సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లాలో మహిళా కానిస్టేబుళ్ల సంఖ్య పెరగడం లేదు. శాంతి భద్రతల పరిరక్షణకు సరిపడనంత మహిళా సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులొస్తున్నాయి. పురుష అధికారులతో పోల్చి చూస్తే కింది స్థాయి సిబ్బందిలో మాత్రమే మహిళలు కనిపిస్తున్నారు. రిక్రూట్‌మెంట్‌లోనూ, ఎలాట్‌మెంట్‌లోనూ 33శాతం రిజర్వేషన్ ఉండాలన్న పోలీస్ శాఖ నిబంధన జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 82మంది మహిళలే పని చేస్తున్నారు. హోంగార్డుల్లో మహిళలున్నా అది పరిగణనలోకి రాదని పోలీస్ అధికారులే చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు వేల మందికి పైగానే పోలీస్ శాఖ సిబ్బంది పని చేస్తున్నారు. ఈ లెక్కన చూస్తే 33శాతం రిజర్వేషన్ కనిపించడం లేదు. మహిళా కానిస్టేబుళ్ల సంఖ్య క్రమేణ తగ్గిపోవడంతో భవిష్యత్తులో మరింత ఇబ్బందులు తప్పవని సంఘాల సభ్యులు వాపోతున్నారు.
ఇదీ పరిస్థితి...
1977లో జిల్లా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సేవలు ప్రారంభించింది. అప్పటికి కేవలం పదిలోపే మహిళా సిబ్బంది ఉండేవారు. 1995 తరువాత పూర్తి స్థాయిలో మహిళా సిబ్బంది విధుల్లోకి వచ్చారు. అయినా జిల్లాలో వారి సంఖ్య ఇప్పటికీ 82 దాటలేదు. జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు వేల మంది పోలీస్ సిబ్బంది ఉంటే వారిలో 33శాతం మహిళలు ఎక్కడా లేరు. విచిత్రమేమిటంటే జిల్లా కేంద్రంలో ఉన్న మహిళా పోలీస్‌స్టేషన్‌లోనూ పురుష అధికారే ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ మహిళా ఎస్‌ఐ, సీఐ, డీఎస్పీ లేరంటే బాధాకరమే. మహిళా సమస్యలు తీర్చేందుకు, ధర్నాలు, బందోబస్తుకు సంబంధించి మహిళల ఉద్యమాలు, ఆందోళనల్లో విధులు నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో మహిళా సిబ్బంది లేకపోవడంతో పురుష పోలీస్ అధికారులు నానా ఇబ్బంది పడుతున్నారు.
జిల్లాలో మూడు సబ్ డివిజన్లు, 42పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. మహిళా సమస్యల పరిష్కారానికి త్వరలో ప్రతి సబ్ డివిజన్ పరిధిలోనూ ఒక మహిళా పోలీస్‌స్టేషన్ తప్పనిసరిగా ఉండాలని గతంలోనే నివేదికలు వెళ్లాయి. జిల్లాలో సుమారు రెండు వేలకు పైగా పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఉన్న మహిళల్లో 82మంది మహిళా సిబ్బంది ఉన్నారు.
బెటాలియన్ అవసరమే...
జిల్లాకు ప్రత్యేక మహిళా బెటాలియన్ అవసరం ఉందని గతంలోనే గుర్తించారు. రాష్ర్ట విభజన తరువాత ఇప్పటి వరకూ ఈ జిల్లాకు రిక్రూట్‌మెంట్, సిబ్బంది మంజూరీ జరగలేదు. జిల్లాలో 40మందికి పైగా కానిస్టేబుళ్లు, 12మంది హెడ్‌కానిస్టేబుళ్లు, ఆరుగురు ఏఎస్‌ఐలు మాత్రమే చలాకీగా ఉన్నట్టు పోలీస్‌శాఖ అంతర్గత సమావేశంలో తేల్చినట్టు తెలిసింది. ఉన్న 82మంది సిబ్బందిలో మిగిలిన వారంతా ఫిట్‌నెస్‌కు దూరంగానే ఉన్నారని ఓ పోలీస్ అధికారి స్పష్టం చేశారు. ఉమెన్ పోలీస్‌స్టేషన్‌లోనూ సరిపడా మహిళా సిబ్బంది లేరు. మహిళా బాధితుల కష్టాల్ని వినే నాధు డే కరువయ్యాడు. జిల్లా జనాభా 25 లక్షలు దాటింది. మహిళా పోలీసుల సంఖ్య మాత్రం 100 లోపే ఉండడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉందని, జిల్లాలో మహిళా పోలీసుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని ఎస్పీ ఏఎస్ ఖాన్ స్పష్టం చేశారు.
మహిళా కానిస్టేబుళ్లు అంతంతమాత్రమే!
Published Wed, Feb 10 2016 12:17 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement