మరో 5,000 మంది నియామకం
♦ 2020 నాటికి రూ.6,500 కోట్ల టర్నోవర్
♦ హెచ్‌టీసీ గ్లోబల్ సీఈవో మాధవ రెడ్డి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ, బీపీవో సేవల రంగంలో ఉన్న హెచ్‌టీసీ గ్లోబల్ సర్వీసెస్ యూఎస్‌కు చెందిన ఐటీ కన్సల్టింగ్ సర్వీసెస్ సంస్థ సైబర్‌ను కైవసం చేసుకుంది. ఈ డీల్ విలువ సుమారు రూ.600 కోట్లు. యూఎస్‌తోపాటు భారత్‌లోనూ కార్యాలయాలను నిర్వహిస్తున్న సైబర్‌లో ఉద్యోగుల సంఖ్య 3,500 పైమాటే. ఈ కంపెనీ కొనుగోలుతో కొత్త మార్కెట్లకు విస్తరించేందుకు వీలైందని హెచ్‌టీసీ గ్లోబల్ సర్వీసెస్ ప్రెసిడెంట్, సీఈవో మాధవరెడ్డి గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. సైబర్ కోసం యూఎస్‌లో కొత్త నియామకాలు చేపడతామని ఆయన చెప్పారు. ప్రస్తుతం హెచ్‌టీసీ గ్లోబల్ టర్నోవర్ రూ.3,900 కోట్లుంది.
భారత్‌తోపాటు యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ, ఇండోనేసియా, సింగపూర్, మలేసియా, యూఏఈలో కంపెనీకి కార్యాలయాలున్నాయి. భారత్‌లో హైదరాబాద్, చెన్నై, గుర్గావ్, ముంబైలో ఆఫీసులను నిర్వహిస్తోంది. 7,500 మందికి పైగా సిబ్బంది ఉన్నారు. 2020 నాటికి రూ.6,500 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకున్నట్టు సీఈవో వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా కొత్తగా 5,000 పైచిలుకు నియామకాలు చేపడతామని పేర్కొన్నారు. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియే తమవద్ద లేదని ఆయన స్పష్టం చేశారు. హెల్త్‌కేర్ ఐటీ రంగంలో సేవలు అందిస్తున్న యూఎస్ కంపెనీ కేర్‌టెక్ సొల్యూషన్స్‌ను 2014లో హెచ్‌టీసీ కైవసం చేసుకుంది.