మహానంది/ గిద్దలూరు రూరల్: రెండు లారీలు ఢీకొని ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం రాత్రి నల్లమల ఘాట్ రోడ్డులో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గిద్దలూరు నుంచి శనగల లోడుతో కర్నూలు జిల్లా గుత్తి వైపుగా వెళుతున్న లారీ నంద్యాల నుంచి చిలకలూరిపేటకు వడ్లలోడుతో వెళుతున్న లారీ ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్నాయి. అనంతరం శనగల లోడు లారీ లోయలో పడిపోయింది. వడ్ల లోడు లారీ రోడ్డుపై అడ్డంగా పడిపోయింది. దీంతో నంద్యాల నుంచి గిద్దలూరు వైపు వచ్చే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదంలో గిద్దలూరుకు చెందిన శనగల లారీ డ్రైవర్ రాముడు, క్లీనర్ నాగూర్ బాషాలకు, నంద్యాలకు చెందిన వడ్లలోడు లారీ డ్రైవర్ గుంజ ఎర్రన్న అతడి కుమారుడు క్లీనర్ చిన్నసుబ్బారాయుడుతో పాటుగా అదే లారీలో ప్రయాణిస్తున్న చింతకుంటకు చెందిన చిన్న ఏసుకు గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న గిద్దలూరు పోలీసులు సంఘటనా స్థలం వద్దకు చేరుకుని క్షతగాత్రులు గుంజ ఎర్రన్న, చిన్నసుబ్బరాయుడు, నాగూర్‌బాషా, చిన్న ఏసులను చికిత్స నిమిత్తం పట్టణంలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. శనగల లోడు లారీ డ్రైవర్ రాముడు మాత్రం లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోవడంతో పోలీసులు అతి కష్టం మీద బయటకు తీసే ప్రయత్నం చేశారు. చిన్నఏసు కంబం వద్ద ఉన్న చింతకుంటకు వెళ్లేందుకు వడ్ల లోడుతో వెళుతున్న లారీలో గాజులపల్లె వద్ద ఎక్కాడు. ఈ ప్రమాదంలో క్లీనర్లు నాగూర్‌బాషా, చిన్నసుబ్బరాయుడులకు స్వల్ప గాయాలయ్యాయి. లారీలో ప్రయాణిస్తున్న చిన్న ఏసు తలకు, కాళ్లకు చేతులకు డ్రైవర్లు, ఎర్రన్న, చిన్నసుబ్బరాయుడులకు తలకు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment