‘పైకా’కు పైసల్లేవ్ | Travel expenses For Students flittings | Sakshi
Sakshi News home page

‘పైకా’కు పైసల్లేవ్

Published Thu, Dec 11 2014 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 5:57 PM

‘పైకా’కు పైసల్లేవ్

‘పైకా’కు పైసల్లేవ్

- ప్రయాణ ఖర్చుల కోసం విద్యార్థుల పాట్లు
- మండలానికి కేవలం రూ.1000 చొప్పున కేటాయింపు
- ఆటలకు క్రీడాకారులు దూరం
- నిర్వహణ భారం పీఈటీల పైనే

కైకలూరు : గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న ‘పైకా’ (ప్రస్తుతం రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్  (ఆర్‌జీకేఏ)గా పేరు మార్చారు) క్రీడల నిర్వహణకు పైసలు కరువయ్యాయి. అధికారులు, పాలకులకు ముందుచూపు కొరవడటంతో గ్రామ స్థాయిలో ప్రతిభ కలిగిన క్రీడాకారులు కనుమరుగవుతున్నారు.

కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో 2008 ఏప్రిల్ ఒకటిన దేశంలో యువ క్రీడా ఔర్ ఖేల్ అభియాన్ (పైకా)ను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 16 సంవత్సరాలోపు క్రీడాకారుల ప్రతిభను గుర్తించడం దీని ప్రధాన ఉద్దేశం. కేంద్రం 75 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం నిష్పత్తిలో నిధులు కేటాయిస్తాయి. గ్రామ స్థాయిలో బ్లాక్, జిల్లా, రాష్ట్ర, ప్రాంతీయ, జాతీయ స్థాయి వరకు క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించుకునే అవకాశం ఇందులో ఉంది.

గ్రామీణ స్థాయిలో విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వడానికి ‘క్రీడాశ్రీ’లను నియమించారు. కేంద్రంలో నూతన ప్రభుత్వం రావడంతో పథకం పేరు మార్చారు. ఈ ఏడాది గ్రామీణ స్థాయిలో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటిన్, అథ్లెటిక్స్‌లో షాట్‌పుట్, డిస్క్‌త్రో, హైజంప్, లాంగ్‌జంప్, 4+100, 1500, 800, 400, 300, 100 మీటర్ల పరుగుపందేలు నిర్వహించాలని నిర్ణయించారు.

దీంతో జిల్లాలో ఈ నెల 5న గ్రామ స్థాయిలో, 6న మండల, 8న నియోజకవర్గ స్థాయిలో పోటీలు నిర్వహించారు. ఇక్కడ ఎన్నికైన వారికి జిల్లా స్థాయిలో ఈ నెల 9, 11, 12, 13, 15 తేదీల్లో విజయవాడలో ఏర్పాటు చేశారు. నిధుల కొరతతో క్రీడాకారులు, పీఈటీలు జిల్లా స్థాయి పోటీలకు రావడానికి  అవస్థలు పడుతున్నారు.
 
మండలానికి రూ.1000తో సరి...
జిల్లాలోని ఆర్‌జీకేఏ క్రీడల నిర్వహణ నిమిత్తం ఒక్కో మండలానికి కేవలం రూ.1000 కేటాయించి క్రీడా అధికారులు చేతులు దులిపేసుకున్నారు. ఆయా మండలాల్లో ఎంపికైన క్రీడాకారులు నియోజకవర్గంలో జరిగే క్రీడలకు హాజరుకావాలి. అంటే జిల్లాలోని 16 నియోజకవర్గాల పరిధిలోని 34 మండలాల క్రీడాకారులు నియోజకవర్గ పోటీలకు కచ్చితంగా రావాలి. ఈవెంట్లను బట్టి ఒక్కో మండలం నుంచి సుమారు 80 నుంచి 90 మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఉదాహరణకు కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం నుంచి కైకలూరు పోటీలకు రావాలంటే ఒక్కొక్కరు బస్సుకు రూ.12, ఆటోకు రూ.15 చెల్లించాలి. దీనికి తోడు భోజనం ఖర్చు ఉంటుంది. ఖర్చులు ఇలావుంటే మండలానికి కేటాయించిన రూ.1000 ఏవిధంగా సరిపోతాయని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఒక్కొక్కరు మూడు దరఖాస్తులు, మూడు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు అందజేయాలి.

వీటికోసం కనీసం రూ.50 ఖర్చవుతుంది. ఇక జిల్లా స్థాయి పోటీలను విజయవాడలో ఏర్పాటు చేశారు. జిల్లా శివారు ప్రాంతాల నుంచి విజయవాడ చేరుకోవాలంటే కనీసం రూ.100 చార్జీలు అవుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో చేసేది లేక ఆయా పీఈటీలు అప్పులు చేసి మరీ విద్యార్థులను పోటీలకు తీసుకువె ళుతున్నారు.
 
క్రీడాకారులు ఫుల్.. సౌకర్యాలు నిల్...
జిల్లాలో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నప్పటికీ గ్రామీణ స్థాయిలో మౌలిక సదుపాయాలు ఉండటం లేదు. గత ప్రభుత్వ హయాంలో పైకా పథకంలో ప్రతి గ్రామానికి రూ.లక్ష, బ్లాక్ పంచాయతీలకు రూ.5 లక్షలు, ఏడాదికి క్రీడా పరికరాల నిమిత్తం రూ.10 వేలు నుంచి రూ.20 వేలు, మెయింటెనెన్స్‌కు రూ.12 వేల నుంచి రూ.24 వేల వరకు అందిస్తామని అన్నారు. వాటి ని మొదటి ఫేజ్‌లో కొన్నింటికి అందించారు.

గ్రామాల్లో క్రీడా స్థలాల సేకరణకు వచ్చిన నిధులు కొందరు ఎంపీడీవోలు శ్రద్ధ చూపని కారణంగా వెనక్కి మళ్లాయి. రెండేళ్లుగా క్రీడాశ్రీలకు నెలకు రూ.500, పీడీలకు రూ.1000 గౌరవవేతనం రాలేదు. హైజంప్ చేయడానికి పరికరాలు లేకపోవడంతో అనేక మంది పోటీలు నిర్వహించకుండానే పేర్లు రాసుకున్నారు. ఇప్పటికైనా నూతన ప్రభుత్వాలు గ్రామీణ స్థాయిలో క్రీడలను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవాలని క్రీడాకారులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement