
కొత్త ప్రశ్నలు..!
జెడ్పీ సమావేశంలో వెలుగుచూసిన ఆసక్తికర విషయాలు
తప్పు చేసిన ఉద్యోగిపై చర్యలు తీసుకోవద్దన్న మంత్రి ఎవరు..?
పూసపాటిరేగ మండలంలో సీజ్ చేసిన ఇసుక ఏమైంది..?
అపరాధ రుసుం జమ అయ్యిందెవరికి..?
జెడ్పీ సమావేశం తర్వాత మెదులుతున్న ప్రశ్నలు
విజయనగరం, విజయనగరం ఫోర్‌ట: జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన జె డ్పీ సమావేశం సమాధానాల కంటే ప్రశ్నలనే ఎక్కువగా చూపించింది. అక్రమాలకు పాల్పడిన చినమేరంగి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం అకౌంటెంట్‌పై చర్యలు తీసుకోకుండా మంత్రి అడ్డు తగిలార న్న విషయమొకటి బయటికి రాగా, సీజ్ చేసిన ఇసుక అపరాధ రుసుం ఏమైందనే విషయమొకటి వెలుగు చూసింది. కురుపాం నియోజకవర్గంలోని చినమేరంగి కేజీబీవీ పాఠశాలలో పురుగులు పట్టిన అన్నం పెడుతున్నారని, ఒక పండును ఇద్దరు విద్యార్థులకు పంచి పెడుతున్నారని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి జెడ్పీ సర్వ సభ్య సమావేశంలో ప్రస్తావించారు. దీనికంతటికీ అక్కడ అకౌంటెంట్ కారణమ ని, ఈ విషయం విచారణలో కూడా తేలిందని ఆమె వివరించారు. దీనిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని సర్వశిక్ష అభియాన్ పీఓ శారదను ఆమె ప్రశ్నించారు. ఎమ్మెల్యే వాదనకు టీడీపీ నాయకులు కూడా జత కలవడంతో పీఓపై ఒత్తిడి పెరిగింది. కానీ పీఓ అసలు విషయం చెప్పేందుకు వెనుకంజ వేసారు. ఇదే విషయమై సుదీర్ఘ చర్చ జరగడంతో కలెక్టర్ కలుగజేసుకుని అకౌంటెంట్‌ది తప్పు ఉందని తేలిందా అని ప్రశ్నిం చారు.
అవునని అనేసరికి ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. తప్పని పరిస్థితి అనుకున్నారో ఏమో గాని చివరిగా మంత్రి ఆపమని చెప్పడంతో చ ర్యలు తీసుకోలేదని సమాధానమిచ్చారు. దీంతో టీడీపీ ప్రజాప్రతినిధులు అవాక్కయ్యారు. ఆ విషయమై దాటవేసేందుకు మరో శాఖ సమీక్షకు పిలిచే ప్రయత్నం చేశారు. అయితే, ఆ మంత్రి ఎవరనేది చెప్పకపోయినా జిల్లా మంత్రే అయి ఉండవచ్చని దాదాపు సభ్యులంతా గుసగుసలాడుకున్నారు. మరి, జిల్లా మం త్రి ఎందుకలా చెప్పారు? దానివెనుకున్న వ్యక్తులెవరనేది తేలాల్సి ఉంది.ఇక పూసపాటిరేగ మండలం కూనురుపాలెంలో పది రోజుల క్రితం ఇసుక అక్రమ రవాణా చేస్తుండగా టాస్క్‌పోర్స్ అధికారులు పట్టుకున్నారు. అప్పట్లో అపరాధ రుసుం కూడా విధించారు. కానీ ఆ మొత్తం నేటి వరకు ప్రభుత్వానికి జమకాలేదని పూసపాటిరేగ జెడ్పీటీసీ ఆకిరి ప్రసాదరావు, ఎంపీపీ మహం తి చిన్నంనాయుడు ప్రస్తావించారు. ఆ డబ్బులేమయ్యాయి? సీజ్ చేసిన ఎక్కడుందో చెప్పాలంటూ అధికారులను అడిగారు. ఈ విషయమై డీఆర్‌డీఏ పీడీ పెద్దిరాజు, ఏపీడీ సుధాకర్ వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించగా సూటిగా చెప్పాలంటూ నాయకులు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి అధికారులు ఆ సమయంలో కచ్చితమైన వివరణ ఇవ్వలేకపోయారు. సమావేశం జరుగుతుండగానే పూసపాటిరేగ తహశీల్దా ర్ జయదేవికి ఫోన్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేశారు. జెడ్పీలో ప్రస్తావనకొచ్చిందని తెలుసో మరేంటో తెలియదు గాని ఆ సమయానికి తహశీల్దార్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దీంతో డీఆర్‌డీఏ అధికారులు యుద్ధ ప్రాతిపదికన వాస్తవమేంటో తెలుసుకోలేకపోయారు.
సమావేశం ముగిసిన తర్వాత ఆ తహశీల్దార్ స్థానిక ఏపీఎంకు ఇంకో నంబర్ ద్వారా ఫోన్ చేసి ఆ మొత్తాన్ని ఇప్పుడే కట్టేస్తానని చెప్పుకొచ్చినట్టు తెలిసింది. అయితే ఈ వి షయాన్ని ఇంత గట్టిగా సదరు ప్రజాప్రతినిధులు ప్ర శ్నించడం వెనుక మరో కారణం ఉందని తెలుస్తోంది. ఇటీవల ఓ ప్రజాప్రతినిధి అక్కడ అధికారులను ఉచి తంగా ఇసుక ఇప్పించడని కోరగా, అలా చేయలేమని చెప్పడంతో ఇదే అవకాశంగా తీసుకుని జెడ్పీలో చర్చకు తెచ్చారన్న వాదన వినిపిస్తోంది. కారణమేదైనా తప్పు అనేది మాత్రం జరిగింది. అసలు అపరాధ రుసుం వసూలు చేసి, ఎవరు పసిగట్టలేరని తినేశారా? లేదంటే ఎప్పుడైనా కట్టుకోవచ్చని వదిలేశారా? సీజ్ చేసి ఇసుక ఏమైంది? దాన్ని కూడా అమ్ముకుని సొమ్ము చేసుకున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇందులో వాస్తవమేంటో జిల్లా అధికారులు విచారణ జరిపి తేల్చాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఈ తరహా అక్రమాలు కూడా జరుగుతున్నాయన్నది ఈ సమావేశం ద్వారా నేతలందరికీ తెలియవచ్చింది.
డిప్యుటేషన్లు ఎందుకు..?: సుజయ్
బొబ్బిలి ఎమ్మెల్యే వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుజయ్‌కృష్ణ రంగారావు మాట్లాడుతూ జిల్లా పరిషత్‌లో కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు నిర్వహించి, ఇప్పుడు ప్రత్యేకంగా జిల్లా పరిషత్‌లో డిప్యుటేషన్ ఎందుకు వేస్తున్నారని సీఈఓ రాజకుమారిని ప్రశ్నించారు. దీని వల్ల జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. హుద్‌హుద్ తుపాను వల్ల తాగునీటి పథకాలు చాలా వరకు పాడయ్యాయని, ప్రజలు ఇబ్బంది పడకుండా చాలా మంది సర్పంచ్‌లు జనరేటర్‌లు పెట్టి వీటిని అందించారని, ఇటీవల తాగునీటి పథకాల మరమ్మతుకు నిధులు మంజూరు అయ్యాయని, అదే తుది జాబితానా? ఇంకా మంజూరు చేసే అవకాశం ఉందా అని ప్రశ్నించారు. తాగునీటి పథకాలను వీలైనంత త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్.ఈ గాయత్రిదేవికి తెలిపారు. బొబ్బిలి నియోజకవర్గం పరిధిలో చాలా అంగన్‌వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఖాళీగా ఉన్న కేంద్రాలకు ఇన్‌చార్జిలతో నడపడం వల్ల సేవలు సక్రమంగా అందడం లేదని, ఖాళీలను తక్షణమే భర్తీ చేసేలా చూడాలని ఐసీడీఎస్ పీడీ రాబర్‌ట్సను కోరారు. అర్హులైన వారికి పింఛన్లు తొలగిస్తే ఎవరు బాధ్యులో తేల్చాలని కలెక్టర్ ఎం.ఎం నాయక్‌ను కోరారు.
.
అధ్వానంగా కేజీబీవీలు: పుష్ప శ్రీవాణి
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి మాట్లాడుతూ కురుపాం నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో తాగునీటి పథకాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తాగునీటి పథకాలు ఏర్పాటు చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్.ఈ గాయత్రీ దేవిని కోరారు. గత సర్వసభ్య సమావేశంలో చెప్పిన సమస్యను ఇంతవరకు ఎందుక పరిష్కరించలేదని ప్రశ్నించారు. కురుపాం నియోజకవర్గంలోని చినమేరంగి, రావివలస గ్రామాల్లో ఉన్న కేజీబీవీ పాఠశాలల్లో పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని, పురుగులు పట్టిన అన్నం పెడుతున్నారని, ఒక పండును ఇద్దరు విద్యార్థులకు ఇస్తున్నారని సర్వశిక్ష అభియాన్ పీఓ శారదపై మండి పడ్డారు. చినమేరంగిలో అవినీతికి అక్కడ అకౌంటెంట్ కారణమని మీ విచారణలోను, కమిటీ విచారణలోను తేలిందని, మరి ఎందుకు ఆమెను తొలిగించలేదని ప్రశ్నించారు. ఎప్పుడు తొలిగిస్తారో చెప్పాలని పట్టుబట్టారు. ఇది అటుఇటు తిరిగి మంత్రి కోర్టుకు వెళ్లి ఆగింది. దీంతో కలెక్టర్ మాట్లాడుతూ తప్పకుండా చర్యలు తీసుకుంటామని శ్రీవాణికి హామీ ఇచ్చారు. జియ్యమ్మవలసలో ఎంపీపీ భర్త అధికార సమావేశాల్లో వేదికపై కూర్చుంటున్నారని, ప్రశ్నిస్తే జిల్లా పరిషత్ సీఈఓ తనకు ఆదేశాలు ఇచ్చారని చెబుతున్నారని, అంతేకాకుండా అర్హులకు పింఛన్లు తీసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే ‘సాక్షి’
జెడ్పీలో చర్చకు వచ్చిన ‘సాక్షి’ కథనాలు ఆద్యంతం సమావేశంలో కన్పించిన సాక్షి సంచికలు
విజయనగరం: ‘సాక్షి’ కథనాలు జెడ్పీ సర్వసభ్య సమావేశంలో చర్చలకొచ్చాయి. చాలా మట్టుకు వాటిపైనే ప్రధానంగా చర్చ జరగడం కనిపించింది. శాఖా పరమైన సమీక్షలో ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తల కి్లిప్పింగ్‌లను చూపిస్తూ అధికారులను పలువురు ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆసక్తికర చర్చ జరిగింది. డీసీసీబీపై వచ్చిన వివిధ కథనాలను ఆధారంగా చేసుకుని సీబీసీఐడీ విచారణకు తీర్మానం చేయాలని, కందిపప్పు టెండర్లలో అక్రమాల జరిగాయన్న కథనం ఆధారంగా సీఐడీ విచారణ జరపాలని గజపతినగరం ఎమ్మెల్యే కేఏ నాయుడు డిమాండ్ చేశారు. వ్యవసాయ అధికారుల నిర్వాకంతో మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మీ పేరుతో హుద్‌హద్ తుపాను సాయం మంజూరు చేశారన్న కథనాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాఖ జేడీపై మండిపడ్డారు. అలాగే, ‘సాక్షి’లో వచ్చిన కథనం నేపథ్యంలో కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు నిర్వహించి, ఇప్పుడు ప్రత్యేకంగా జిల్లా పరిషత్‌లో డిప్యుటేషన్ ఎందుకు వేస్తున్నారని సీఈఓ రాజకుమారిని బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు ప్రశ్నించారు. ఇలా ఆద్యంతం ఏదొక సందర్భంలో ‘సాక్షి’లో వచ్చిన పలు కథనాల ఆధారంగా చేసుకుని పలువురు సభ్యులు అధికారులను నిలదీశారు. పలు విషయాల్లో ప్రశ్నించారు. చాలా సార్లు ‘సాక్షి’ పత్రికే అటు సమావేశం వేదికపైనా, ప్రాంగణంలోనూ కన్పిస్తూ వచ్చింది.
‘పేదలకు ప్యాక్.. మంత్రి గిఫ్ట్!’ శీర్షికన సాక్షి మెయిన్14వ పేజీలో వచ్చిన కథనాన్ని ఎమ్మెల్యే అప్పలనాయుడు సభలో ఉన్న వారందరికీ చూపిం చారు. అటు గిఫ్ట్ ప్యాక్‌లో కందిపప్పు టెండర్లుపైనా, ఇటు ఐసీడీఎస్ సరుకుల పంపిణీపైనా సీఐడీ విచారణ జరిపించాలని కోరుతూ జెడ్పీ సమావేశంలో తీర్మానం చేయాలని కోరారు. అంతేకాకుండా ఆక్రమాలు రుజు వైతే ఆర్ ఆర్ యాక్ట్ ద్వారా డబ్బులు రికవరీ చేయాలని కూడా డిమాండ్ చేసారు. దీనికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు మద్దతు పలికారు. అలాగే మాజీ ఎంపీ బొత్ప ఝాన్సీలక్ష్మికి వ్యవసాయశాఖ ఉద్యోగలు పంట నష్ట పరిహారం జమ చేశారంటే ఎంత నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారో తెలుస్తుందంటూ సాక్షిలో వచ్చిన కథనాన్ని కూడా ప్ర స్తావించారు. ప్రభుత్వం ఉన్నది పేద రైతుల కోసమని, అంతేగాని ధనవంతుల కోసం కాదని అధికారుల తీరును దుయ్యబట్టారు.
అన్నింటిలోనూ పక్షపాతం: రాజన్నదొర
అనంతరం సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర మాట్లాడుతూ తాగునీటి పథకాలు ఎప్పటి లోగా పూర్తవుతాయో స్పష్టంగా చెప్పడం లేదని ఆరోపించారు. మెంటాడ, పాచిపెంట మండలాల్లో విద్యుత్ బిల్లులు చెల్లించలేదని తాగునీటి పథకాల ద్వారా నీటి సరఫరా నిలిపివేశారని తెలిపారు. 13 ఆర్థిక సంఘం నిధులను విద్యుత్ బిల్లులకు మల్లించాలని చూస్తున్నారని, ఇలా చేయడం దేశం లో ఎక్కడా లేదని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ గాయత్రిదేవిని నిలదీశారు. కొత్తగా నియమించిన అంగన్‌వాడీ కార్యకర్తల్లో కొంతమంది రెసిడెన్సీ సరిఫికేట్‌లు ఇవ్వకపోయినా కొనసాగిస్తున్నారని, మరి కొంతమందిని కొనసాగించడం లేదని ఎందుకలా పక్షపాతం చూపిస్తున్నారని ఐసీడీఎస్ పీడీ రా బర్ట్స్‌ను ప్రశ్నించారు.
గర్భిణుల్లో నూటికి 90 శాతం మందికి సిజేరియన్ అవుతున్నాయని, ఐసీడీఎస్ ద్వారా పౌష్టికాహారం అందితే ఎందుకలా జరుగుతుందని రాబర్ట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనర్హత పేరు చెప్పి జన్మభూమి కమిటీ వారు మక్కువలో ముందు ఇద్దరిని అనర్హులుగా తొలిగించి పింఛనులు తీసేశారని, తర్వాత మళ్లీ అందులో ఒకరికి ఫించను ఇస్తున్నారని ఎందుకలా జరిగిందో చెప్పాలని డీఆర్‌డీఏ పీడీ పెద్దిరాజును ప్రశ్నించారు. వికలాంగులకు అర్హత ఉన్న ఫించను తీసేశారని ఆరోపించారు. కమిటీల నియయానికి సంబంధించి పత్రాలు అడిగితే అది ఏదో దేశభద్రతకు సంబంధించిన విషయంలా అధికారులు ఇవ్వడానికి ముప్పుతిప్పలు పెట్టారని అసహనం వ్యక్తం చేశారు.
పింఛన్ల పరిస్థితి ఏంటి..?: మీసాల గీత
ఎమ్మెల్యే మీసాలగీత మాట్లాడుతూ జిల్లాలో చాలా మంది పింఛన్లు తీసేశారని, ఫించనులు ఇప్పించాలని లబ్ధిదారులు చెబితే గాని తెలియని స్థితిలో ఉన్నామని పింఛన్లు ఎంతమందికి ఇచ్చారో, ఎంత మందికి ఇవ్వాలో, ఎవరి పేర్లు ఆన్‌లైన్‌లో ఉన్నాయో చెప్పాల్సిన బాధ్యత లేదా అని డీఆర్‌డీఏ పీడీ పెద్దిరాజుపై మండిపడ్డారు. పూసపాటిరేగ జెడ్పీటీసీ ప్రసాదరావు, ఎంపీపీ మహంతి చిన్నంనాయుడులు మాట్లాడుతూ పూసపాటిరేగలో ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేశారని, దీనికి సంబంధించిన డబ్బులు ప్రభుత్వ ఖాతాలో జమ చేశారా అని డీఆర్‌డీఏ పీడీ పెద్దిరాజును ప్రశ్నించారు. అడిగి చెబుతామని పీడీ సమాధానం చెప్పగా, సంఘటన జరిగి 10 రోజులు అయిందని ఇంకా కనుగొనడం ఏంటని మండి పడ్డారు. ఇలా ఉదాసీనంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదన్నారు. బొండపల్లి జెడ్పీటీసీ బాలాజీ మాట్లాడుతూ గొట్లాం తాగునీటి ప్రాజెక్టు నిర్వీర్యం అవుతోందని, ఇప్పటికీ పూర్తిస్థాయిలో ప్రాజెక్టు పరిధిలో నీరు అందడం లేదని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్.ఈ పెద్దిరాజుపై మండి పడ్డారు.
జామి జెడ్పీటీసీ పెదబాబు మాట్లాడుతూ జిల్లా పరిషత్ స్కూళ్లలో వంట షెడ్‌లు ఉన్నచోటే మంజూరు చేస్తున్నారని, లేని చోట మంజూరు చేయలేదని డీఈఓ కృష్ణారావుపై మండి పడ్డారు. కొమరాడ ఎంపీపీ సుప్రియ మాట్లాడుతూ కొమరాడ మండలంలో ఉపాధ్యాయులు టైమ్‌కి రావడం లేదని, పరిశీలన కొరవడడమే దీనికి కారణమని తెలిపారు. సమావేశంలో కేంద్ర మంత్రి ఆశోక్‌గజపతిరాజు, జిల్లా పరిషత్ చైర్మన్ శోభస్వాతిరాణి, ఎమ్మెల్యేలు పతివాడ నారాయణస్వామినాయుడు, పార్వతీపురం ఎమ్మెల్యేబి చిరంజీవులు, ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. కాగా అంతకుముందు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు గిరిజన యూనివర్సిటీ, ప్రభుత్వ వైద్య కళాశాలను జిల్లాలోనే ఏర్పాటు చేయాలని కోరుతూ, ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ జెడ్పీ కార్యాలయం ప్రాంగణం బయట నుంచి సమావేశం హాల్ వరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీగా వచ్చి నిరసన తెలియజేశారు.