విభజన సెగ | YSRCP 72-hour bandh call special response | Sakshi
Sakshi News home page

విభజన సెగ

Published Sat, Oct 5 2013 2:02 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM

YSRCP 72-hour bandh call special response

సాక్షి,విశాఖపట్నం: తెలంగాణ నోట్‌ను ఆమోదిస్తూ కేంద్రమంత్రివర్గం నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ 72గంటల బంద్‌కు పిలుపుతో పార్టీశ్రేణులు గ్రామగ్రామాన ఉద్యమించాయి. జిల్లాలో శుక్రవారం బంద్ విజయవంతమైంది. ఆందోళనలు ఆకాశాన్నంటాయి. రాస్తారోకోలతో దిక్కులుపిక్కటిల్లాయి. అంతటా ఆగ్రహజ్వాలలు ఎగసిపడ్డాయి. జిల్లాలో పల్లెలన్నీ కదిలాయి. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా కదం తొక్కాయి. రెండునెలలకుపైగా దీక్షలు,ఆందోళనలు చేస్తోన్న ఉద్యోగ,ఉపాధ్యాయ,విద్యార్థి జేఏసీలు కూడా ఉద్యమాన్ని ఉధృతం చేశాయి.

సమైక్య ఛాంపియన్‌గా నిలిచిన వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలోనూ ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు జరిగాయి. ప్రజలు,దుకాణదారులు,హోటళ్లు,సినిమాహాళ్ల యాజమాన్యాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రతి నియోజకవర్గంలోనూ ఉద్యమకారులు,వైఎస్సార్‌సీపీ నేతలు విభజనకు వ్యతిరేకంగా ఆందోళనలతో  ఎక్కడికక్క నిరసనలు మిన్నంటాయి. నర్సీపట్నం,పాడేరులలోని మంత్రి బాలరాజు ఇళ్లను ఆర్టీసీ,ఉద్యోగ సంఘాల జేఏసీలు ముట్టడించాయి.

ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి. నర్సీపట్నంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ చేపట్టి అబీద్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. గొలుగొండలో రహదారులను దిగ్బంధించారు. ఎస్‌బీఐ కార్యాలయానికి బయట తాళాలు వేసి లోపల విధులు నిర్వహిస్తుండడంతో కిటికీ అద్దాలు పగులగొట్టి ఆందోళనకారులు మూయించివేశారు. ఎమ్మెల్యే ఫ్లెక్సీలను ధ్వంసం చేసినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాకవరపాలెంలో రోడ్డుకు అడ్డంగా తాళ్లు కట్టి ద్విచక్రవాహనాలు కూడా వెళ్లకుండా అడ్డుకున్నారు.

ఏజెన్సీలో బంద్ విజయవంతమైంది. పాడేరు డివిజన్‌లోని అన్ని మండలాల్లోనూ సమైక్యవాదులు వాహనాలను అడ్డుకున్నారు. మండల కేంద్రాల్లోని దుకాణాలు,వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు.  వైఎస్సార్ సీపీ అరకు నియోజకవర్గ సమన్వయకర్తలు డాక్టర్ కుంబా రవిబాబు, కిడారి సర్వేశ్వరరావు, దొన్నుదొర, పాడేరు నియోజకవర్గ సమన్వయకర్తలు వంజంగి కాంతమ్మ, సీకరి సత్యవాణి, గిడ్డి ఈశ్వరిలతో పాటు నాయకులు, కార్యకర్తలు పాడేరు, అరకులోయల్లో ర్యాలీలు నిర్వహించారు.

యలమంచిలిలోనూ సంపూర్ణబంద్ జరిగింది. ఇక్కడికి సమీపంలోని కొక్కిరాపల్లిలో ఉద్యమకారులు రైల్‌రోకో చేపట్టారు. సమైక్యవాదులు ఎమ్మెల్యే కన్నబాబు కారును అడ్డుకున్నారు. చోడవరంలో నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త బలిరెడ్డి సత్యారావు ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. ఆయనతోపాటు పార్టీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకట్రావు దీక్ష శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు. మాడుగుల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలు పూడి మంగపతిరావు,బూడి ముత్యాల నాయుడు రిలే దీక్షలుప్రారంభించారు.

అనకాపల్లిలో కొణతాల సమైక్యాంధ్ర పరిరక్షణ దీక్షలు,జేఏసీ దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. వాణిజ్యకేంద్రమైన పట్టణంలో బంద్‌తో అంతా బోసిపోయింది.  ఉద్యమకారులు జాతీయ రహదారిని ఎక్కడికక్కడ దిగ్బంధించారు. అరకులో ఏపీ ఎన్జీవోల రైల్‌రోకో ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. సినిమాహాళ్లు,బ్యాంకులు మూతపడ్డాయి. అరకులోయ, అనంతగిరి ప్రాంతాల్లో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

పాయకరావుపేటలో వైఎస్సార్‌సీపీ,జేఏసీలు జాతీయరహదారిని దిగ్బంధించాయి. సమై క్యవాదులు గంగిరెద్దుకు సోనియా బొమ్మకట్టి ఊరేగించారు. నక్కపల్లిలో డీసీసీబీ మాజీ డెరైక్టర్ వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. చెంగల వెంకట్రావు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు సూర్యమహల్ సెంటర్ నుంచి జాతీయ రహదారి వరకూ  భారీ ర్యాలీ నిర్వహించారు.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement