చిన్నారుల మృతదేహాల వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు
సాక్షి, ఇచ్ఛాపురం: విధి వైపరీత్యమో? తల్లిదండ్రుల శాపమో? గానీ తోటివారితో కలిసి హోలీ పండగ సందర్భంగా రంగులు చల్లుకున్న చిన్నారులు నదిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. ప్రాణస్నేహితులైన ఆ చిన్నారులిద్దరూ కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఇచ్ఛాపురం పట్టణం శోకసంద్రంలో మునిగిపోయింది. ఎప్పటిలాగానే ఉదయం ఇంటిలో తల్లిదండ్రులతో సరదాగా గడిపి తోటి స్నేహితులతో కలిసి హోలీ పండగను చేసుకుని ఇంటికి వస్తానని చెప్పి ఇంటినుంచి బయటికి వెళ్లిన చిన్నారులు నగరంపల్లి జతిన్(14), కాళ్ల శ్రీనివాస్ స్నేహిత్(14)ల సంతోషం ఎంతో సేపు నిలవలేదు.
వారిద్దరూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారనే వార్త వారిని కన్నవారిని శోకసంద్రంలో ముంచింది. పట్టణంలోని దానంపేటలో ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న ఎన్.మోహన్‌రావు, ఈశ్వరిల రెండవ సంతానమైన జతిన్, వాసుదేవ్ క్వార్టర్స్‌కు చెందిన శుభకార్యాలకు సామగ్రి అద్దెకిస్తున్న కాళ్ల.శ్రీహరి, అనూరాధల రెండవ సంతానం శ్రీనివాస్‌స్నేహిత్‌లు స్థానిక ప్రైవేట్ ఇంగ్లీషు మీడియం పాఠశాల జ్ఞానభారతిలో 9 వ తరగతి చదువుతున్నారు. వారిద్దరూ గురువారం తోటి వారితో కలిసి రంగులు పూసుకుని సరదాగా హోలీ పండగను జరుపుకున్నారు. అనంతరం స్నానాలు చేయడానికని మరో ఇద్దరు స్నేహితులతో కలిసి బాహుదానది దగ్గర రాళ్లగుమ్ము ప్రాంతానికి వెళ్లారు. స్నానం చేయడానికి నలుగురు చిన్నారులు నదిలోకి దిగారు. అయితే ఆ చిన్నారుల్లో ఎవరికీ నదిలో ఈతకొట్టడం తెలియదు. వారు స్నానాలు చేయడానికి నదిలో దిగిన ప్రదేశం చాలా లోతుగా ఉండడంతో జతిన్, స్నేహిత్‌లు నీటిలో మునిగిపోయారు.
సంఘటనా స్థలంలోనే మృతి
వారిద్దరూ నీటిలో మునిగి పోవడంతో మిగిలిన స్నేహితులు కేకలు పెట్టగా అక్కడికి కొంత దూరంలో స్నానాలు చేస్తున్న వారు వచ్చి నదిలో గాలించగా మొదట స్నేహిత్ దొరికాడు. వెంటనే ఆ చిన్నారిని ద్విచక్రవాహనంపై స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే స్నేహిత్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నీటిలో సుమారు 30నిమిషాలు గాలించిన తరువాత జతిన్ ఆచూకీ లభించింది. అయితే అప్పటికే జతిన్ అనంతదూరాలకు చేరిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారి మృతి విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు, స్థానికులతో ఆసుపత్రి ఆవరణ నిండిపోయింది. ఈ సంఘటనతో పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment