ఆన్‌లైన్ కంపెనీలపై కేంద్రం కన్ను | Industry in Maharashtra is waiting for change: Nirmala Sitaraman | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్ కంపెనీలపై కేంద్రం కన్ను

Published Thu, Oct 9 2014 1:26 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

ఆన్‌లైన్ కంపెనీలపై కేంద్రం కన్ను - Sakshi

ఆన్‌లైన్ కంపెనీలపై కేంద్రం కన్ను

- ఫ్లిప్‌కార్ట్‌పై ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం...
- వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి...

న్యూఢిల్లీ: ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ సేల్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కేంద్రం కూడా రంగంలోకి దిగింది. ట్రేడర్ల ఫిర్యాదులు, ఆందోళనలను పరిశీలిస్తామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఈ-కామర్స్ రిటైల్ బిజినెస్ వ్యవహారాల్లో స్పష్టతకు సంబంధించి చర్యలపై దృష్టిపెట్టనున్నట్లు ఆమె వెల్లడించారు. ‘బిగ్ బిలియన్ డే’ పేరుతో ఫ్లిప్‌కార్ట్ సోమవారం పలు ఉత్పత్తులను కారుచౌకగా ఆఫర్ చేయడం తెలిసిందే. ఈ మెగా ఆఫర్ ద్వారా 10 గంటల్లోనే రూ.600 కోట్లకుపైగా అమ్మకాలు సాధించామని ఫ్లిప్‌కార్ట్ చెప్పుకుంది.

అయితే, వెబ్‌సైట్ క్రాష్ కావడం, ఆఫర్ మొదలైన కొద్ది వ్యవధికే స్టాక్ లేదంటూ చెప్పడం, డిస్కౌంట్ పేరుతో అధిక ధరలకు విక్రయించిందంటూ సోషల్ మీడియాలో కస్టమర్లు దుమ్మెత్తిపోశారు. దీంతో ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యం క్షమాపణ కూడా చెప్పింది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని వేడుకుంది. మరోపక్క, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ సేల్‌పై చిన్నాపెద్దా రిటైల్ వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి భారీ డిస్కౌంట్ల కారణంగా సాంప్రదాయ రిటైల్ మార్కెట్ తీవ్రంగా దెబ్బతింటుందంటూ ధ్వజమెత్తారు.
 
‘ఫ్లిప్‌కార్ట్ విషయంలో మాకు చాలా ఫిర్యాదులు అందాయి. చాలామంది ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మేం తప్పకుండా దృష్టిపెడతాం. ఈ-కామర్స్ రిటైలింగ్‌కు ప్రత్యేక పాలసీ అవసరమా లేదంటే మరింత స్పష్టత ఇస్తే సరిపోతుందా అనేది అధ్యయనం చేస్తాం. త్వరలోనే ఈ అంశంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’ అని నిర్మల వివరించారు. ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ రిటైలర్లు ఎడాపెడా ఆఫర్లను ప్రకటిస్తుండటంపై అఖిలభారత ట్రేడర్ల సమాఖ్య(సీఏఐటీ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తాజాగా నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసింది. అసలు ఇంత భారీగా డిస్కౌంట్లను ఎలా ఇస్తున్నారో దర్యాప్తు చేయాలని.. ఈ-కామర్స్ రంగానికి ప్రత్యేక నియంత్రణ సంస్థ ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేసింది. కాగా, కొత్త విదేశీ వాణిజ్య విధానం(ఎఫ్‌టీపీ) త్వరలోనే ప్రకటిస్తామని.. గత పాలసీలకు చాలా భిన్నంగా ఉంటుందని నిర్మల తెలిపారు.
 
సీఎస్‌ఆర్ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయ్...
కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్) కింద కంపెనీల నిధుల వ్యయానికి సంబంధించి కొత్త కంపెనీల చట్టంలో స్పష్టంగా నిబంధనలు ఉన్నాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇందులో ఎలాంటి గందరగోళానికి తావులేదన్నారు. బుధవారమిక్కడ ఇండియన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నెట్‌వర్క్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన సీఎస్‌ఆర్ నిబంధనల ప్రకారం.. కార్పొరేట్ కంపెనీలు తమ లాభాల్లో కనీసం 2 శాతాన్ని సామాజిక కార్యకలాపాలకు వెచ్చించాల్సి ఉంటుంది.
 
నోకియా ప్లాంట్ మూసివేతపై కూడా...
చెన్నైలో మొబైల్స్ తయారీ ప్లాంట్ కార్యకాలపాలను వచ్చే నెల 1 నుంచి నిలిపివేయనున్నట్లు నోకియా కార్పొరేషన్ ప్రకటించడంపై నిర్మలా సీతారామన్ స్పందించారు. దీన్ని పరిష్కరించడంపై దృష్టిపెడతామన్నారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.  నోకియా మొబైల్ హ్యాండ్‌సెట్ వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే, పన్ను సంబంధ కేసుల కారణంగా చెన్నైలోని నోకియా ప్లాంట్ మాత్రం ఈ డీల్‌లో లేకుండా పోయింది.

ఈ ప్లాంట్ నుంచి మొబైల్స్ కొనుగోళ్ల ఒప్పందాన్ని మైక్రోసాఫ్ట్ రద్దు చేసుకోవడంతో.. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కార్యకలాపాలను ఆపేస్తున్నట్లు నోకియా ప్రకటించింది. దీంతో ఇంకా ఇక్కడ పనిచేస్తున్న సుమారు 900 మంది ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కాగా, నోకియా చర్యలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీ లిస్తున్నామని నోకియా ఇండియా ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు, ఎంఎల్‌ఏ ఎ. సౌందరరాజన్ పేర్కొన్నారు. అనేక ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను గాలికొదిలేసి.. కంపెనీ అన్యాయం గా వ్యవహరిస్తోందన్నారు. అయితే, ఇప్పుడున్న మిగతా ఉద్యోగులపై ప్రభావం పడకుండా ఆప్షన్లను వెతుకుతున్నామని.. నిర్ణయం ఖరారైన వెంటనే తెలియజేస్తామని నోకియా పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement