రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
Published Tue, Aug 20 2013 6:15 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
రాజాం రూరల్,చీపురుపల్లి, న్యూస్‌లైన్: చీపురుపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రాజాంలోని లచ్చయ్యపేటకు చెందిన బలివాడ ఆండాల్ కృష్ణమూర్తి రైలు ఢీకొని సోమవారం మృతి చెందారు. సంఘటనకు సంబంధించి జీఆర్‌పీ హెచ్‌సీ చిరంజీవి అందించిన వివరాల ప్రకారం...సోమవారం మధ్యాహ్నం షాలీమార్ సూపర్ ఫాస్ట్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో కృష్ణారావు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు బూడిద రంగు షర్టు, నలుపు రంగుపై ఆకుపచ్చని చారలు గల ఫ్యాంటు వేసుకుని పైన బ్లూ కలర్ రెయిన్‌కోటు ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కృష్ణారావు రాజాంలోని ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నట్టు తెలిసింది.
రాజాం పట్టణంలోని లచ్చయ్యపేటకు చెందిన బలివాడ ఆండాళ్‌కృష్ణ(బుజ్జి)(41) సోమవారం చీపురుపల్లిలోని రైల్వేష్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడంతో రాజాంలో విషాదచాయలు అలముకున్నాయి. ఇతను స్థానిక మారుతీనగర్‌లోని ఎస్‌వీడీ పబ్లిక్ స్కూల్‌లో ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. విషయం తెలుసుకున్న స్కూల్ యజమాని సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని గుర్తించి తదుపరి కార్యక్రమాలు చేపట్టారు. నిరాడంబురుడైన కృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయాన్ని పట్టణవాసులు జీర్ణించుకోలేకపోయారు.
అప్పులు అధికంగా ఉన్నాయని, వారి భాదలు తట్టుకోలేకే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మృతుడికి భార్య సుశీలతోపాటు 12 ఏళ్ల కుమార్తె సాయి సాత్విక, తల్లి బాపు ఉన్నారు. ఇతని తండ్రి రాజు ఇటీవలే 5నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. తల్లి గుండె జబ్బుతో బాధపడుతోంది. దీంతో ఒక్కసారిగా విషయం తెలిస్తే మరేం ప్రమాదం సంభవిస్తుందోనని స్థానికులు గుట్టుగా ఉంచినట్టు భోగట్టా.
Advertisement
Advertisement