= పండగరోజూ ఉద్యమం
= సమైక్యాంధ్ర ఆకాంక్ష చాటిన జిల్లావాసులు
= విభజన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్
= కొనసాగిన రిలేదీక్షలు
జిల్లాలో విజయదశమి రోజూ సమైక్యాంధ్ర ఉద్యమం ఆగలేదు. సమైక్యవాదులు దసరా పండగనాడూ నిరసన కార్యక్రమాలు కొనసాగించి సమైక్యాంధ్ర ఆకాంక్షను చాటిచెప్పారు. రాష్ట్ర సమైక్యతను కాంక్షిస్తూ గొంతెత్తి నినదించారు. ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ సమైక్య స్ఫూర్తిని చాటారు. జిల్లా వ్యాప్తంగా నిరాహారదీక్షలు, నిరసనలు కొనసాగాయి.
సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో దసరా పండగ రోజైన ఆదివారమూ కొనసాగింది. రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ సమైక్యవాదులు నినాదాలు చేశారు. నిరాహారదీక్షలు, నిరసనలతో విభజన నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర ఆకాంక్షను చాటిచెప్పారు. మైలవరంలో ఎన్జీఓల ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారం 48వ రోజుకు చేరాయి. గుడివాడ నెహ్రూచౌక్ సెంటర్‌లో సమైక్యాంధ్ర కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. మల్లాయిపాలెం గ్రామైక్య మహిళలు దీక్షల్లో పాల్గొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఉద్యోగుల దీక్షలు కొనసాగుతున్నాయి. నందివాడ మండలం టెలిఫోన్ నగర్‌లో సమైక్యాంధ్ర కోరుతూ దీక్షలు కొనసాగాయి.
సమైక్యం కోసం ప్రత్యేక పూజలు...
రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ కురుమద్దాలి శ్రీచెన్నకేశవస్వామి ఆలయంలో వైఎస్సార్ సీపీ నాయకురాలు ఉప్పులేటి కల్పన ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. తిరువూరులో వైఎస్సార్‌సీపీ రిలేదీక్షలు 12వ రోజుకు చేరాయి. పార్టీ మండల, పట్టణ కన్వీనర్లు శీలం నాగనర్సిరెడ్డి, చలమాల సత్యనారాయణ ఆధ్వర్యంలో తిరువూరు తంగీళ్లబీడుకు చెందిన పార్టీ కార్యకర్తలు, పలువురు మహిళలు దీక్షలో పాల్గొన్నారు.
పలువురు కార్యకర్తలు రిలేదీక్ష నిర్వహించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కంకిపాడు సబ్‌రిజిస్ట్రారు కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే దీక్షలు 59వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. కంకిపాడు సినిమాహాలు సెంటరులో జాతీయ రహదారిపై సమైక్యవాదులు రాస్తారోకో చేశారు. ఆర్టీసీ విద్యాధరపురం గ్యారేజీ కార్మికులకు తుమ్మల ఆంజనేయులు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిత్యావసరాలు అందజేశారు.
ఒంటికాలిపై నిలబడి...
పామర్రు నాలుగు రోడ్ల కూడలిలో ఒంటికాలిపై నిలబడి సమైక్యవాదులు తమ నిరసన తెలిపారు. తొలుత ఏపీఎన్‌జీవో, జేఏసీ నాయకులు సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. పెదపారుపూడిలో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు ఆదివారం 51వ రోజుకు చేరాయి. గుడివాడ-కంకిపాడు రహదారి పక్కన మొక్కలు నాటి తమ నిరసన తెలిపారు. నూజివీడులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే దీక్షలు 48వ రోజుకు చేరాయి.
ముసునూరు మండలం చింతలవల్లికి చెందిన పార్టీ నాయకులు రిలేదీక్షలో కూర్చున్నారు. ఈ దీక్షలను సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ప్రారంభించారు. పెడన పట్టణంలో మహాత్మాగాంధీ షాపింగ్ కాంప్లెక్స్‌లో పట్టణ ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు.
దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మ దహనం...
కలిదిండి సెంటరులో సమైక్యాంధ్రకు మద్దతుగా డ్వాక్రా మహిళలు రిలే దీక్ష చేశారు. అనంతరం కలిదిండి సెంటరులో దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ముదినేపల్లి మండల సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 28వ రోజుకు చేరాయి. ముదినేపల్లి అంగన్‌వాడీ సెక్టార్‌కు చెందిన కార్యకర్తలు దీక్షలో కూర్చున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి.
చల్లపల్లి జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు 65వ రోజుకు చేరాయి. మోపిదేవి శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం ఎదురుగా చేపట్టిన రిలేనిరాహార దీక్షలు 42వ రోజుకు చేరాయి. ఈ దీక్షలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు మద్దతు ప్రకటించారు. నాగాయలంకలో జేఏసీ, లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు 47వ రోజుకు చేరుకున్నాయి. వక్కపట్లవారిపాలెం, బ్రహ్మానందపురం దళితవాడలకు చెందిన బాబూ జగ్జీవన్‌రామ్ యువజన సంఘం ఆధ్వర్యంలో దళితులు దీక్ష చేశారు.