ruling party MLA
-
కీచకుడికి ఖద్దరు వత్తాసు
‘లైంగిక వేధింపులకు పాల్పడేవారిని చీపుర్లతో కొట్టండి’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతంలో గుంటూరులో మహిళలకు పిలుపునిచ్చారు. అందుకు భిన్నంగా ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన సీఐని కాపాడేందుకు అధికార పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఒకరు రంగంలోకి దిగారు. పోలీసులు సస్పెండ్ చేసిన సీఐకి తిరిగి పోస్టింగ్ ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. సాక్షి, గుంటూరు: విచక్షణ మరచిన సీఐ ఒకరు ఓ మహిళను లైంగికవేధింపులకు గురిచేశారు. ఎంత బతిమాలినా ఆ సీఐ మాట వినకపోవడంతో బాధితురాలు పోలీసు ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల విచారణలో సీఐ కీచకపర్వం వాస్తవమేనని తేలడంతో అతనిపై సస్పెన్షన్ వేటువేశారని సమాచారం. అయితే అధికారపార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఒకరు కీచక సీఐకి అండగా నిలిచి, సస్పెన్షన్ ఎత్తివేసి పిడుగురాళ్ల టౌన్ సీఐగా పోస్టింగ్ ఇవ్వాలంటూ డీజీపీ కార్యాలయం నుంచి ఒత్తిడి తెస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలోని అర్బన్, రూరల్ జిల్లాల పరిధిలో పలు పోలీసు స్టేషన్లలో ఎస్ఐగా, సీఐగా విధులు నిర్వర్తించి ప్రస్తుతం రైల్వేలో సీఐగా పనిచేస్తున్న పోలీసు అధికారి ఒకరు తనపై లైంగిక వేధింపులకు పాల్ప డ్డారంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపారు. సదరు సీఐ లైంగిక వేధింపులకు పాల్పడ్డ విషయం వాస్తవమేనని ఆ విచారణలో తేలింది. సీఐపై చర్యలకు పోలీసు ఉన్నతాధికారులు సిఫార్సు చేశారు. పది రోజుల క్రితమే సదరు సీఐపై సస్పెన్షన్ వేటు వేశారని సమాచారం. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అందుకు కారణం అధికార పార్టీ నేతల నుంచి వస్తున్న ఒత్తిళ్లేనని సమాచారం. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండతో వరుసగా లా అండ్ ఆర్డర్ పోస్టింగ్‌లు పొందుతూ వారికి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆరు నెలల క్రితం కీచక సీఐని వీఆర్‌కు పిలిచి రైల్వేకు బదిలీ చేశారు. అయితే ఆ సీఐ తనతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఓ మహిళ పలుమార్లు ఎస్పీ, ఐజీకి ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశించారు. ఆ విచారణలో వేధింపులు వాస్తవమేనేని తేలిన తరువాత సస్పెండ్ చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఆ సీఐను రక్షించేందుకు అధికార పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే రంగంలోకి దిగారు. సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని, పిడుగురాళ్ల టౌన్ సీఐగా పోస్టింగ్ ఇవ్వాలని పోలీసు ఉన్నతా ధికారులపై ఒత్తిడి పెంచుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరైనా బాధిత మహిళ ఫిర్యాదు చేస్తే వెంటనే కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేయడంతోపాటు కఠిన సెక్షన్లు వేసి రిమాండ్‌కు పంపే పోలీసు అధికారులు, తమ శాఖకు చెందిన కీచక అధికారి వ్యవహారాన్ని గోప్యంగా ఉంచుతూ సస్పెన్షన్‌ను సైతం ఎత్తివేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
వీడని మౌనం... ఆగని కట్టడం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నగరం నడిబొడ్డున ఉన్న బాపూజీ కాంప్లెక్స్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యే అండతో అక్రమ కట్టడం పనులు జరుగుతున్నా సంబంధితాధికారులు ప్రేక్షకపాత్ర వహించడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. గత నెల 19న ‘సాక్షి’లో ‘అంతస్తులుగా ఎదిగిన అవినీతి ... రూ. 20 లక్షల డీల్’ శీర్షికతో వచ్చిన కథనానికి మరుసటి రోజు హడావుడి చేసి చేశారు. ఈ నిర్మాణంపై చర్య తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ డెరైక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్‌కు లేఖ రాశారు. ఆ తర్వాత ఒక నోటీసు ఇచ్చి ఊరుకున్నారు. ఈ నోటీసుకు సదరు షాపింగ్ కాంప్లెక్స్ కమిటీ నుంచి సమాధానం కూడా రాలేదు. పేదవాడు చిన్న ఇల్లు కట్టుకున్నా ప్లాన్ లేదంటూ నిర్దాక్షణ్యంగా పడగొట్టే నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ అధికారులు ఈ విషయంలో ప్రజాప్రతినిధి అండదండలు ఉండటంతో మనకెందుకులే అనుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టౌన్‌ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీ చేయడంతో సదరు ప్రజాప్రతినిధి మరోసారి చిందులు తొక్కినట్టు తెలిసింది. దీంతో వెనక్కి తగ్గడంతో ఇటీవల మళ్లీ కట్టడం నిర్మాణ పనులను ప్రారంభించారు. శ్లాబ్‌కు ఉన్న కర్రలను తొలగించి గోడలు కడుతున్నారు. విషయం తెలుసుకున్న టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పనులు ఆపడానికి వెళ్లగా కమిటీ సభ్యులు అతనిపై విరుచుకుపడినట్లు సమాచారం. ‘మేము కట్టడం ఖాయం ఏం చేస్తారో చేసుకోండని’ సదరు కమిటీ సభ్యులు అతన్ని హెచ్చరించారు. ఎమ్మెల్యే చెప్పిన తర్వాత కూడా పనులు ఆపడానికి రావడానికి నీ కెంత ధైర్యం అని నిలదీయడంతో సదరు బిల్డింగ్ ఇన్స్పెక్టర్ వెనుదిరిగినట్లు సమాచారం. దీనిపై టౌన్‌ప్లానింగ్ అధికారులను వివరణ కోరగా నోటీసు ఇచ్చామని సమాధానం చెప్పారు. ప్లాన్ లేనప్పుడు దానిపై చర్య తీసుకోకుండా నోటీసులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తే మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దని వేడుకున్నారు. -
బది‘లీల’లు
ఎమ్మెల్యేల లేఖ ♦ ఒంగోలులో పనిచేస్తున్న ఒక ఉద్యోగి పట్టుమని పది నెలలు కూడా కాకముందే అతని స్థానంలో మరొకరిని సిఫార్సు చేస్తూ స్థానిక ఎమ్మెల్యే లేఖ ఇచ్చారు. చీరాలలో డిప్యుటేషన్లో ఉన్న ఉద్యోగికి అక్కడే స్థానం కల్పించాలంటూ మరో ప్రజాప్రతినిధి సిఫార్సు చేశారు. దీంతో తనకు ఐదు సంవత్సరాలు పూర్తి కాలేదనుకున్న ఆ ఉద్యోగికి కూడా బదిలీ తప్పనిసరి పరిస్థితైంది. ఇలా ప్రజాప్రతినిధులు సిఫార్సు చేస్తున్న స్థానాల్లో ఇప్పటికే పనిచేస్తున్న వారికి మాత్రం మొండిచేయి చూపిస్తున్నారు. కనీసం తమకు కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీల అవకాశం కల్పించాలంటున్నా ససేమిరా అంటున్నారు. ♦ జెడ్పీలోలో ఏళ్ళ తరబడి పనిచేస్తున్నవారిని మాత్రం బదిలీల పేరుతో బయటకు నెట్టాలని నిర్ణయించారు. వారి స్థానంలో అధికారపక్షం అండదండలున్న వారిని నియమించడానికి రంగం సిద్ధం చేశారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు, : అధికార పార్టీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి సిఫార్సు లేఖ ఇస్తే పోస్టింగ్ ఖాయం. లేకపోతే ఎక్కడికి బదిలీ చేస్తారో ఎవరికీ తెలియదు. జిల్లాలో బదిలీలకు ఒక్కరోజే గడువు ఉండటంతో అడ్డతోవలు తొక్కడానికి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే, ఇన్ఛార్జీలు ఇచ్చిన లేఖలు తీసుకుని అధికారులు, సిబ్బంది క్యూ కట్టారు. ఎంపీడీవో బదిలీలు, జెడ్పీ సిబ్బంది, పంచాయతీరాజ్ శాఖలో బదిలీలపై వివాదం నెలకొంది. నిబంధనలను పక్కన పెట్టి సిఫార్సులకే పెద్ద పీట వేయడం పట్ల ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా పరిషత్ ఉద్యోగులకు సంబంధించి మినిస్టీరియల్ సిబ్బంది, నాల్గో తరగతి ఉద్యోగులు, రికార్డు అసిస్టెంట్ల బదిలీలను జిల్లా పరిషత్ చైర్మన్, జెడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవో, అకౌంట్స్ ఆఫీసర్ ప్రారంభించారు. సాధారణంగా ఉద్యోగ సంఘాల నుంచి ఇద్దరు బదిలీల కౌన్సెలింగ్‌కు హాజరవుతుండడం పరిపాటి. కానీ సంఘాల నాయకుల ప్రాతినిధ్యమే లేకపోవడం గమనార్హం. ఐదు సంవత్సరాలు ఒకేచోట పనిచేసిన ఉద్యోగులకు బదిలీలు తప్పవని సూచించడంతో వారంతా దరఖాస్తులు చేసుకున్నారు. కొంతమంది పరస్పరం బదిలీలు కోరుకున్నవారు కూడా తమ దరఖాస్తులను అధికారులకు పంపించారు. వారి విజ్ఞప్తుల మేరకు ముందస్తు బదిలీలు ప్రశాంతంగా జరిగాయి. సాయంత్రం నుంచి అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ పేరుతో అధికారులు ప్రజాప్రతినిధులు సూచించిన వారికి బదిలీలు చేసేందుకు శ్రీకారం చుట్టారు. దీంతో పైరవీలు దందాకు తెరలేచింది. ఎమ్మెల్యేలు లేనిచోట: మరో వైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట అధికార పార్టీ ఇన్‌ఛార్జులు కూడా సిఫార్సు లేఖలు హవా సాగింది. సంతనూతలపాడులో ఒక ఉద్యోగికి ఆ స్థానం ఖాళీ చేయాలంటూ లేఖ వచ్చింది. దీంతో అక్కడ ఉన్న ఉద్యోగిని ఎక్కడకు పంపిస్తారో మాత్రం తెలియని పరిస్థితి . ► పొదిలిలో ఒక ఉద్యోగిని మార్పు చేయాలంటూ ఒంగోలులో ఒక అధికార పార్టీ నాయకునితోపాటు మార్కాపురం ప్రాంతానికి చెందిన టీడీపీ ఇన్‌ఛార్జి కందుల నారాయణరెడ్డి నుంచి కూడా ఉత్తర్వులు అధికారులకు అందాయి. ► శుక్రవారం రాత్రి వరకు నిర్వహించినా బదిలీలు పూర్తయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో శనివారం ఎంపీడీవో, సూపరింటెండెంట్లకు సంబంధించిన బదిలీలు నిర్వహించనున్నారు. వీటికి కూడా పెద్ద ఎత్తున సిఫార్సులు వచ్చాయి. అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ పేరుతో ఉద్యోగులను బదిలీ చేయాలనుకుంటే కనీసం అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల విజ్ఞప్తి కూడా పరిగణనలోకి తీసుకోవాలని పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘ నాయకులు ఇప్పటికే జెడ్పీ సీఈవోను, జిల్లా పరిషత్ చైర్మన్‌ను కలిసి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది. పంచాయతీరాజ్ శాఖలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ► జిల్లాలో ముగ్గురు డివిజనల్ పంచాయతీ అధికారులు, 32 మంది ఈవోఆర్డీలు, మరో 500 మంది వరకు పంచాయతీ కార్యదర్శులున్నారు. కార్యదర్వులు ఇప్పటికే అధికార పార్టీ నుంచి లేఖలు తెచ్చుకుంటున్నారు. ఒంగోలు పక్కనే ఉన్న నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఏకంగా 25 మంది కార్యదర్శులకు సిఫార్సు లేఖలు ఇచ్చినట్లు సమాచారం. వ్యవసాయ శాఖలో కూడా బదిలీల ఫీవర్ కొనసాగుతోంది. శుక్రవారం జిల్లా సహకార అధికారితోపాటు సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారుల బదిలీలు జరిగాయి. -
అంతా మా ఇష్టం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అనుకుంటున్నారు.. ఎన్నికల నియమావళి అమల్లోకి రాకముందే పనికానిచ్చేద్దామని అనుకుంటున్నారు.. ఎన్నికల కోసం అనుకూల అధికారులు కావాలనుకుంటున్నారు.. వెరసి... జిల్లాలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధుల కన్ను తహశీల్దార్లపై పడింది. అధికార పార్టీ నేతలు కోరడం చాలు.. అన్నీ చేసిపెట్టే ఉన్నతాధికారి ఎలాగూ ఉన్నారు. ఇంకేముందీ.. జిల్లాలో తహశీల్దార్ల బదిలీల జాతర మొదలైంది. ఆ తీరు ఇదిగో ఇలా ఉంది. ప్రజాప్రతినిధులు తాన.. ఉన్నతాధికారి తందాన... కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల అభీష్టానికి అనుగుణంగా తహశీల్దార్ల బదిలీల ప్రహసం మొదలైంది. అధికారులను ఎంపిక చేసుకుని మరీ వారినే నియమించాలని ఉన్నతాధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. చెప్పింది తు.చ. తప్పకుండా పాటించే అధికారులనే ఏరికోరి పోస్టింగ్ వేయించుకుంటున్నారు. నిబంధనల మేరకు పనిచేస్తామనే అధికారులపై బదిలీ వేటు వేయిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారి తీరు కూడా అందుకు తగ్గట్లుగానే ఉంది. జిల్లాలో కొనసాగడంపై పట్టుదలగా ఉన్న ఆయన.. అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గుతున్నారు. తాను జిల్లాలో ఉంటే చాలు.. అధికార యంత్రాంగం మానసిక స్థైర్యం దెబ్బతిన్నా ఫర్వాలేదన్న రీతిలో సదరు ఉన్నతాధికారి వ్యవహరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు చెప్పిందే తడవుగా బదిలీలు చేసేస్తున్నారు. దీంతో తహశీల్దార్ల బదిలీ అంతా రాజకీయ ప్రహసనంగా మారిపోయింది. అదెలాగంటే.. అన్నా! అన్నన్నా..! గిద్దలూరులో ఇష్టారాజ్యం గిద్దలూరు ప్రజాప్రతినిధి తహశీల్దార్ల నియామకం అంతా తన ఇష్టారాజ్యంగా మార్చుకున్నారు. గత రెండు వారాల్లో ఆ నియోజకవర్గంలో ఏకంగా ఆరుగురు తహశీల్దార్లను బదిలీ చేయడం గమనార్హం. పూర్తిగా తనకు అనుకూల అధికారులను నియమించేలా జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆయన ప్రభావితం చేశారు. అసైన్మెంట్ కమిటీలో తన మాట వినలేదనే ఆగ్రహంతో కొమరోలు తహశీల్దార్‌ను ఆయన పట్టుబట్టి మరీ బదిలీ చేయించినట్టు సమాచారం. ఇక హైదరాబాద్‌లో పనిచేస్తున్న అధికారికి తన నియోజకవర్గంలోని రాచర్లలో పోస్టింగ్ ఇప్పించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అదే విధంగా మిగిలిన ఐదుగురిలో నలుగురి బదిలీలు ఆయన అభీష్టం మేరకే జరిగాయి. గతంలో తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఓ అధికారికి ఆయన ఏరికోరి తన నియోకజవర్గంలో పోస్టింగ్ ఇప్పించుకున్నారు. కొమరోలుకు తాజాగా బదిలీ చేసిన తహశీల్దార్‌పై ప్రజాప్రతినిధి అయిష్టంగా ఉన్నారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. కనిగిరిలో అధికార పార్టీ ప్రజాప్రతినిధి వద్దని చెప్పిన ఆయన్ను తన నియోజకవర్గంలో ఎందుకు వేశారని సదరు ప్రజాప్రతినిధి ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. అందుకే ఆయన్ని మార్చి బేస్తవారిపేట తహశీల్దార్కే కొమరోలు అదనపు బాధ్యతలు అప్పగించాలని ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. కనిగిరిలో అంతా కిరికిరే! అధికారులపై ‘ఉగ్ర’తాండవం కనిగిరి నియోజకవర్గంలో తహశీల్దార్ల బదిలీల ప్రక్రియ అంతా రాజకీయ కిరికిరిగా మారిపోయింది. నియోజకవర్గంలో ఐదుగురు తహశీల్దార్లను ఈ రెండు వారాల్లో బదిలీ చేయడం గమనార్హం. అధికార పార్టీ ప్రజాప్రతినిధి హుకుం మేరకు జిల్లా ఉన్నతాధికారులు వ్యవహరించారు. అసైన్మెంట్ భూములు, ప్లాట్ల కేటాయింపు విషయంలో నిబంధనల మేరకు వ్యవహరించినందున వెలిగండ్ల తహశీల్దార్‌పై ప్రజాప్రతినిధి కినుక వహించారు. ఫలితం.. ఆయన్ను అక్కడి నుంచి బదిలీ చేశారు. ఇలా నియోజకవర్గంలో కనిగిరి, వెలిగండ్ల, హనుమంతునిపాడు, పీసీపల్లి, పామూ రు తహశీల్దార్లను మార్చారు. అంతటితో ఆ ప్రజాప్రతినిధి సరిపుచ్చుకో లేదు. పీసీపల్లి తహశీల్దార్‌గా అదనపు బాధ్యతలు కూడా తాను ఇటీవల నియమించుకున్న పొరుగు మండల తహశీల్దార్‌కు అప్పగించాలని పట్టుబడుతున్నారు. అంతా నా ఇష్టం.. అన్న రీతిలో ఆ ప్రజాప్రతినిధి చెలరేగిపోతున్నారు. అద్దంకిలో మేడమ్ అనుచరులదే హవా కేంద్రమంత్రి పనబాక లక్ష్మి అనుచరులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారిపోయింది. అందుకు సంతమాగులూరు తహశీల్దార్ బదిలీ తీరే నిదర్శనం. సంతమాగులూరు తహశీల్దార్‌గా ఉన్న నాసరయ్యను మార్చి టి.ప్రశాంతిని నియమించారు. దీనిపై పనబాక లక్ష్మి అనుచరులు భగ్గుమన్నారు. జిల్లా ఉన్నతాధికారిపై చిందులు తొక్కారు. దాంతో రోజుల్లోనే అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. సంతమాగులూరు తహశీల్దార్ టి.ప్రశాంతిని బదిలీ చేసి అధికార పార్టీ నేతల ఆగ్రహాన్ని చల్లార్చారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇంతటితో సరిపుచ్చుకోలేదు. మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా రంగప్రవేశం చేశారు. తమ అనుకూల అధికారులను నియమించాలని పట్టుబడుతున్నారు. దీంతో రానున్న రోజుల్లో రాజకీయ లక్ష్యాలతో మరికొన్ని బదిలీలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.