లుపిన్ చేతికి బ్రెజిల్ కంపెనీ
న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం లుపిన్ తాజాగా బ్రెజిల్‌కి చెందిన మెడ్‌క్విమికా ఇండస్ట్రియా ఫార్మాస్యూటికా సంస్థను కొనుగోలు చేసింది. అయితే ఇందుకోసం ఎంత వెచ్చించినదీ మాత్రం కంపెనీ వెల్లడించలేదు. లాటిన్ అమెరికా మార్కెట్లో తమ స్థానం పటిష్టం చేసుకునేందుకు ఈ కొనుగోలు ఉపయోగపడగలదని బుధవారం లుపిన్ తెలిపింది. కొన్నాళ్ల క్రితం మెక్సికోకి చెందిన ల్యాబరేటరియోస్ గ్రిన్‌ను కొనుగోలు చేయడం సైతం ఇందుకు లాభించగలదని పేర్కొంది.
1975లో ఏర్పాటైన మెడ్‌క్విమికా .. బ్రాండెడ్ జనరిక్స్, ఓవర్ ది కౌంటర్ ఔషధాలను ఉత్పత్తి చేస్తోంది. 2014 ఏడాదిలో 31 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. 550 మంది ఉద్యోగులు ఉన్నారు.
క్యూ4లో లుపిన్ లాభం డౌన్..
అమెరికాలో ఔషధాల అనుమతుల్లో జాప్యం తదితర అంశాల కారణంగా మార్చ్‌తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో లుపిన్ నికర లాభం 1 శాతం క్షీణించి రూ. 547 కోట్లకు పరిమితమైంది. క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇది రూ. 553 కోట్లు. మరోవైపు నాలుగో త్రైమాసికంలో ఆదాయాలు రూ. 3,052 కోట్ల నుంచి రూ. 3,054 కోట్లకు పెరిగాయి. బుధవారం బీఎస్‌ఈలో లుపిన్ షేరు ధర 3.35 శాతం క్షీణించి రూ. 1,691 దగ్గర ముగిసింది.