స్విస్ బ్యాంకుల్లో భారీగా తగ్గిన భారతీయుల డబ్బు
♦ 2016లో రూ.4,500 కోట్లు
♦ ఏడాదిలో సగానికి సగం డౌన్
జ్యూరిచ్, న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సొమ్ము కనిష్ట స్థాయికి పడిపోయింది. 2015తో పోల్చితే 2016లో ఈ డబ్బు సగానికి సగం పడిపోయి, రూ. 4,500 కోట్లుగా(676 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్) నమోదయ్యింది. విదేశాల్లో ఉన్న నల్లడబ్బును తీసుకురావడానికి సంబంధించి భారత్‌లో పెరుగుతున్న ఒత్తిడి, ఈ దిశలో కేంద్రం ప్రయత్నాల వంటి నేపథ్యంలో వెలువడిన గణాంకాలు ఇవి. అయితే 2016లో ప్రపంచవ్యాప్తంగా విదేశీ క్లెయింట్ల డబ్బు స్విస్ బ్యాంకుల్లో పెరగడం విశేషం. ఈ మొత్తం దాదాపు రూ.96 లక్షల కోట్లకు(1.42 ట్రిలియన్ స్విస్ ఫ్రాంక్స్) చేరడం గమనార్హం. 2015లో ఈ మొత్తం 1.41 ట్రిలియన్ స్విస్ ఫ్రాంక్స్.
స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్‌ఎన్‌బీ)తాజా గణాంకాల ప్రకారం... భారతీయులకు స్విస్ బ్యాంకుల్లో ప్రత్యక్షంగా ఉన్న మొత్తం 664.8 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్. ట్రస్టీల రూపంలో ఉన్న మొత్తం 11 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్. వరుసగా మూడేళ్ల నుంచీ స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు తగ్గుతూ వస్తోంది. 1987 నుంచీ స్విస్ తన బ్యాంకుల్లో విదేశీయుల డబ్బు గణాంకాలను ప్రకటిస్తోంది. ఆతర్వాత భారతీయుల డబ్బు ఇంత తక్కువ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. 2006 మధ్య నెలల్లో ఇక్కడ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు రికార్డు స్థాయి రూ.23,000 కోట్లకు చేరడం గమనార్హం.