
ముంబై: సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంకులో ఇన్వెస్ట్ చేసేందుకు తమ ఈసీసీబీ నుంచి అనుమతి వచ్చినట్లు ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వెల్లడించింది. ఈ ప్రణాళిక ప్రకారం యస్ బ్యాంక్‌లో ఎస్‌బీఐ 725 కోట్ల షేర్లను కొనుగోలు చేయనుంది. షేరు ఒక్కింటికి రూ. 10 చొప్పున మొత్తం రూ. 7,250 కోట్లు చెల్లించనుంది. యస్ బ్యాంక్ పెయిడప్ క్యాపిటల్‌లో 49 శాతం లోపే ఎస్‌బీఐ వాటా ఉండనుంది. ‘నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి యస్ బ్యాంక్‌లో రూ. 7,250 కోట్లతో 725 కోట్ల షేర్లను కొనుగోలు చేసేందుకు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ సెంట్రల్ బోర్డు (ఈసీసీబీ) ఆమోదముద్ర వేసింది‘ అని స్టాక్ ఎక్సే్చంజీలకు ఎస్‌బీఐ తెలియజేసింది. ఆర్‌బీఐ రూపొందించిన యస్ బ్యాంక్ పునరుద్ధరణ ప్రణాళిక ముసాయిదా ప్రకారం వ్యూహాత్మక ఇన్వెస్టర్లు బ్యాంకులో 49 శాతం వాటాలు కొనుగోలు చేయాల్సింటుంది. ఆ తర్వాత మూడేళ్ల లోపు దీన్ని 26 శాతానికి లోపు తగ్గించుకోవడానికి ఉండదు. మొండిబాకీలు, గవర్నెన్స్ లోపాలు, నిధుల కొరతతో సతమతమవుతున్న యస్ బ్యాంకుపై ఏప్రిల్ 3 దాకా ఆర్‌బీఐ మారటోరియం విధించిన సంగతి తెలిసిందే.
మరింత మంది ఇన్వెస్టర్ల ఆసక్తి ..
యస్ బ్యాంకులో ఇన్వెస్ట్ చేసేందుకు దేశీ సంపన్నులు (హెచ్‌ఎన్‌ఐ), ప్రముఖ ఆర్థిక సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు విశ్లేషకులు తెలిపారు. షేరు ధర రూ. 26 స్థాయికి చేరి, వాస్తవ విలువ వెల్లడి కావడంతో ఇన్వెస్టర్లు ముందుకు వస్తున్నట్లు ఐఐఎఫ్‌ల్ సెక్యూరిటీస్ డైరెక్టర్ సంజీవ్ భాసిన్ తెలిపారు. స్థానిక ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్స్, ఏఎంసీలు, రాధాకిషన్ దమానీ (డీమార్ట్), రాకేష్ ఝున్‌ఝున్‌వాలా వంటి హెచ్‌ఎన్‌ఐలతో పాటు ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ వంటి ఆర్థిక సంస్థలు వీటిలో కూడా ఉన్నాయన్నారు. పెట్టుబడుల కోసం పలువురు ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నామంటూ యస్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ ప్రశాంత్ కుమార్ గతంలోనే వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఈ శనివారం వెల్లడి కానున్న యస్ బ్యాంక్ మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలపై అందరి దృష్టి ఉంది.
క్యూ3లో రూ. 1,000 కోట్ల నష్టాల అంచనా..
అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో బ్యాంకు సుమారు రూ. 1,000 కోట్ల నష్టాన్ని నమోదు చేయొచ్చని ఒక అనలిస్టు అంచనా వేశారు. మరోవైపు, అడాగ్ ఎన్‌బీఎఫ్‌సీతో పాటు కొన్ని రియల్ ఎస్టేట్ ఖాతాలు భారీ మొండిబాకీలుగా మారడం, నిరర్థక ఆస్థులకు మరింతగా ప్రొవిజనింగ్ చేయాల్సి రానుండటం వంటి అంశాలతో డిసెంబర్ త్రైమాసికంలో యస్ బ్యాంక్ సుమారు రూ. 778 కోట్ల మేర నష్టాలు ప్రకటించవచ్చని ఎమ్‌కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తెలిపింది. ఎస్‌బీఐ యా ంకర్ ఇన్వెస్టరుగా ఉండటం వల్ల తదుపరి మరింతగా పెట్టుబడులు సమీకరించేందుకు కూడా సుల టభం కావొచ్చని వివరించింది. అలాగే ఎస్‌బీఐకి వాటాలు ఉండటం సైతం డిపాజిటర్లకు కాస్త ఊరటనిస్తుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment