పన్నులను ఆమోదించే సమాజంగా మారుస్తుంది
• డీమోనిటైజేషన్ నిర్ణయాన్ని సమర్థించుకున్న కేంద్రం
• ఇబ్బందులు తాత్కాలికమేనని ప్రకటన
• పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీతో ఆర్థిక రంగం బలోపేతం అవుతుందన్న జైట్లీ
గాంధీనగర్: డీమోనిటైజేషన్‌తో ఏర్పడిన ఇబ్బం దులు తాత్కాలికమేనని, దీని వల్ల ఆర్థిక రంగం బలోపేతం అవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. డీమోనిటైజేషన్‌తోపాటు జీఎస్టీని అమల్లోకి తీసుకురావడం వంటి చర్యలు పన్ను నిబంధనలను పాటించని సమాజాన్ని మరింతగా ఆమోదించే సమాజంగా మారుస్తాయన్నారు. వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో బుధవారం పాల్గొన్న సందర్భంగా అరుణ్ జైట్లీ మాట్లాడుతూ... పెద్ద నోట్లను రద్దు చేయడం సమాంతర ఆర్థిక వ్యవస్థను అంతం చేసే దిశగా తీసుకున్న చర్యగా పేర్కొన్నారు. పన్ను ఎగవేతలను నివారించేందుకు మారిషస్, సైప్రస్, సింగపూర్ దేశాలతో ఇప్పటికే పన్ను ఒప్పందాలను సమీక్షించామని ఆయన చెప్పారు. ‘‘అభివృద్ధి చెందుతున్న దేశం స్థాయి నుంచి అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందాలని ఈ దేశం ఆశిస్తోంది.
వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంపై మనదైన ముద్ర వేస్తున్న తరుణంలోనూ మనం, పన్ను నిబంధనలను పాటించని సమాజంగానే ఉన్నాం’’ అని జైట్లీ తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రభావవంతమైనవని, ఇవి దేశం, దేశవాసుల భవిష్యత్తు తీరును నిర్ణయించేవిగా చెప్పారు. దీర్ఘకాలంలో ప్రయోజనాలను తీసుకొచ్చే చరిత్రాత్మక నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఉండడం సహజమేనన్నారు. వ్యవస్థలో అధిక నగదు అవినీతికి కారణమవుతుందన్నారు. ఈ నగదంతా బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చి చేరడంతోపాటు డిజిటల్ ఆర్థిక రంగానికి మళ్లడం అనేవి, షాడో ఆర్థిక వ్యవస్థ నుంచి క్రమబద్ధమైన ఆర్థిక వ్యవస్థగా మారేందుకు వేసిన కీలక అడుగుగా జైట్లీ వివరించారు.
జీఎస్‌టీపై...
ఇక జీఎస్టీని అమలు చేయడం వల్ల లావాదేవీలు పెరుగుతాయని, పన్ను వ్యవస్థలో అవి భాగం అవుతాయన్నారు. దాంతో భవిష్యత్తులో ప్రభుత్వానికి అధిక ఆదాయం వస్తుందన్నారు. అలాగే, ఆర్థిక వ్యవస్థ మరింత స్వచ్ఛంగా మారుతుందన్నారు. ఒక్కసారి ఈ పరిణామ ప్రభావం ముగిసి, చరిత్రాత్మకమైన జీఎస్టీ అమల్లోకి వస్తే మన దేశం అతిపెద్ద స్వచ్ఛమైన, అత్యుత్తమ పన్ను వ్యవస్థను కలిగి ఉన్న సమాజంగా అవతరిస్తుందన్నారు.