ఫ్లిప్‌కార్ట్ గిడ్డంగి అక్టోబర్ 30న ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ-కామర్స్ మార్కెట్ ప్లేస్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ గిడ్డంగిని అక్టోబర్ 30న ప్రారంభిస్తోంది. తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకులు బిన్నీ బన్సల్ హాజరవుతున్నారు. 2.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి వద్ద దీనిని ఏర్పాటు చేశారు. కంపెనీకి ఇది 16వ గిడ్డంగి కాగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇది మొదటిది.
గిడ్డంగి ద్వారా రోజుకు 1.2 లక్షల ఉత్పత్తులను సరఫరా చేసే వీలుంది. దక్షిణాది రాష్ట్రాల్లోని 70 శాతం మంది కస్టమర్లకు ఒకేరోజు ఈ గిడ్డంగి నుంచి ఉత్పత్తులను చేర్చే వీలవుతుందని కంపెనీ చెబుతోంది. 16 గిడ్డంగులకుగాను ఫ్లిప్‌కార్ట్ ఇప్పటి వరకు రూ.400 కోట్లు వెచ్చించింది. 2020 నాటికి మరో 50 నుంచి 100 గిడ్డంగులను ఏర్పాటు చేయాలన్నది ఆలోచన.
ఇందుకు రూ.3 వేల కోట్ల దాకా ఖర్చు చేసే అవకాశం ఉంది. కొత్త గిడ్డంగి ద్వారా ప్రత్యక్షంగా 2,000 మందికి, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి కలగనుంది. ఫ్లిప్‌కార్ట్ విక్రయాల్లో ఢిల్లీ, బెంగళూరు తర్వాతి స్థానాన్ని హైదరాబాద్ దక్కించుకుంది.