భారత ఫార్మా కంపెనీ చేతికి యూరప్ సంస్థ | Intas: Wish you were listed | Sakshi
Sakshi News home page

భారత ఫార్మా కంపెనీ చేతికి యూరప్ సంస్థ

Published Sat, Oct 8 2016 1:55 AM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM

భారత ఫార్మా కంపెనీ చేతికి యూరప్ సంస్థ

భారత ఫార్మా కంపెనీ చేతికి యూరప్ సంస్థ

ఆక్టావిస్ జనరిక్స్ వ్యాపారాన్ని కొంటున్న ఇంటాస్ ఫార్మా 
డీల్ విలువ రూ.5,100కోట్లు

 ముంబై: భారత అతి పెద్ద అన్‌లిస్టెడ్ ఫార్మా కంపెనీ.. ఇంటాస్ ఫార్మా, యూరప్‌లోని ఆక్టావిస్ కంపెనీ జనరిక్స్ వ్యాపారాన్ని రూ.5,100 కోట్ల(60 కోట్ల పౌండ్ల)కు కొనుగోలు చేయనున్నది. అంతా నగదులోనే ఈ యూకే  కంపెనీని ఇంటాస్ ఫార్మా కొనుగోలు చేయడానికి ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఇంటాస్ ఫార్మా పూర్తి అనుబంధ సంస్థ, అకార్డ్ హెల్త్‌కేర్ ఈ వ్యాపారాన్ని చేజిక్కించుకోనున్నది.  ఒక  యూరప్ ఫార్మా కంపెనీని ఒక భారత కంపెనీ ఈ స్థాయి అత్యధిక ధరకు కొనుగోలు చేయడం ఇదే మొదటిసారి. బ్రెగ్జిట్ అనంతరం ఇంగ్లాండ్‌కు వచ్చిన అతి పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ కూడా ఇదే.

బ్యాంక్‌ల నుంచి రుణం
ఆక్టావిస్ జనరిక్స్  వ్యాపారాన్ని చేజిక్కించుకోవడంతో అహ్మదాబాద్‌కు చెందిన ఇంటాస్ ఫార్మా యూకే, ఐర్లాండ్ జనరిక్స్ మార్కెట్లలో అగ్రశ్రేణి కంపెనీగా అవతరిస్తుందని ఇంటాస్ ఫార్మా వైస్ చైర్మన్, ఎండీ, బినిస్ చద్గర్ చెప్పారు. ఈ డీల్‌కు అవసరమున్న నిధులను ప్రస్తుతమున్న ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ల నుంచి  సమీకరించే ఆప్షన్ ఉందని పేర్కొన్నారు. కానీ, తమ కంపెనీలో మరింత వాటాకు పీఈ ఇన్వెస్టర్లకు ఇచ్చే యోచన లేదని, అందుకే బ్యాంక్‌ల కన్షార్షియమ్ నుంచి  తీసుకుంటున్నామని చెప్పారు.

ఈ వ్యాపారం కొనుగోలుకు కావలసిన నిధులను ఐదేళ్ల రుణంగా బ్యాంక్‌ల కన్సార్షియమ్ అకార్డ్ హెల్త్‌కేర్‌కు ఇవ్వనున్నదని వివరించారు.  తమది ఎలాంటి రుణభారం లేని కంపెనీ అని వివరించారు. తాము కొనుగోలు చేసే  ఈ వ్యాపారం లాభసాటిది అయినందున వంద కోట్ల డాలర్ల రుణం తీసుకున్నా, నాలుగో ఏడాదిలోనే పూర్తిగా రుణాన్ని తీర్చేయగలమన్న ధీమా తమకుందని పేర్కొన్నారు. ఆక్టావిస్ కంపెనీ అత్యున్నత నాణ్యత గల జనరిక్ ఔషధాలను ఫార్మసీలకు, టోకు వర్తకులకు సరఫరా చేస్తోందని తెలిపారు. బర్న్స్‌స్టేపుల్, నార్త్ డెవన్‌ల్లో ప్లాంట్లున్నాయని, ఈ ప్లాంట్లు ఇత ర కంపెనీలకు కాంట్రాక్టు సర్వీసులను  నిర్వహిస్తున్నాయి.

యూరోప్ ఆదాయం రెట్టింపు..
యూకే, ఐర్లాండ్ జనరిక్స్ మార్కెట్లలో ఆక్టావిస్ మొదటి స్థానంలో ఉందని, అందుకే ఈ వ్యాపార కొనుగోలు కోసం తగిన ప్రీమియమ్ చెల్లించామని బినిస్ చద్గర్  పేర్కొన్నారు. ఈ జనరిక్స్ వ్యాపారం కొనుగోలుతో యూరప్ నుంచి తమకు వచ్చే ఆదాయం రెట్టింపై 50 కోట్ల డాలర్లకు పెరుగుతుందని వివరించారు.  భారత అగ్రశ్రేణి పది ఫార్మా కంపెనీల్లో ఒకటైన ఇంటాస్ వార్షికాదాయం వంద కోట్ల డాలర్లకు పైగా ఉంటుందని అంచనా. వీటిల్లో 60 శాతానికి పైగా ఆదాయం అంతర్జాతీయ కార్యకలాపాల నుంచే వస్తోంది. ఇంటాస్ సంస్థ 70కు పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అయితే అధికాదాయం యూకే, యూరప్, అమెరికాల నుంచే వస్తోంది.  సింగపూర్‌కు చెందిన టిమసెక్, క్రిస్‌క్యాపిటల్ సంస్థలకు ఈ కంపెనీలో వాటాలున్నాయి.

Advertisement
Advertisement