కడపలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
కడప : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా పలు ప్రాంతాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు వేడుకలు జరుపుకుంటున్నారు. పులివెందుల సమన్వయకర్త వైఎస్ అవినాష్ రెడ్డి శనివారం ఉదయం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. మాజీ మున్సిపల్ ఛైర్మన్ రుక్మిణీదేవి పులివెందులలోని సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు.
జగన్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే కె.శ్రీనివాసులు, నియోజకవర్గ కన్వీనర్ బ్రహ్మానందరెడ్డి రైల్వే కోడూరు ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. విశాఖలోనూ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మరోవైపు కుత్బుల్లాపూర్ నేత కొలన్ శ్రీనివాస్ రెడ్డి ...కేక్ కట్ చేసి వికలాంగులకు స్లెచర్స్ పంపిణీ చేశారు.
కాగా జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గతేడాది తమ అభిమాన నేత జైలులో ఉండటంతో జిల్లాలోని పార్టీ నాయకత్వంతో పాటు కార్యకర్తలు, జగన్ అభిమానులు నిస్తేజంలో ఉండి జన్మదిన వేడుకలు అంతంత మాత్రంగానే నిర్వహించారు. బెయిల్‌పై జగన్ బయటకు రావడం, సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రజల తరఫున పోరాడుతుండటంతో ఈ ఏడాది ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
పార్టీ నేతలతో పాటు సామాన్య ప్రజలు కూడా జగన్ జన్మదినం రోజున పండ్లు, మిఠాయిలు, బ్రెడ్లు పంచనున్నారు. పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లి, వరిగడ్డిపల్లెలో వైద్యశిబిరాలను నిర్వహించనున్నారు. హైపటైటిస్ బీ-వ్యాక్సిన్‌ను కూడా పంపిణీ చేయనున్నారు. కడప బాలాజీనగర్‌లో వైఎస్సార్‌సీపీ నేత నారుమాధవరెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. పార్టీ సీనియర్‌నేత నవనీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కొత్త కలెక్టరేట్ వద్ద అన్నదానం నిర్వహించనున్నారు.
పార్టీ సేవాదళ్ అధ్యక్షుడు నిత్యానందరెడ్డి ఆధ్వర్యంలో అంగడివీధిలో, ఎస్సీ, ఎస్టీ సెల్ నేత వేణుగోపాల్ నాయక్ ఆధ్వర్యంలో పద్మమానసిక వికలాంగుల పునరావాసకేంద్రంలో, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో సాయిబాబా అనాథ శరణాలయంలో అన్నదానం నిర్వహించనున్నారు. రాజంపేటలోని మన్నూరు వికలాంగ శరణాలయంలో పట్టణ బీసీ కన్వీనర్ పసుపులేటి సుధాకర్ ఆధ్వర్యంలో మినరల్‌వాటర్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు జిల్లాలోని నియోజకవర్గ, మండల కేంద్రాల్లోని ఆస్పత్రులు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలలో పండ్లు, మిఠాయిలు, బ్రెడ్లు పంపిణీ చేయనున్నారు. కడపలో అంజాద్‌బాషా ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేయనున్నారు.