి రోజు హడావుడి చేసి చేశారు. ఈ నిర్మాణంపై చర్య తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ డెరైక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్‌కు లేఖ రాశారు. ఆ తర్వాత ఒక నోటీసు ఇచ్చి ఊరుకున్నారు. ఈ నోటీసుకు సదరు షాపింగ్ కాంప్లెక్స్ కమిటీ నుంచి సమాధానం కూడా రాలేదు.
పేదవాడు చిన్న ఇల్లు కట్టుకున్నా ప్లాన్ లేదంటూ నిర్దాక్షణ్యంగా పడగొట్టే నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ అధికారులు ఈ విషయంలో ప్రజాప్రతినిధి అండదండలు ఉండటంతో మనకెందుకులే అనుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టౌన్‌ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీ చేయడంతో సదరు ప్రజాప్రతినిధి మరోసారి చిందులు తొక్కినట్టు తెలిసింది. దీంతో వెనక్కి తగ్గడంతో ఇటీవల మళ్లీ కట్టడం నిర్మాణ పనులను ప్రారంభించారు.
శ్లాబ్‌కు ఉన్న కర్రలను తొలగించి గోడలు కడుతున్నారు. విషయం తెలుసుకున్న టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ పనులు ఆపడానికి వెళ్లగా కమిటీ సభ్యులు అతనిపై విరుచుకుపడినట్లు సమాచారం. ‘మేము కట్టడం ఖాయం ఏం చేస్తారో చేసుకోండని’ సదరు కమిటీ సభ్యులు అతన్ని హెచ్చరించారు. ఎమ్మెల్యే చెప్పిన తర్వాత కూడా పనులు ఆపడానికి రావడానికి నీ కెంత ధైర్యం అని నిలదీయడంతో సదరు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ వెనుదిరిగినట్లు సమాచారం. దీనిపై టౌన్‌ప్లానింగ్ అధికారులను వివరణ కోరగా నోటీసు ఇచ్చామని సమాధానం చెప్పారు. ప్లాన్ లేనప్పుడు దానిపై చర్య తీసుకోకుండా నోటీసులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తే మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దని వేడుకున్నారు.
వీడని మౌనం... ఆగని కట్టడం
Published Wed, Mar 9 2016 3:52 AM | Last Updated on Sun, Sep 3 2017 7:16 PM
Advertisement
Advertisement