సాక్షి ప్రతినిధి, ఒంగోలు: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అనుకుంటున్నారు.. ఎన్నికల నియమావళి అమల్లోకి రాకముందే పనికానిచ్చేద్దామని అనుకుంటున్నారు.. ఎన్నికల కోసం అనుకూల అధికారులు కావాలనుకుంటున్నారు.. వెరసి... జిల్లాలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధుల కన్ను తహశీల్దార్లపై పడింది. అధికార పార్టీ నేతలు కోరడం చాలు.. అన్నీ చేసిపెట్టే ఉన్నతాధికారి ఎలాగూ ఉన్నారు. ఇంకేముందీ.. జిల్లాలో తహశీల్దార్ల బదిలీల జాతర మొదలైంది. ఆ తీరు ఇదిగో ఇలా ఉంది.
ప్రజాప్రతినిధులు తాన.. ఉన్నతాధికారి తందాన...
కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల అభీష్టానికి అనుగుణంగా తహశీల్దార్ల బదిలీల ప్రహసం మొదలైంది. అధికారులను ఎంపిక చేసుకుని మరీ వారినే నియమించాలని ఉన్నతాధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. చెప్పింది తు.చ. తప్పకుండా పాటించే అధికారులనే ఏరికోరి పోస్టింగ్ వేయించుకుంటున్నారు. నిబంధనల మేరకు పనిచేస్తామనే అధికారులపై బదిలీ వేటు వేయిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారి తీరు కూడా అందుకు తగ్గట్లుగానే ఉంది. జిల్లాలో కొనసాగడంపై పట్టుదలగా ఉన్న ఆయన.. అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గుతున్నారు. తాను జిల్లాలో ఉంటే చాలు.. అధికార యంత్రాంగం మానసిక స్థైర్యం దెబ్బతిన్నా ఫర్వాలేదన్న రీతిలో సదరు ఉన్నతాధికారి వ్యవహరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు చెప్పిందే తడవుగా బదిలీలు చేసేస్తున్నారు. దీంతో తహశీల్దార్ల బదిలీ అంతా రాజకీయ ప్రహసనంగా మారిపోయింది. అదెలాగంటే..
అన్నా! అన్నన్నా..!
గిద్దలూరులో ఇష్టారాజ్యం
గిద్దలూరు ప్రజాప్రతినిధి తహశీల్దార్ల నియామకం అంతా తన ఇష్టారాజ్యంగా మార్చుకున్నారు. గత రెండు వారాల్లో ఆ నియోజకవర్గంలో ఏకంగా ఆరుగురు తహశీల్దార్లను బదిలీ చేయడం గమనార్హం. పూర్తిగా తనకు అనుకూల అధికారులను నియమించేలా జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆయన ప్రభావితం చేశారు. అసైన్‌మెంట్ కమిటీలో తన మాట వినలేదనే ఆగ్రహంతో కొమరోలు తహశీల్దార్‌ను ఆయన పట్టుబట్టి మరీ బదిలీ చేయించినట్టు సమాచారం. ఇక హైదరాబాద్‌లో పనిచేస్తున్న అధికారికి తన నియోజకవర్గంలోని రాచర్లలో పోస్టింగ్ ఇప్పించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అదే విధంగా మిగిలిన ఐదుగురిలో నలుగురి బదిలీలు ఆయన అభీష్టం మేరకే జరిగాయి.
గతంలో తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఓ అధికారికి ఆయన ఏరికోరి తన నియోకజవర్గంలో పోస్టింగ్ ఇప్పించుకున్నారు. కొమరోలుకు తాజాగా బదిలీ చేసిన తహశీల్దార్‌పై ప్రజాప్రతినిధి అయిష్టంగా ఉన్నారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. కనిగిరిలో అధికార పార్టీ ప్రజాప్రతినిధి వద్దని చెప్పిన ఆయన్ను తన నియోజకవర్గంలో ఎందుకు వేశారని సదరు ప్రజాప్రతినిధి ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. అందుకే ఆయన్ని మార్చి బేస్తవారిపేట తహశీల్దార్‌కే కొమరోలు అదనపు బాధ్యతలు అప్పగించాలని ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.
కనిగిరిలో అంతా కిరికిరే!
అధికారులపై ‘ఉగ్ర’తాండవం
కనిగిరి నియోజకవర్గంలో తహశీల్దార్ల బదిలీల ప్రక్రియ అంతా రాజకీయ కిరికిరిగా మారిపోయింది. నియోజకవర్గంలో ఐదుగురు తహశీల్దార్లను ఈ రెండు వారాల్లో బదిలీ చేయడం గమనార్హం. అధికార పార్టీ ప్రజాప్రతినిధి హుకుం మేరకు జిల్లా ఉన్నతాధికారులు వ్యవహరించారు. అసైన్‌మెంట్ భూములు, ప్లాట్ల కేటాయింపు విషయంలో నిబంధనల మేరకు వ్యవహరించినందున వెలిగండ్ల తహశీల్దార్‌పై ప్రజాప్రతినిధి కినుక వహించారు. ఫలితం.. ఆయన్ను అక్కడి నుంచి బదిలీ చేశారు. ఇలా నియోజకవర్గంలో కనిగిరి, వెలిగండ్ల, హనుమంతునిపాడు, పీసీపల్లి, పామూ రు తహశీల్దార్లను మార్చారు. అంతటితో ఆ ప్రజాప్రతినిధి సరిపుచ్చుకో లేదు. పీసీపల్లి తహశీల్దార్‌గా అదనపు బాధ్యతలు కూడా తాను ఇటీవల నియమించుకున్న పొరుగు మండల తహశీల్దార్‌కు అప్పగించాలని పట్టుబడుతున్నారు. అంతా నా ఇష్టం.. అన్న రీతిలో ఆ ప్రజాప్రతినిధి చెలరేగిపోతున్నారు.
అద్దంకిలో మేడమ్ అనుచరులదే హవా
కేంద్రమంత్రి పనబాక లక్ష్మి అనుచరులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారిపోయింది. అందుకు సంతమాగులూరు తహశీల్దార్ బదిలీ తీరే నిదర్శనం. సంతమాగులూరు తహశీల్దార్‌గా ఉన్న నాసరయ్యను మార్చి టి.ప్రశాంతిని నియమించారు. దీనిపై పనబాక లక్ష్మి అనుచరులు భగ్గుమన్నారు. జిల్లా ఉన్నతాధికారిపై చిందులు తొక్కారు. దాంతో రోజుల్లోనే అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు.
సంతమాగులూరు తహశీల్దార్ టి.ప్రశాంతిని బదిలీ చేసి అధికార పార్టీ నేతల ఆగ్రహాన్ని చల్లార్చారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇంతటితో సరిపుచ్చుకోలేదు. మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా రంగప్రవేశం చేశారు. తమ అనుకూల అధికారులను నియమించాలని పట్టుబడుతున్నారు. దీంతో రానున్న రోజుల్లో రాజకీయ లక్ష్యాలతో మరికొన్ని బదిలీలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అంతా మా ఇష్టం
Published Sat, Nov 30 2013 5:22 AM | Last Updated on Sat, Sep 2 2017 1:08 AM
Advertisement
Advertisement