వాషింగ్టన్: కరోనా కష్టకాలంలోనూ విదేశాల్లోని భారతీయులు సొంత గడ్డకు భారీ మొత్తాలను (రెమిటెన్సులు) పంపారు. 2020లో రెమిటెన్సుల ద్వారా భారతీయులు పొందిన మొత్తం 83 బిలియన్ డాలర్లు. 2019తో పోల్చితే ఈ మొత్తాలు కేవలం 0.2% తగ్గాయి. 2019లో భారత్ స్వీకరిం చిన నిధులు 83.3 బిలియన్ డాలర్లు. 2020 రెమిటెన్సులకు సంబంధించి ప్రపంచబ్యాంక్ విడుదల చేసిన తాజా నివేదికలోని ముఖ్యాంశాలను చూస్తే..
► 2019లో చైనా 68.3 బిలియన్ డాలర్లను రెమిటెన్సుల రూపంలో పొందితే, 2020లో ఈ పరిమాణం 59.6 బిలియన్ డాలర్లకు పడిపోయింది. తద్వారా భారత్ తర్వాత రెండవ స్థానంలో చైనా నిలిచింది.
► తాజా సమీక్షా సంవత్సరంలో భారత్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ) నుంచి రెమిటెన్సులు 17 శాతం పడిపోయాయి. అయితే అమెరికా, ఇతర దేశాల నుంచి భారీగా నిధులు రావడంతో ఈ ప్రభావం మొత్తం స్వీకరణలపై పడలేదు. గల్ఫ్ నుంచి పెద్ద ఎత్తున భారతీయులు దేశానికి తిరిగి రావడం రెమిటెన్సులపై ప్రభావం చూపింది.
► భారత్, చైనాల తర్వాతి స్థానంలో మెక్సికో (42.8 బిలియన్ డాలర్లు), ఫిలిప్పైన్స్ (34.9 బిలియన్ డాలర్లు), ఈజిప్టు (29.6 బిలియన్ డాలర్లు), పాకిస్తాన్ (26 బిలియన్ డాలర్లు), ఫ్రాన్స్ (24.4 బిలియన్ డాలర్లు), బంగ్లాదేశ్ (21 బిలియన్ డాలర్లు) ఉన్నాయి.
► పాకిస్తాన్‌కు రెమిటెన్సులు 17 శాతం పెరిగాయి. ఇందులో అధిక భాగం సౌదీ అరేబియా నుంచి వచ్చాయి. తరువాతి స్థానంలో యూరోపియన్ యూనియన్ దేశాలు, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ ఉన్నాయి.
► బంగ్లాదేశ్ విషయంలో పెరుగుదల రేటు 18.4 శాతం ఉంటే, శ్రీలంక విషయంలో ఈ రేటు 5.8 శాతంగా ఉంది.
► నేపాల్ విషయంలో ఈ పరిమాణం 2 శాతం పడిపోయింది.
► 2020లో భారీగా రెమిటెన్సులు పడిపోతాయని అంచనావేసినప్పటికీ, ఇలాంటి ప్రతికూల పరిస్థితి నెలకొనలేదు. దిగువ, మధ్య ఆదాయ దేశాలకు 2019లో 548 బిలియన్ డాలర్లు వస్తే, 2020లో ఈ పరిమాణం కేవలం 1.6 శాతం తగ్గి 540 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది ఆయా దేశాలకు పెద్ద ఆదాయ వనరుగా మారింది.
► రెమిటెన్సులు పెరిగిన ప్రాంతాల్లో లాటిన్ అమెరికా, కరేబియన్ (6.5 శాతం), దక్షిణ ఆసియా (5.2 శాతం), పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా (2.3 శాతం)లు ఉన్నాయి.
► తగ్గిన ప్రాంతాల్లో తూర్పు ఆసియా, పసిఫిక్ (7.9 శాతం), యూరోప్, సెంట్రల్ ఆసియా (9.7 శాతం), సహారా ప్రాంత ఆఫ్రికా (12.5 శాతం) ఉన్నాయి.
అమెరికా నుంచే అత్యధిక రెమిటెన్సులు
రెమిటెన్సులు భారీగా తరలివెళ్లిన దేశాల్లో అమెరికా 68 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో నిలిచింది. తరువాతి స్థానాల్లో యూఏఈ (43 బిలియన్ డాలర్లు), సౌదీ అరేబియా (34.5 బిలియన్ డాలర్లు), స్విట్జర్లాండ్ (27.9 బిలియన్ డాలర్లు), జర్మనీ (22 బిలియన్ డాలర్లు), చైనా (18 బిలియన్ డాలర్లు) నిలిచాయి. భారత్ విషయంలో ఈ పరిమాణం 7 బిలియన్ డాలర్లుగా ఉంది. 2019లో ఈ పరిమాణం 7.5 బిలియన్ డాలర్లుగా ఉంది.
మనోళ్లు పంపింది 83 బిలియన్ డాలర్లు..!
Published Fri, May 14 2021 4:04 AM | Last Updated on Fri, May 14 2021 4:04 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment