30% మార్కెట్ వాటాపై కెనాన్ దృష్టి | Canon India targeting 30 per cent market share in 2014 | Sakshi
Sakshi News home page

30% మార్కెట్ వాటాపై కెనాన్ దృష్టి

Published Thu, Apr 24 2014 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 6:25 AM

30% మార్కెట్ వాటాపై కెనాన్ దృష్టి

30% మార్కెట్ వాటాపై కెనాన్ దృష్టి

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్రింటర్ల వ్యాపారంలో ఈ ఏడాది 30 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కెనాన్ ప్రకటించింది. ఈ ఏడాది దేశంలో రెండు లక్షల ప్రింటర్లు అమ్ముడవుతాయని అంచనా వేస్తుండగా అందులో కనీసం 60,000 యూనిట్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కెనాన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అలోక్ భరద్వాజ్ తెలిపారు. గతేడాది కెనాన్ మార్కెట్ వాటా 24 శాతంగా ఉంది.

 ఇంక్‌జెట్ ప్రింటర్ల వ్యాపారంపై ప్రధానంగా దృష్టిసారించిన కెనాన్ కొత్తగా మార్కెట్లోకి తొమ్మిది ప్రింటర్లను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అలోక్ మాట్లాడుతూ ఈ ఏడాది ప్రింటర్ల ద్వారా రూ.200 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రింటర్ల వ్యాపారంలో భారీగా వృద్ధి నమోదవుతుండటంతో కొత్త ప్రింటర్లను ఇక్కడ నుంచి విడుదల చేస్తున్నట్లు వివరించారు. ముఖ్యంగా హైదరాబాద్ జాతీయ విద్యా కేంద్రంగా ఎదగడంతో ప్రింటర్ల మార్కెట్‌కు డిమాండ్ బాగా పెరిగిందన్నారు. కెనాన్ మొత్తం వ్యాపారంలో 10 శాతం ఆదాయం ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తోందన్నారు.

 రూపాయి కంటే తక్కువ
 తాము అత్యాధునిక పరిజ్ఞానంతో ప్రవేశపెట్టిన ఈ ప్రింటర్ల ద్వారా రూపాయి కంటే తక్కువ రేటుకే ప్రింట్ తీసుకునే విధంగా ఈ కొత్త ప్రింటర్లను రూపొందించినట్లు తెలిపారు. గతంలో మోనో ప్రింటింగ్‌కి రూ.3.30 ఖర్చు అయితే ఈ ఇంక్‌జెట్ టెక్నాలజీ వల్ల ఆ వ్యయం 99పైసలకు తగ్గిందన్నారు. అదే కలర్ ప్రింటింగ్ రూ.5.32 నుంచి రూ.2.5కి తగ్గనున్నట్లు తెలిపారు. కొత్తగా విడుదలైన తొమ్మిదింటిలో ఆరు ప్రింటర్లు వైఫై క్లౌడ్ ఆధారంగా పనిచేస్తాయన్నారు. కొత్తగా వీటి రాకతో మొత్తం కెనాన్ పోర్ట్‌ఫోలియోలో ప్రింటర్ల సంఖ్య 24కి చేరింది. ఈ ఏడాది ప్రచారానికి రూ.120 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు అలోక్ తెలిపారు. అలాగే వచ్చే ఏడాదిలోగా సెక్యూరిటీ నెట్‌వర్క్ సర్వైవలెన్స్ కెమెరా మార్కెట్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement