![Focus on egalitarianism - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/27/CHANDRASEKHARAN.jpg.webp?itok=_ZSpROG7)
న్యూఢిల్లీ: సులభత్వం, సమష్టితత్వం, పరిమాణం ఈ మూడింటిపై దృష్టి పెట్టాలని టాటా గ్రూపు ఉద్యోగులను టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ కోరారు. వచ్చే ఏడాది అంతర్జాతీయ ఆర్థిక రంగం 4 శాతం మేర వృద్ధి చెందుతుందన్న అంచనాల నేపథ్యంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ సూచన చేశారు. ఈ మేరకు గ్రూపు పరిధిలోని 6.45 లక్షల మంది ఉద్యోగులకు నూతన సంవత్సర సందేశం పంపారు. ‘‘అంతర్జాతీయంగా లోతైన పరివర్తనకు ఇది సమయం. ఎన్నో ఆసక్తికరమైన పరిణామాలతోపాటు అనిశ్చిత భావన నెలకొని ఉంది. నేను ఎంతో ఆశాభావంతో ఉన్నా. ప్రపంచ ఆర్థిక రంగం వార్షికంగా 2018లో 4 శాతం మేర వృద్ధి చెందనుంది. 2011 తర్వాత వేగవంతమైన నడక ఇది.
ఈ దిశలో ప్రపంచ విస్తరణ అంతా అభివృద్ధి చెందిన దేశాల వైపు ముఖ్యంగా భారత్ వైపు సాగిపోనుంది’’ అని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. టాటా గ్రూపు వ్యాపారాలకు భవిష్యత్తు అవకాశాల విషయంలో ఇంతకుముందటి కంటే తాను ఎంతో నమ్మకంతో ఉన్నట్టు చెప్పారు. భారత వృద్ధి ప్రయాణంలో టాటా గ్రూపు మూలస్తంభంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. గ్రూపు కంపెనీల మధ్య సహకారాన్ని ప్రోత్సహిస్తూ ‘టాటా ఒక్కటే’ అన్న ఆలోచనను ఆవిష్కరించారు. ‘‘టాటా ఒక్కటే అన్నది నా మనసులో ఉంది. ఈ విధమైన ఆలోచన ప్రతి అవకాశాన్ని అందుకునేందుకు గ్రూపును ఏకతాటిపైకి తీసుకొస్తుంది’’ అని పేర్కొన్నారు. అవకాశాలను సొంతం చేసుకునేందుకు గ్రూపు కంపెనీలు, అసోసియేట్స్ మధ్య సహకారం మెరుగుపడాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment