ఫ్లిప్‌కార్ట్‌పై కొనసాగుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తు
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ రిటైల్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న ఈకామర్స్ బిజినెస్‌కు సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) నిబంధనల ఉల్లంఘన జరిగిందా అన్న అంశంపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే మీడియాలో వస్తున్నట్లు గత వారం బిగ్ బిలియన్ డే పేరుతో నిర్వహించిన ఆన్‌లైన్ అమ్మకాలపై ఎలాంటి దర్యాప్తునూ చేపట్టలేదని స్పష్టం చేసింది.
గత వారం భారీ డిస్కౌంట్‌లతో నిర్వహించిన అమ్మకాలపై పలువురు ట్రేడర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సైతం ఈ అంశంపై తగిన పరిశీలన చేపట్టనున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. కాగా, నిబంధనలమేరకే తాము బిజినెస్ నిర్వహిస్తున్నామని, అవసరమైనప్పుడు అధికారులకు తగిన విధంగా సహకరిస్తామని ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ప్రధానంగా ఎఫ్‌డీఐ నిబంధనలకు సంబంధించి ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఇతర ఈరిటైల్ కంపెనీలపై దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారి ఒకరు వివరించారు.