నియామకాల్లో తగ్గుదలతో ఇబ్బందే
హైదరాబాద్: వినూత్న భారత్ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ఐ ల్యాబ్స్ మేనేజింగ్ డైరెక్టర్ వై.శ్రీనిరాజు చెప్పారు. గచ్చిబౌలిలోని ఐఎస్‌బీలో గురువారం ‘టై– ఐఎస్‌బీ కనెక్ట్ –ది నెక్ట్స్ ట్రిలియన్ –వేర్ అండ్ హౌ టు క్రియేట్’ అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘2007కు ఒక ట్రిలియన్ డాలర్లు, 2015కు రెండు ట్రిలియన్ డాలర్లు, 2019 కల్లా మూడు ట్రిలియన్ డాలర్ల జీడీపీని చేరుకునేలా భారతదేశం ప్రణాళికలు రూపొందించుకుంది. 2017లో ప్రస్తుతం జీడీపీ 2.5 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ప్రస్తుతం 7 శాతంగా ఉన్న వృద్ధి రేటు వచ్చే ఐదేళ్లలో రెండింతలు కావాల్సిన అవసరం ఉంది. ఈ తరుణంలో భారతదేశంలో ఐటీ రంగంలో నియామకాలు 2.5 లక్షల వరకూ ఉండాల్సి ఉంది. కానీ 1.2 లక్షల మందినే నియమించారు.
నియామకాల్లో చోటు చేసుకున్న ఈ గణనీయమైన తగ్గుదల వ్యాపారంపై ప్రభావం చూపిస్తోంది’’ అని శ్రీనిరాజు వివరించారు. ఏషియన్ పెయింట్స్ మాజీ ప్రెసిడెంట్ జలాజ్ అశ్విన్ ధని మాట్లాడుతూ పాతికేళ్ల క్రితం ఏషియన్ పెయింట్స్ సంస్థ టర్నోవర్ వెయ్యి కోట్లని, ఇప్పుడది 1.10 లక్షల కోట్లకు చేరిందని చెప్పారు. ప్రధానంగా కొనుగోలు దారులను దృష్టిలో పెట్టుకొని వారి అభిరుచులకు అనుగుణంగా ఉత్పత్తులను చేస్తే మార్కెట్ ఉంటుందన్నారు.
బీఈ ఇండియా ఎండీ మహిమ దాట్ల మాట్లాడుతూ భారతదేశంలో ఫార్మా రంగానికి ఒకప్పటి స్వర్ణ యుగం ఇప్పుడు లేదన్నారు. ‘‘1948లో ఫార్మా కంపెనీ పెట్టాం. రెండు దశాబ్దాల తరవాత వాక్సిన్ల ఉత్పత్తిలోకి వచ్చాం. ఎన్నో ఇబ్బందులు వచ్చినా మారుతున్న టెక్నాలజీని వినియోగిస్తూ మనగలిగాం’’ అని చెప్పారు. ఐఎస్‌బీ డీన్ రాజేంద్ర శ్రీవాస్తవ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో పలువురు ఇన్వెస్టర్లు, వ్యాపార సంస్థల ప్రతినిధులు, స్టార్టప్ సంస్థల నిర్వాహకులు, ఐఎస్‌బీ విద్యార్థులు పాల్గొన్నారు.