
చెట్లు నరికితే జీవిత ఖైదు విధించాలి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అడవుల విధ్వంసానికి కారకులైన వారికి జీవితకాల జైలు శిక్ష విధించేలా చట్టాలను మార్పు చేయాల్సిన అవరసముందని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. చెట్లను నరికిన వారికీ శిక్షలు పడేలా చట్టాలను రూపొందించాల్సి ఉందని చెప్పారు. ‘కలప ధరలు పెరిగిపోవడంతో స్మగ్లర్ల కన్ను అడవులపై పడింది. కలప దొంగలకు ముకుతాడు వేయాలంటే కఠినశిక్షలు అమలు చేయాల్సిందే’ అని పేర్కొన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం కండ్లకోయ గ్రామ రిజర్వ్ ఫారెస్టు పరిధిలో 64వ వనమహోత్సవంలో పాల్గొన్నారు.
పాఠశాలల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ మన పూర్వీకులు ఆస్తిపాస్తులతోపాటు ఇచ్చిన అమూల్యమైన వృక్ష సంపదను పదిలంగా భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అటవీ విస్తీర్ణం చాలా తక్కువగా ఉందని, దీన్ని 33 శాతానికి పెంచేందుకు పాటుపడాలని పిలుపునిచ్చారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు పెంచాలనే విధాన నిర్ణయాన్ని తీసుకున్నట్లు కిరణ్ చెప్పార
జీవితంలో ప్రత్యేకమైన రోజుల్లో ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటేలా అలవాటు చేసుకోవాలని అటవీశాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అన్నారు. త్వరలోనే తెలంగాణ ప్రాంతంలో 1184 మంది అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ల నియామకానికి సీఎం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారని శత్రుచర్ల వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి సబిత, ఎమ్మెల్యేలు కేఎల్లార్, రాజిరెడ్డి, రాజేందర్, భిక్షపతియాదవ్, ఎమ్మెల్సీ జనార్ధన్‌రెడ్డి, సీసీఎఫ్ బీఎస్‌ఎస్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.