వంతెనకు మళ్లీ కంత
రాజమండ్రి సిటీ :ఉభయ గోదావరి జిల్లాలను కలిపే రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిపై మంగళవారం మరో రంధ్రం ఏర్పడింది. ఇది రోడ్లు, భవనాల శాఖ అధికారుల నిర్లక్ష్యం ఫలితమేనని చెప్పవచ్చు. బ్రిడ్జిపై గతనెల 9న 33వ స్తంభం వద్ద రంధ్రం ఏర్పడి రాకపోకలకు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఆ రంధ్రానికి 20 అడుగుల దూరంలో మరో రంధ్రం పడేలా ఉందని గుర్తించినా అధికారులు నిర్లక్ష్యం వహించారు. అయితే రంధ్రం పడక ముందే మరమ్మతులు చేయించకపోవడానికి రైల్వేశాఖ అనుమతి రాకపోవడమే కారణమని ఆర్ అండ్ బీ అధికారులంటున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2.40 నుంచి 3.40 గంటల వరకు రోడ్డు వంతెన కిందనున్న రైలు వంతెన మీదుగా రైళ్ల రాకపోకలను నిలిపి వేయడానికి రైల్వేశాఖ అనుమతించింది. రైళ్ల కోసం ఏర్పాటు చేసిన హైటెన్షన్ లైనుకు సరఫరా నిలిపివేశారు. ఆ సమయంలో రంధ్రానికి మరమ్మతులు ప్రారంభించారు.
మరమ్మతుల సమయంలో రైళ్లను గోదావరి రైల్వే స్టేషన్, మూడో రైలు వంతెన మీదుగా మళ్లించారు. కాగా వంతెన మీదుగా భారీ వాహనాల రాకపోకలను వారంరోజుల పాటు నిషేధించారు. ప్రస్తుతం మోటారు సైకిళ్ళు,ఆటోలు,చిన్నకార్లను మాత్రమే అనుమతిస్తున్నారు. రాజమండ్రి వైపు నుంచి కొవ్వూరు వైపు వెళ్లే భారీ వాహనాలు, బస్సులను రాజమండ్రి మోరంపూడి సెంటర్ నుంచి వేమగిరి మీదుగా మళ్లించారు. రాజమండ్రిలో కోటిపల్లి బస్టాండ్ వద్ద భారీ వాహనాలను నిలిపివేస్తున్నట్టు బోర్డు ఏర్పాటు చేశారు. రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై తరచూ రంధ్రాలు ఏర్పడడంతో ప్రయాణికులు కలవరపడుతున్నారు. బ్రిడ్జి నిర్వహణను నిర్లక్ష్యం చేయడమే ఇందుకు కారణమని ఆరోపిస్తున్నారు. ఇకనైనా నిర్వహణపై శ్రద్ధ వహించి, ఎలాంటి ఆపదా వాటిల్లక ముందే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.