భద్రాచలం, న్యూస్‌లైన్: భద్రాచలం పట్టణాన్ని పోలీసులు ఆదివారం సాయంత్రం దిగ్బంధించారు. జిల్లా ఎస్పీ రంగనాధ్ ఆదేశాల మేరకు ఏఎస్పీ ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో ట్రైనీ డీఎస్పీ వెంకటేశ్వర్లు, భద్రాచలం పట్టణ, రూరల్ సీఐలు శ్రీనివాసరెడ్డి, భోజరాజులు వేర్వేరు బృందాలుగా ఏర్పడి సుమారు 200 మంది పోలీసులతో పట్టణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.భద్రాచలం బ్రిడ్జి సెంటర్, అంబేద్కర్ సెంటర్, చర్ల రోడ్డు, బస్టాండ్‌తో పాటు పట్టణంలోని లాడ్జీలు, హోట్‌ళ్లు, మద్యం దుకాణాలను తనిఖీ చేశారు. గోదావరి బ్రిడ్జి సెంటర్‌లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి వద్ద రూ. 5లక్షలు లభించాయి. అతను వాటి వివరాలు తెలపకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా చర్ల రోడ్‌లో మరో వ్యక్తి వద్ద రూ. 5లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే వెంకటాపురానికి చెందిన ఓ కారులో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా గోనె సంచుల్లో తరలిస్తున్న రూ. 1.66 కోట్ల నగదు లభించింది. వెంకటాపురం కేంద్రం ధాన్యం, పత్తి కొనుగోలు వ్యాపారం చేస్తున్న వారు ఈ నగదుకు సంబంధించి లెక్కలు చెప్పకపోవడంతో స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఆర్టీసీ బస్సులో గంజాయి...
ఆర్టీసీ బస్టాండ్‌లో తనిఖీలు నిర్వహిస్తుండగా కుంట నుంచి విజయవాడకు వెళ్లే ఆర్టీసీ బస్సులో 17.5 కేజీల గంజాయి సంచుల్లో తరలిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 2లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అదే విధంగా పట్టణంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మూడు బెల్ట్ షాపులపై, సారా రవాణా చేస్తున్న ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. సరైన పత్రాలు లేని రెండు ఆటోలు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మూడు గంటల వ్యవధిలోనే...
గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు భద్రాచలం పట్టణంలో ఏక కాలంలో విస్తృత తనిఖీలు చేశారు. కేవలం మూడు గంటల వ్యవధిలో చేపట్టిన ఈ తనిఖీల్లో రూ.1.76 కోట్ల నగదుతో పాటు రూ.2 లక్షల విలువైన గంజాయి, పలు వాహనాలను స్వాధీనం చేసుకోవటంతో పాటు, బెల్ట్ షాపులపై కేసులను నమోదు చేశారు. వెంకటాపురానికి చెందిన ధాన్యం వ్యాపారుల నుంచి పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకోవడం భద్రాచలం పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా రూ. 50వేల నగదు లావాదేవీలు జరపాలంటే తప్పనిసరిగా పాన్ కార్డు వివరాలు సమర్పించాలి. కానీ ఇలా కోట్దా రూపాయలను గోనె సంచుల్లో తీసుకెళ్తుండడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ధాన్యం, పత్తి కొనుగోలు చేసినందుకు రైతులకు చెల్లించాల్సి డబ్బులని ఆ వ్యాపారులు చెబుతున్నారు. దీంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు.
ఇక నిరంతరం తనిఖీలు: ఏఎస్పీ ప్రకాష్‌రెడ్డి
ముక్కోటి ఉత్సవాల నేపథ్యంలో ఎస్పీ రంగనాధ్ ఆదేశాల మేరకు భద్రాచలం పట్టణంలో ఇక నుంచి విస్తృతంగా తనిఖీలు చేపట్టనున్నట్లు భద్రాచలం ఏఎస్పీ ప్రకాష్‌రెడ్డి తెలిపారు. ఆదివారం రాత్రి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలే కరుల సమావేశంలో ఈ తనిఖీలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పట్టుబడిన డబ్బులకు సంబంధించి తగిన ఆధారాలు చూపితే వారికి అప్పగిస్తామని అన్నారు. ఇటువంటి తనిఖీలు ఇక నుంచి నిరంతరం కొనసాగిస్తామని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ట్రైనీ డీఎస్పీ వెంకటేశ్వర్లు, పట్టణ, రూరల్ సీఐలు శ్రీనివాసరెడ్డి, భోజరాజు, ఎస్సైలు రామారావు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
విస్తృత తనిఖీలు
Published Mon, Jan 6 2014 3:13 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
Advertisement
Advertisement