ముంబై: కోవిడ్–19పరమైన కారణాల నేపథ్యంలో భారత్‌కు వచ్చే రెమిటెన్సుల్లో గల్ఫ్ దేశాల వాటా గణనీయంగా తగ్గింది. 2016–17తో పోలిస్తే 2020–21లో 50 శాతం పైగా క్షీణించి, 30 శాతానికి పరిమితమైంది. అదే సమయంలో బ్రిటన్, అమెరికా, సింగపూర్‌ల వాటా 36 శాతానికి చేరింది. రెమిటెన్సుల ధోరణులపై కోవిడ్ ప్రభావాల మీద నిర్వహించిన అయిదో విడత సర్వే ఫలితాలను ఉటంకిస్తూ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఒక ఆర్టికల్‌లో ఈ విషయాలు వెల్లడించింది.
ఆర్‌బీఐలోని ఆర్థిక, పాలసీ పరిశోధన విభాగం అధికారులు దీన్ని రూపొందించారు. ఈ ఆర్టికల్‌లో వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆయా రచయితలవే తప్ప రిజర్వ్ బ్యాంక్ ఉద్దేశాలను ఇవి ప్రతిఫలించవని ఆర్‌బీఐ పేర్కొంది. వలసలు మందగించడం, ఎక్కువ మంది ప్రవాస భారతీయులు ఉపాధి పొందుతున్న అసంఘటిత రంగాలపై కోవిడ్ ప్రతికూల ప్రభావం గణనీయంగా ఉండటం తదితర అంశాలు గల్ఫ్ దేశాల నుంచి రెమిటెన్సులు తగ్గడానికి కారణం కావచ్చని ఆర్టికల్ అభిప్రాయపడింది.
2020–21లో వచ్చిన రెమిటెన్సుల్లో తక్కువ మొత్తాలతో కూడిన లావాదేవీల వాటా పెరిగినట్లు పేర్కొంది. అత్యధికంగా భారత్‌కు రెమిటెన్సులు వస్తున్న దేశాల జాబితాలో 23 శాతం వాటాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ని అధిగమించి అమెరికా అగ్రస్థానంలో నిల్చింది.
Comments
Please login to add a commentAdd a comment