ఒక్క జగన్‌పై వందల కుట్రలు జరిగాయి. కాంగ్రెస్, టీడీపీ ఏకమయ్యాయి. జగన్‌పై సీబీఐ కేసు పెట్టేదాకా తెగించాయి. లక్షల కోట్లు దండుకున్నాడని ఒకరన్నారు... ఆర్థిక ఉగ్రవాది అని మరొకరు అన్నారు.. జగన్ చేసిన తప్పుకు ఉరి తీయాలని మరోపెద్దమనిషి ఊగిపోయాడు. జగన్ ఏ తప్పు చేసింది తేలకముందే...కోర్టులు తీర్పు ఇవ్వకముందే టీడీపీ, కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలు ఇవి.
ఎవరెన్ని ఆరోపణలు చేసినా జనం మాత్రం జగన్ ఏ తప్పు చేయలేదని నమ్మారు. అందుకే ఆయన వెంట నడిచారు. జనంమాటే నిజమయ్యేలా న్యాయస్థానంలో తొలివిజయం దక్కింది. బెయిల్ మంజూరైంది. అంతే.. టీడీపీ, కాంగ్రెస్ ఆరోపణలను ప్రజలు పటాపంచలు చేశారు. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో జననేత జైలు నుంచి బయటకు వచ్చాడని పండుగ చేసుకున్నారు.
సాక్షి, కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సీబీఐ ప్రత్యేకకోర్టు మంజూరు చేసిన బెయిల్‌తో మంగళవారం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. సోమవారం సాయంత్రం బెయిల్ మంజూరు చేసినప్పటి నుంచి మంగళవారం జగన్ ఇంటికి వచ్చే వరకూ జిల్లా వాసుల ఆనందానికి హద్దుల్లేవు. ఓ నాయకుడికి బెయిల్ వస్తే ఆయన పార్టీ కార్యకర్తలు, కుటుంబీకులు సంతోషపడతారు. ఇది సహజం. అయితే జగన్‌కు బెయిల్ వచ్చిందనే వార్త తెలియగానే జిల్లాలోని లక్షలాది మంది పండుగ చేసుకున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇలా ఓ వ్యక్తి జైలు నుంచి బయటకు వచ్చాడని పండుగ చేసుకోవడం ఇదే ప్రథమం.
టీడీపీ, కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలకు చెంపపెట్టు:
రాజకీయంగా ప్రజాక్షేత్రంలో జగన్‌ను ఎదుర్కోలేక తమ రాజకీయ భవిష్యత్తుకు ముప్పు వాటిల్లిందని టీడీపీ, కాంగ్రెస్ కుట్రపన్ని జగన్‌ను జైలుకు నెట్టాయి. లక్షకోట్ల రూపాయలు దండుకున్నాడని చంద్రబాబు నాయుడు పాదయాత్రలో ప్రతీ పల్లెలో గొంతెత్తి అరిచారు. ఆయనకు వంత పాడే పత్రికలూ ఇదేరీతిన ప్రచారం చేశాయి. కాంగ్రెస్‌పార్టీ నేతలు కూడా తీవ్రమైన విమర్శలు చేశారు. జగన్ ఇక జైలు నుంచి బయటకు రారని కొందరు, జగన్‌లాంటి ఆర్థిక ఉగ్రవాదికి శిక్షపడాల్సిందేనని ఇంకొందరు అన్నారు. ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ఏకంగా జగన్‌ను ఉరి తీయాలన్నారు. ఇవన్నీ ప్రజలు నమ్ముతారని వారు అనుకున్నారు. తద్వారా రాజకీయంగా లబ్ధి పొందొచ్చని భావించారు. అయితే కోర్టు బెయిల్ ఇవ్వడంతో రెండుపార్టీలకు గట్టిదెబ్బ తగిలింది. జిల్లా ప్రజలు మాత్రం ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. జగన్ కేసు కోర్టులో నడుస్తోంది, ఇప్పుడు ఆయనకు వచ్చింది కేవలం బెయిల్ మాత్రమే అయినా ప్రజలు మాత్రం ఇంటింటా పండుగ చేసుకున్నారు. దీనికి కారణం జగన్ ఏ తప్పు చేయలేదని వారు బలంగా నమ్మడమే.ఈ పరిణామంతో జగన్‌పై టీడీపీ, కాంగ్రెస్ ఎన్ని అసత్య ఆరోపణలు చేసినా జనం నమ్మరని తేలిపోయింది. ఆ రెండుపార్టీలకు చెంపపెట్టు అయింది.
ఊరువాడా సంబరం:
జగన్‌కు బెయిల్ వార్తతో తమ ఇంట్లోని బిడ్డే కోర్టు నుంచి బయటకు వస్తున్నాడనేలా ప్రజలు ఆనందసాగరంలో మునిగిపోయారు. ప్రొద్దుటూరుకు చెందిన ఎవాంజిలిన్ అనే మహిళ ఇంటి ఎదుట కళ్లాపి చల్లి, జగన్‌పేరుతో ముగ్గులేసి, పండుగ చేసుకున్నారు. ఈమె మాత్రమే కాదు రాజంపేట నియోజకవర్గంలోని పోలి, చక్రంపేట, వీరబల్లి, బద్వేలు పరిధిలోని చింతలచెరువు, గొంగళివీడు, రూపరాంపేట..ఎర్రగుంట్ల దగ్గర్లోని సున్నపురాళ్లపల్లి ఇలా ప్రతీ ఊరిలోనూ జగన్ కోసం సంబరాల పండుగ చేసుకున్నారు.
పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్నదానాలు చేశారు. ఆటోలు నడిపి బతికే కార్మికులు కడపలో అప్సర సర్కిల్‌లో అన్నదానం చేశారు. చదువుకునే విద్యార్థులు, చేతిపనులు చేసుకుని జీవించే యువకులు అల్మాస్‌పేటలో అన్నదానం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా అన్నదానాలు నిర్వహించారు. మంగళవారం సమైక్యబంద్. అయినప్పటికీ పల్లెల్లో, పట్టణాల్లోని వీధుల్లోని సాధారణ ప్రజలు ఎవ్వరికివారు కేక్‌లు, మిఠాయిలు, పండ్లు పంచారు. రాజకీయాలతో సంబంధం లేనివారు, ఇంట్లోనుంచి ఎప్పుడూ బయటకు రానివారు కూడా సంబరాలు చేసుకోవడంతో ఇరుగుపొరుగు ఆశ్చర్యపోయారు. వారు అందులో భాగస్వాములయ్యారు.
చాలా గ్రామాల్లో ఇంట్లో పాయసం, మాంసం చేసుకుని సంక్రాంతి, ఉగాదిని తలపించేలా వేడుక చేసుకున్నారు. రంగులు చల్లుకున్నారు. అనుకున్నది నెరవేరి ఇంటికి మంచి జరిగిందనేలా వందలాది మంది దేవుళ్లకు 101 టెంకాయలు, 1001 టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. కులమతాలతో సంబంధం లేకుండా ర్యాలీగా అందరూ రంగుళ్లో మునిగిపోయారు. జగన్నామస్మరణంతో తడిసిముద్దయ్యారు. మొత్తం మీద మంగళవారం జిల్లా వ్యాప్తంగా జరిగిన సంబరాలు ఓ అద్భుతఘట్టమని చెప్పొచ్చు. ఓ మనిషిని నమ్మితే ప్రజలు ఎంత ప్రేమాభిమానాలు పెంచుకుంటారో మంగళవారం జరిగిన సంబరాలే నిదర్శనం.
దిక్కుతోచని టీడీపీ, కాంగ్రెస్:
జిల్లా ప్రజల సంబరాలు టీడీపీ, కాంగ్రెస్ శ్రేణులకు కనువిప్పు కల్గించాయి. తామెంత దుష్ర్పచారాలు చేసినా ప్రజలు మాత్రం ప్రతీ అంశాన్ని నిశితంగా గమనిస్తున్నారని, ప్రతీ నాయకుడిని మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారనే నిర్ణయానికి వచ్చాయి. జగన్ కేసులో కోర్టు తీర్పు రాకముందే ప్రజలు ఇంతటి ప్రేమాభిమానాలు చూపుతుండటం వారికి చెంపపెట్టు అయింది. ప్రస్తుతం పోటెత్తిన జగనాభిమానం ముందు తాము నిలవలేమనే ధోరణిలో ఇప్పటికే వారి అనుచరుల ముందు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు.
క్షణ క్షణం...ఆనంద వీక్షణం
అందరికీ తెలిసిన నాయకుడు...అందరూ చూసిన నాయకుడు...అయినా ఆయన్ను చూసేందుకు జిల్లా ప్రజానీకం సోమవారం మధ్యాహ్నం నుంచి మంగళవారం రాత్రి వరకూ వేయి కళ్లతో ఎదురు చూశారు.
జైలు నుంచి ఎప్పుడు బయటకు వస్తాడా? ఎప్పుడు ఆయన్ను చూస్తామా? అని టీవీలకు అతుక్కుపోయారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జగన్ జైలు నుంచి బయటకు వస్తాడని సోమవారమే జగన్ తరఫు న్యాయవాదులు ప్రకటించారు. దీంతో మంగళవారం ఉదయం 10 గంటల నుంచే జనాలు టీవీల ఎదట వాలిపోయారు. న్యూస్ ఛానల్స్ మినహా ఏ వినోదాత్మక చిత్రాల వైపు దృష్టి మరలలేదు.
ఉదయం 10 గంటలకు జగన్ తరఫు న్యాయవాదులు కోర్టుకు చేరుకున్నారనే వార్త తెలియగానే...‘జగన్ ఎన్ని గంటలకు రావొచ్చు? 2 గంటలకు కచ్చితంగా వస్తాడా? ఏమైనా ఆలస్యం అవుతుందా? అని కొందరు...ముందే వస్తాడా? అని ఇంకొందరు చర్చలు సాగించారు. అయితే బెయిల్ ప్రక్రియ కాస్త ఆలస్యమైంది. మధ్యాహ్నం 2.10 గంటలకు బెయిల్ పత్రాలు పూర్తయ్యాయి. దీంతో 2 గంటలకు మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు అంతా ‘ఏంటీ 2 గంటలకు వస్తాడన్నారు. ఇంకా రాలేదే అంటూ ఉత్కంఠగా ఎదురుచూశారు. జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర, ప్రజల కోసం చేసిన దీక్షల దృశ్యాలు, మహానేత వైఎస్ బతికి ఉన్నప్పటి దృశ్యాలను కొన్ని ఛానళ్లు ప్రసారం చేశాయి. వాటిని చూస్తూ ‘16 నెలలు జైళ్లో జగన్ ఎలా గడిపాడో...ఇంట్లో ఆయన భార్య, పిల్లలు ఎంత వేదనపడ్డారో’ అని గుర్తుకు చేసుకుంటూ వేదనపడ్డారు. ఇలా 3.45 గంటల వరకూ గడిపారు. బెయిల్ ప్రక్రియ ముగియడంతో అన్ని న్యూస్ ఛానళ్లలో ‘జైలు నుంచి జగన్ విడుదల’ అని బ్రేకింగ్‌లు వచ్చాయి. దీంతో అందరి కళ్లు టీవీల వైపు ఉండిపోయాయి. చంచల్‌గూడ వద్ద వేలాది జనాలు ఉన్న దృశ్యాలు చూస్తూ ఉద్విగ్నంగా గడిపారు. ఎట్టకేలకు 3.56 గంటలకు జైలు నుంచి జగన్ బయటకు వచ్చారు. ‘చెరగనిచిరునవ్వుతో రెండు చేతులూ జోడించి అభిమానులకు నమస్కరిస్తూ జైలు గేటు దాటుతూ జగన్ వాహనం బయటకు రాగానే ఒక్కసారిగా అందరూ కేరింతలు కొట్టారు. ఈలలు, కేకలు వేస్తూ సంబరాలు చేసుకున్నారు. సాయంత్రం నుంచి జగన్ ఇంటికి వెళ్లే వరకూ చాలామంది టీవీలు చూస్తూనే ఉండిపోయారు.
- సాక్షి, కడప
రాజువచ్చినాడో...
Published Wed, Sep 25 2013 3:05 AM | Last Updated on Tue, Oct 30 2018 7:27 PM
Advertisement