
న్యూయార్క్: ఫోర్బ్స్ తాజాగా తొలి క్రిప్టో కరెన్సీ సంపన్నుల జాబితాను విడుదల చేసింది. ఇందులో రిపిల్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ లార్సెన్ అగ్రస్థానంలో నిలిచారు. ఈయన క్రిప్టో నికర విలువ 7.5– 8 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనా. ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. 2017లో బిట్‌కాయిన్, ఇథీరియమ్, ఎక్స్‌ఆర్‌పీ అనే మూడు ప్రముఖ క్రిప్టోకరెన్సీల సగటు విలువలో మార్పు 14,409 శాతంగా ఉంది.
దాదాపు 1,500 క్రిప్టో కరెన్సీలున్నాయి. వీటి సమష్టి విలువ 550 బిలియన్ డాలర్లు. 2017 ప్రారంభం నుంచి చూస్తే ఈ కరెన్సీల విలువ 31 శాతం మేర ఎగసింది. జోసెఫ్ లుబిన్ (క్రిప్టో నికర విలువ: 1–5 బిలియన్ డాలర్లు), చాంగ్‌పెంగ్ ఝావో (1–1.2 బిలియన్ డాలర్లు), కామెరాన్ అండ్ టైలెర్ వింక్‌లెవోస్ (900 మిలియన్– 1.1 బిలియన్ డాలర్లు), మాథ్యూ మెలాన్ (900 మిలియన్–1.1 బిలియన్ డాలర్లు) తదితరులు ఈ జాబితాలో స్థానం పొందారు.
అధిక ఒడిదుడుకుల నేపథ్యంలో నికర విలువ అంచనాలను ఏకమొత్తంగా కాకుండా శ్రేణి రూపంలో వెల్లడించింది. 2018 జనవరి 19 నాటి క్రిప్టో కరెన్సీల విలువ ఆధారంగా ఈ సంపన్నుల జాబితాలను రూపొందించారు. ఇందులో స్థానం దక్కించుకోవాలంటే కనీసం 350 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీలను కలిగి ఉండాలి. భారత్‌లో క్రిప్టో కరెన్సీలకు చట్టబద్ధత లేదు.
Comments
Please login to add a commentAdd a comment