మాతృదేశానికి తోడునివ్వడంలో మనవాళ్లే టాప్‌ | Indians Are Sending Huge Amount Of Money From Abroad To India | Sakshi
Sakshi News home page

మాతృదేశానికి తోడునివ్వడంలో మనవాళ్లే టాప్‌

Published Mon, Dec 12 2022 4:18 AM | Last Updated on Mon, Dec 12 2022 5:02 AM

Indians Are Sending Huge Amount Of Money From Abroad To India - Sakshi

శ్రీకాంత్‌రావు.కె, సాక్షి, ప్రత్యేక ప్రతినిధి
ఉద్యోగం, ఉపాధి, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్తున్న భారతీయులు తాము సంపాదించిన సొమ్మును స్వదేశానికి పంపడంలో ప్రపంచ రికార్డు సృష్టిస్తున్నారు. స్వదేశంలోని తమ కుటుంబ అవసరాలు, పెట్టుబడుల కోసం గత ఏడాది ఏకంగా 88 బిలియన్‌ డాలర్లను స్వదేశానికి తరలించగా.. ఈ ఏడాది ఇది ఏకంగా 100 బిలియన్‌ డాలర్లకు చేరనున్నట్టు ప్రపంచ బ్యాంకు అంచనా వేయడం గమనార్హం.

మన కరెన్సీలో చెప్పుకోవాలంటే.. 8,24,205 కోట్లు (ఎనిమిది లక్షల 24 వేల 205 కోట్ల రూపాయలు) అన్నమాట. ఇలా విదేశాల్లో సంపాదించిన సొమ్మును స్వదేశానికి తరలించడాన్ని రెమిటెన్స్‌గా పిలుస్తారు. ప్రపంచంలో భారత్‌కు వచ్చే రెమిటెన్సులే ఎక్కువ. ఈ రెమిటెన్సులు మన దేశ వాణిజ్య లోటును తగ్గించేందుకు, విదేశీ మారకద్రవ్య నిల్వలు పెరిగేందుకు తోడ్పడుతున్నాయని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, మాంద్యం భయం ఉన్నప్పటికీ భారతదేశానికి భారీగా రెమిటెన్సులు రావడం ఆశావహ పరిణామమని చెప్తున్నారు. 

ఈ ఆర్థిక సంవత్సరం ప్రత్యేకం 
ఎన్నో ఏళ్లుగా మన దేశానికి గణనీయంగా రెమిటెన్సులు వస్తున్నా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరీ ప్రత్యేకమైనది. విదేశాలకు వెళ్లిన భారతీయులు అక్కడ సంపాదించి మాతృదేశానికి ఏటా పంపిస్తున్న సంపద మొదటిసారిగా వంద బిలియన్‌ డాలర్లకు చేరుకోనుంది. మరే దేశం కూడా భారత్‌ దరిదాపుల్లో లేకపోవడం గమనార్హం. ఇక్కడ కుటుంబాన్ని వదిలివెళ్లిన వారు తమ కుటుంబ అవసరాల కోసం, ఆస్తులు సమకూర్చుకోవడానికి పంపిస్తున్న సంపద.. ఇదే సమయంలో దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతోంది. భారత్‌కు వస్తున్న రెమిటెన్సులు ప్రధానంగా గల్ఫ్‌ దేశాలతోపాటు అభివృద్ధి చెందిన అమెరికా, బ్రిటన్, సింగపూర్, న్యూజిలాండ్‌ దేశాల నుంచి అందుతున్నాయి. కరోనా సమయంలో రెమిటెన్సులు కాస్త తగ్గినట్టు కనిపించినా.. అన్ని దేశాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో తిరిగి పుంజుకున్నాయి. 

భయాలు తొలగి.. ఆదాయం పెరిగి.. 
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్లు, ఆంక్షలు, ఉద్యోగాల కోత, ఉపాధికి దెబ్బతో రెండేళ్లపాటు దీని ప్రభావం కనిపించింది. కొన్ని నెలలుగా ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. విదేశాలకు వలసలు, స్వదేశానికి వచ్చే రెమిటెన్సులు పెరుగుతున్నాయి.భారతీయులు 2021లో 7.5 శాతం పెరుగుదలతో 89.4 బిలియన్‌ డాలర్లను మాతృదేశానికి పంపగా.. ఇది 2022లో 12 శాతం పెరుగుదలతో 100 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని 
ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఇందుకు ప్రధానంగా ఆరు కారణాలను విశ్లేషించింది. 

మాతృదేశం నుంచి వలసలు వెళ్లినవారు తమ దేశానికి నిధులు పంపించాలన్న సంకల్పం. 
కరోనా మహమ్మారి తర్వాత క్రమంగా పరిశ్రమలు, సేవలు, పర్యాటక, విమానయానం తదితర రంగాలు మామూలు స్థితికి చేరుకోవడం, తమ దేశాలకు వెళ్లిన వారు తిరిగి విదేశాల్లో పనులకు వెళ్లడం. 
ఆయా దేశాల ఆర్థిక పరిస్థితులు మెరుగవడంతో విదేశాల్లోని భారతీయుల సంపాదన పెరిగిస్వదేశానికి ఎక్కువ నిధులు పంపించడం. 
విదేశీ మారకద్రవ్యంలో మార్పులు, డాలర్‌తో రూపాయి విలువ తగ్గడం కూడా ఎక్కువ నిధుల ప్రవాహానికి కారణం. 
కరోనా సమయంలో అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక ఉద్దీపనలు ప్రకటించడంతో.. సంస్థలు ఉద్యోగులను కాపాడుకోవడం, వేతనాలు పెరగడం వంటివి జరగడం. 
పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ద్రవ్యోల్బణం పెరుగుదల వలసదారుల నిజ ఆదాయాన్ని తగ్గించాయి. అయినా మాతృదేశానికి పంపించే నిధులు పెరిగాయి. 

దక్షిణాసియాలో పెరుగుదల 3.5 శాతం 
దక్షిణాసియా దేశాలకు రెమిటెన్సులు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి 3.5 శాతం అదనంగా ఉంటాయని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. దక్షిణాసియా దేశాలకు మొత్తంగా 163 బిలియన్‌ డాలర్లు వస్తాయని పేర్కొంది. ఇందులో ఒక్క భారత వాటానే 100 బిలియన్‌ డాలర్లుగా ఉండబోతున్నట్టు తెలిపింది. విదేశాల నుంచి మాతృదేశాలకు పంపే సొమ్ముపై చార్జీలు కూడా దక్షిణాసియాలో తక్కువని వెల్లడించింది. 

వచ్చే ఏడాది తగ్గే అవకాశం!
అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రగతి తగ్గుదల, ఆర్థిక మాంద్యం ప్రభావం వల్ల దక్షిణాసియా దేశాలకు నిధులు రాక 2023 ఆర్థిక సంవత్సరంలో తగ్గే అవకాశం ఉందని ప్రపంచబ్యాంకు అంచనా వేసింది. దక్షిణాసియా దేశాలకు రెమిటెన్సులు ఈ ఏడాది 3.5 శాతం పెరిగితే.. 2023లో పెరుగుదల 0.7 శాతానికే పరిమితం కావొచ్చని పేర్కొంది. భారత్‌కు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న గల్ఫ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ కంట్రీస్‌ (జీసీసీ)లోని సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్‌ తదితర దేశాల నుంచి రెమిటెన్సులు తగ్గవచ్చని అంచనా వేసింది. అయితే అమెరికా, యూకే, సింగపూర్‌ తదితర దేశాల్లో ఎక్కువ వేతనాలు అందుకునే భారతీయులు స్వదేశానికి ఎక్కువ నిధులు పంపే అవకాశం ఉందని తెలిపింది. మొత్తంగా చాలా దేశాలకు రెమిటెన్సులు తగ్గిపోయినా.. భారతదేశానికి మాత్రం కనీసం నాలుగుశాతం మేర పెరగవచ్చని పేర్కొంది. 

విదేశీ పెట్టుబడుల కంటే ఇవే అధికం 
మన దేశంలోకి వచ్చే విదేశీ పెట్టుబడుల కంటే మనవాళ్లు పంపిస్తున్న నిధులే నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి. భారతీయులు దేశాభివృద్ధి కోసం పడుతున్న తపన దీని ద్వారా అవగతం అవుతోందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. మనదేశ జనాభాలో కేవలం 1.3 శాతం మాత్రమే ఇతర దేశాలకు వలస వెళ్లారని.. కానీ అత్యధికంగా రెమిటెన్సులు పంపుతున్నారని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడిస్తోంది.  

గల్ఫ్‌ నుంచి తగ్గి అమెరికా, యూరోప్‌ నుంచి పెరుగుతున్నాయి 
కొన్నేళ్లుగా అత్యధిక రెమిటెన్స్‌ పొందుతున్న దేశం మనదే. చైనాను కూడా ఎప్పుడో దాటేశాం. విదేశాల్లో భారతీయులు కష్టపడి సంపాదించి ఆదా చేసిన సొమ్మును ఇక్కడి తమ కుటుంబాల అవసరాలు, ఇతర కమిట్‌మెంట్లు, పెట్టుబడుల కోసం పంపిస్తున్నారు. గతంలో గల్ఫ్‌దేశాల్లో కార్మికులు సంపాదించిన చిన్నచిన్న మొత్తాలే దేశంలోని తమ కుటుంబాలకు ఎక్కువగా అందేవి.

ఇప్పుడు ఇతర దేశాల్లో పెద్ద మొత్తాల్లో సంపాదిస్తున్నవారు కూడా తమ వ్యక్తిగత రెమిటెన్స్‌లు పంపించడం పెరిగింది. దాదాపు రెండున్నరేళ్ల కరోనా పరిణామాల్లో కూడా ఇతర దేశాల నుంచి వచ్చే డబ్బుపై ప్రభావం పడలేదు. గతంలో గల్ఫ్‌దేశాల నుంచి ఎక్కువగా రెమిటెన్సులు వచ్చేవి. ఇప్పుడు అమెరికా, యూరప్‌ల నుంచి వస్తున్నాయి. భారత్‌ చేసే ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువ. వాటికోసం భారీగా విదేశీ మారక ద్రవ్యం చెల్లించాల్సిన పరిస్థితిలో లోటు తలెత్తుతోంది. అయితే విదేశాల నుంచి అందుతున్న రెమిటెన్స్‌లు కొంతవరకు ఈ లోటును పూడ్చుతున్నాయి. 
– డి.నర్సింహారెడ్డి, ప్రముఖ ఆర్థికవేత్త, హెచ్‌సీయూ స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ విశ్రాంత డీన్‌ 
 
విదేశీ మారక నిల్వలు పెరుగుతాయి 
భారత షేర్‌ మార్కెట్‌లోకి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల రూపంలో విదేశీ మారక ద్రవ్యం వచ్చినా అది తిరిగి వెళ్లిపోతోంది. చైనాకు వస్తున్న విధంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) రూపంలో మనకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నారైల నుంచి విదేశీ కరెన్సీ, డాలర్ల రూపంలో వచ్చే రెమిటెన్సుల వల్ల దేశంలో విదేశీ మారక నిల్వలు పెరుగుతాయి. రెమిటెన్సులు మరింతగా పెరగడంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పడిపోతున్న రూపాయి విలువ కోలుకునేందుకు ఇది
సహాయపడుతుంది. 
– డి.పాపారావు, ఆర్థిక రంగ విశ్లేషకుడు   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement